అందుకేనా టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం, సవాళ్లు, ప్రతిసవాళ్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దుమారం రేపుతున్నాయి. పంద్రాగస్టు రోజును మల్కాజ్‌గిరిలో జరిగిన జాతీయ జెండావిష్కరణ కార్యక్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య జరిగిన గొడవ అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోస్తూ ఆరోపణలు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకులు మైనంపల్లి హన్మంతరావు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై చేసిన […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం, సవాళ్లు, ప్రతిసవాళ్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దుమారం రేపుతున్నాయి. పంద్రాగస్టు రోజును మల్కాజ్‌గిరిలో జరిగిన జాతీయ జెండావిష్కరణ కార్యక్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య జరిగిన గొడవ అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోస్తూ ఆరోపణలు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకులు మైనంపల్లి హన్మంతరావు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలు మరింత ఉతమిచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం బీజేపీ శ్రేణులు నగర వ్యాప్తంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.
ఎంజే మార్కెట్ వద్ద…
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీరును నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఇందులో భాగంగా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఎంజే మార్కెట్ చౌరస్తాలో ధర్నా చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అక్కడి నుండి పంపించి వేశారు. ఇదే తీరులో నల్లకుంట, కాచిగూడ, హయత్ నగర్, సీతాఫల్ మండి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాలలో బీజేపీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నికలలో లబ్ధి కోసమేనా…?
హుజూరాబాద్ ఉప ఎన్నికలో లబ్ధిపొందాలని టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చూస్తున్నాయనే ఆరోపణలు నగరంలో గుప్పుమంటున్నాయి. రెండు పార్టీలు ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, విజయం కోసం ఎత్తులు, పై ఎత్తులు వేయడం వంటివి చేస్తున్నారు. దీంతో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని సానుకూలంగా మలుచుకుని హుజూరాబాద్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నమేనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా దానిని రాజకీయంగా లబ్ధిపొందేందుకు చూస్తున్నారనే చర్చలు నగరవ్యాప్తంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మల్కాజ్‌గిరిలో చోటు చేసుకున్న వివాదం క్షణాలలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముఖ్యంగా హుజూరాబాద్ సెగ్మెంట్ పరిధిలో మల్కాజ్‌గిరి సంఘటనను సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరగడం వెనుక ఉప ఎన్నికలలో లబ్ధి పొందాలనే పరమార్ధం ఉందనే గుస గుసలు వినబడుతున్నాయి.