Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ(Andhra Pradesh), తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) తెలిపింది.
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ(Andhra Pradesh), తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఉపరితల ద్రోణి దక్షిణ కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంటుందని ప్రకటించింది. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపింది. కాగా అల్పపీడనంతో ఏపీలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.
నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు:
ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో వర్షాలు:
ఐఎండీ సూచనల మేరకు ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉత్తర తెలంగాణలో పలు చోట్ల చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో వాతావరణం మేఘావృతమే ఉంటుందని, పలు చోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
కాగా శ్రీలంకకు పశ్చిమంగా, మాల్దీవుల సమీపంలో అక్టోబర్ 1న అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని, ఈ అల్పపీడన ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై అంతగా ఉండకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.