వెండితెరపై అద్భుతాలు సృష్టిస్తున్న ఫిల్మ్ మేకర్స్
దిశ, ఫీచర్స్ : సైన్స్ ఫిక్షన్ సినిమాలు అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హాలీవుడ్ సినిమాలే. ఎందుకంటే దాదాపు సగానికి పైగా హాలీవుడ్ సినిమాలు సైన్స్ ఫిక్షన్ ఆధారంగా తెరకెక్కుతుంటాయి. పైగా ఆ చిత్రాలకు మార్కెట్ కూడా ఎక్కువే. అయితే ఇండియాలోనూ సైన్స్ ఫిక్షన్ మూవీస్‌కు ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. దీంతో ఫిల్మ్ మేకర్స్ ఈ తరహా సినిమాలు నిర్మించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ తరహా కథాంశాలతో ప్రజల ఊహాశక్తి పెరుగుతుందని, ఇలాంటి చిత్రాలు రావడం మంచిదేనని […]
దిశ, ఫీచర్స్ : సైన్స్ ఫిక్షన్ సినిమాలు అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హాలీవుడ్ సినిమాలే. ఎందుకంటే దాదాపు సగానికి పైగా హాలీవుడ్ సినిమాలు సైన్స్ ఫిక్షన్ ఆధారంగా తెరకెక్కుతుంటాయి. పైగా ఆ చిత్రాలకు మార్కెట్ కూడా ఎక్కువే. అయితే ఇండియాలోనూ సైన్స్ ఫిక్షన్ మూవీస్‌కు ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. దీంతో ఫిల్మ్ మేకర్స్ ఈ తరహా సినిమాలు నిర్మించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ తరహా కథాంశాలతో ప్రజల ఊహాశక్తి పెరుగుతుందని, ఇలాంటి చిత్రాలు రావడం మంచిదేనని నిపుణులు అభిప్రాయపడుతుండగా.. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయి కూడా. అయితే ఇండియాలో ఫిల్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తొలినాళ్లలోనే(1960, 70) సైన్స్ ఫిక్షన్ మూవీస్ తెరకెక్కడం విశేషం. అప్పటి దర్శకులు అమరత్వం, ఇన్‌విజిబిలిటీ కాన్సెప్ట్స్‌తో వెండితెరపై మాయ చేయగా.. ఈ తరం ఫిల్మ్ మేకర్స్ సైంటిఫిక్ అంశాలకు కొద్దిపాటి ఫిక్షన్‌ను జోడించి పూర్తి సాంకేతికతతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల తీరుతెన్నులపై స్పెషల్ స్టోరీ..
మానవ జీవితంలో వినూత్న మార్పులకు కారణమైన సైన్స్‌కు ఫిక్షన్‌ను జోడించిన మేకర్స్.. వెండితెరపై సినిమాల రూపంలో ఆవిష్కరిస్తే విపరీతంగా అలరించాయి, ప్రేక్షకులను ఊహాలోకంలో విహరించేలా చేశాయి. 1960లో వచ్చిన ‘కలై అరసి, చాంద్ పర్ చడాయే’ వంటి బాలీవుడ్ చిత్రాలను అంతరిక్ష నేపథ్యంలో హాస్యపూరిత పాత్రలతో డిజైన్ చేశారు. వీటిలో ఏలియన్స్ ఉన్నట్లు చిత్రీకరించారు. అయితే ప్రాక్టికల్‌గా ఏలియన్స్‌గా నటించింది మానవులే. ఈ సైన్స్ ఫిక్షన్‌కు కొనసాగింపుగా మానవులను అమరులుగా చూపిస్తూ సినిమా రూపొందించారు. అదే ‘కరుథ రథ్రికల్’. ఈ మూవీలో డాక్టర్.. ఒక వ్యక్తి అదృశ్యమయ్యేందుకు మందు కనిపెడతాడు. ఆ మందు వల్ల మనిషి కనిపించకుండా ఉండి, తన శక్తులతో నేరాలు చేస్తుంటాడు. ఇక ‘నాలయి మనిథన్’ చిత్రంలో సైన్స్ మానవుడికి ఏ విధంగా హెల్ప్ అవుతుందనే ప్రశ్న తలెత్తగా..‘మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే’ మూవీ ‘ఇన్‌విజిబులిటీ’ నేపథ్యాన్ని చర్చించింది. మొత్తంగా సైన్స్‌ను కల్పిత కథగా, కల్పిత కథలో సైన్స్ ఉన్నట్లుగా వినోదం కోసం చిత్రీకరించారు. ‘ఓకే కంప్యూటర్’ భారత తొలి సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రం కాగా, కన్నడ ఫిల్మ్ ‘హాలీవుడ్’ భారత తొలి రోబో చిత్రం.
ఇక తెలుగువాళ్లు ఈనాటికీ గొప్పగా చెప్పుకోదగ్గ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’. భారత తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా అయిన ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించగా, టైమ్ మిషన్ ఆధారంగా కథ నడుస్తుంది. ఈ సూపర్ డూపర్ హిట్ మూవీలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో టైమ్ మిషన్ ద్వారా మొదట శ్రీకృష్ణ దేవరాయల కాలానికి వెళ్లిన హీరో.. తర్వాత భవిష్యత్ కాలంలోకి కూడా ప్రయాణిస్తాడు. ఈ క్రమంలో వీడియో కాల్స్, సెల్‌ఫోన్ కాల్స్ వంటి టెక్నాలజీని ముందే ఊహించి చూపించారు. ఈ సినిమాలో ప్రొఫెసర్ రాందాస్.. కంప్యూటర్ ఆధారంగా ల్యాబ్ పరిశోధనలతో టైమ్ మెషిన్‌ను ముందుకు వెనక్కి తీసుకెళ్తుంటాడు. ఈ ఫిక్షన్ మూవీకి సీక్వెల్ తెరకెక్కించేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగాయి కానీ కార్యరూపం దాల్చలేదు. మొత్తంగా 1950, 90ల నుంచి నేటి వరకు సైన్స్ ఫిక్షన్ జోనర్ సినిమాల శైలిలో గుణాత్మక మార్పయితే కనబడుతోంది.
తమిళ్ డైరెక్టర్ శంకర్ తీసిన ‘రోబో’ సంచలనం సృష్టించగా, దీనికి కొనసాగింపుగా సెల్ టవర్ల వల్ల కలిగే దుష్ఫలితాల నేపథ్యంలో ‘రోబో 2.o’ తీశారు. కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఇక హీరో సూర్య, డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌తో కలిసి చేసిన ‘సెవెన్త్ సెన్స్’ భారతీయ సనాతన శక్తులు, శాస్త్రీయ విధానాలను చర్చించింది. ఇదే హీరో, దర్శకుడు విక్రమ్ కుమార్‌తో తీసిన ‘24’.. టైమ్‌ను బంధిస్తే ఎలా ఉంటుందనే అందమైన ఊహకు చక్కని రూపాన్ని ఇచ్చింది. అలాంటి రోజులు వస్తాయో రావో తెలియదు కానీ, అంతరిక్షం కథాంశంగా వచ్చిన ‘టిక్ టిక్ టిక్’ చిత్రానికి మంచి మార్కులే పడ్డాయి. కానీ సంకల్ప్‌రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన తొలి తెలుగు అంతరిక్ష నేపథ్య సినిమా ‘అంతరిక్షం’ సత్తా చాటలేకపోయింది. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్‌లో వచ్చిన ‘శ్రీవల్లి’ సినిమా బ్రెయిన్ వేవ్‌ను కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం వల్ల ఎదుటివారిని తమ అదుపులోకి తేవడం అనే అంశంతో వచ్చినా.. ఆకట్టుకోలేకపోయింది.
సైన్స్ తరగతులు పిల్లలకు విజ్ఞానాన్ని బోధిస్తాయి. అదే విజ్ఞానానికి కాసింత వినోదాన్ని జోడించి వెండితెరపై ఎన్ని కథలైనా అల్లుకోవచ్చు. అయితే విజ్ఞానం, వినోదం సమపాళ్లలో కలిపినప్పుడు ఈ జోనర్ సినిమాలు హిట్ అవుతాయి. ముఖ్యంగా టైమ్ ఇన్వెర్షన్ నేపథ్యంలో వచ్చే సినిమాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అందుకే హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టొఫర్ నోలన్ ప్రతీ చిత్రం మ్యాగ్జిమమ్ టైమ్ బేసిస్‌పైనే ఉంటుంది. ఫ్యూచర్‌లో సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కే చిత్రాలకే మంచి భవిష్యత్ ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతుండగా, రానున్న రోజుల్లో మరిన్ని సైన్స్ ఫిక్షన్ చిత్రాలు వస్తాయని ఆశిద్దాం.