‘ఆ నాడు లేని వక్ఫ్ బోర్డు.. ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది’

దిశ, ఖానాపూర్ : నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండల పరిధిలో గిరిజనులు ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములు తమవని, ఖాళీ చేయాలని వక్ఫ్ బోర్డు ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా.. తాతల కాలం నుండి తాము సాగు చేస్తున్న భూములని, వాటిని వదిలే ప్రసక్తి లేదని పరిసర గిరిజన కుటుంబాలు తెగేసి చెప్తున్నాయి. ఈ భూముల కోసం న్యాయ పోరాటానికి సైతం సిద్ధమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. భూములు మావంటే మావి అని రైతులకి వక్ఫ్ బోర్డు మధ్యలో పోరాటం […]

Update: 2021-09-25 07:46 GMT

దిశ, ఖానాపూర్ : నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండల పరిధిలో గిరిజనులు ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములు తమవని, ఖాళీ చేయాలని వక్ఫ్ బోర్డు ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా.. తాతల కాలం నుండి తాము సాగు చేస్తున్న భూములని, వాటిని వదిలే ప్రసక్తి లేదని పరిసర గిరిజన కుటుంబాలు తెగేసి చెప్తున్నాయి. ఈ భూముల కోసం న్యాయ పోరాటానికి సైతం సిద్ధమంటున్నారు. వివరాల్లోకి వెళితే.. భూములు మావంటే మావి అని రైతులకి వక్ఫ్ బోర్డు మధ్యలో పోరాటం నడుస్తుంది. తరతరాలుగా సాగులో ఉన్న రైతులు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థతి ఏర్పడింది. 2014 పూర్వం రైతులు పహాణి, నకలుపై ఋణం కూడా పొందామని చెబుతున్నారు. మరి అవేభూములకి నేడు రైతులకు పట్టా బుక్ రాలేదు. పైగా అది మీ భూమి కాదు వక్ఫ్ బోర్డు భూమి అంటూ అన్నదాతలకి నోటీసుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా వక్ఫ్ బోర్డు నోటీసులకి సమాధానం ఇవ్వాల్సిందిగా 136 మంది రైతులకు ఈ నెల 22 తేదిన కలెక్టర్ ద్వారా ఉత్తర్వులు అందగా, వాటిని శనివారం మంగళవారిపేట పరిధిలో ఉన్న 136 మంది రైతులకి అందజేశారు.

ఇదీ సంగతి…

మంగళవారిపేట రెవెన్యూ గ్రామం నాజీ తండా, బోటి మీద తండా, మంగలవారిపేట, కొడ్తిమాట్ తండా, వేపచెట్టు తండా, భద్రు తండా అనే ఆరు గ్రామపంచాయితీల పరిధిలో విస్తరించి ఉంది. మంగళవారిపేట రెవెన్యూ గ్రామంలో సర్వే నెం.1 నుంచి 115 వరకు ఉండగా దీనిలో 1 నుండి 57 వరకు 1447.09 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు పేరిట ఉంది. రెవెన్యూ గ్రామం మొత్తం 2500.35 ఎకరాల భూమి ఉండగా 1,371 కమతాలు కలవు. గత మూడు తరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న ఈ భూములపై ఈ మధ్య కాలంలో వక్ఫ్ బోర్డు నుండి నోటీసులు ఎక్కువయ్యాయి. దీనితో కొన్ని ఏళ్లుగా ఆ భూమినే నమ్ముకొని సాగుచేస్తున్న రైతుల్లో ఆందోళన నెలకొంది. తమ భూములను కాపాడుకోవడానికి ఆరు గ్రామాల రైతులు గిరిజన భూముల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సైతం వీరికి న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. మంత్రులు, అధికారుల వద్ద మంగళవారిపేట రెవెన్యూ గ్రామ ప్రజలు, ఖానాపూర్ మండల రైతుల సమస్యలను ఏకరువు పెడుతూనే ఉన్నారు.

ఆ హక్కు ఎవరికీ లేదు..


మాది గిరిజన గ్రామం… ఇక్కడ ఉండే వారు అందరం గిరిజన బిడ్డలము. ట్రైబల్ చట్టం 1/70 ప్రకారం, పీసా చట్టం 5వ షెడ్యూల్ ప్రకారం మా భూముల్ని తీసుకునే హక్కు వక్ఫ్ బోర్డుకి మాత్రమే కాదు ఇతరులు ఎవ్వరికీ కూడా లేదు. నాలుగు తరాల నుండి సాగు చేస్తున్నాము. ఈ మధ్య కాలంలో వక్ఫ్ బోర్డ్ పేరిట నోటీసులు పంపి గిరిజనులను భయబ్రాంతులకి గురి చేస్తున్నారు.
-గిరిజన భూముల పరిరక్షణ కమిటీ అఖిలపక్షం నాయకుడు…గొంది నాగేశ్వర రావు

అప్పుడు లేని వక్ఫ్ బోర్డ్ ఇప్పుడెక్కది


మంగళవారిపేట రెవెన్యూ గ్రామ పరిధిలో ఇప్పుడు 6 గ్రామ పంచాయితీలుగా ఉంది. అందరం సుమారు 100 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాము. మా దగ్గర ముస్లిం కుటుంబాలు కానీ, మసీదులు కానీ ఆఖరికి దర్గాలు, ఖబరస్తాన్ కూడా లేవు. మధ్యలో ఈ వక్ఫ్ బోర్డ్ ఎక్కడిది. తాత ముత్తాతల నుండి ఆ భూములు మావి.. అప్పుడు లేని వక్ఫ్ బోర్డ్ ఇప్పుడెక్కడి నుండి వచ్చింది.
-గుగులోత్ సుమన్, కొడతిమాట్ తండా సర్పంచ్

బ్యాంకులు రుణాలు కూడా ఇచ్చాయి


మేము కాస్తులో 90 సంవత్సరాల నుండి ఉన్నాము. నేను మా కుటుంబంలో నాల్గవ తరం అనుభవదారుడిని. 2013కి ముందు కూడా మేము పహాణి నకలు ద్వారా అప్పటి ఏపీజీవీబీ (apgvb) బ్యాంక్ నుండి మా పొలాలపై క్రాప్ లోన్ కూడా పొందాము. బ్యాంక్ లు లోన్ కూడా ఇచ్చాయి. తెలంగాణ ఏర్పడక ముందు వరకు భూముల ద్వారా లోన్ పొందిన మాకు ఇప్పుడు వక్ఫ్ భూములంటూ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వట్లేదు. మా భూములు మావి కాదంటున్నారు. మా ఊరు, మా ఇండ్లు, రోడ్డు, గుడి, బడి అన్ని వక్ఫ్ భూములైతే.. వక్ఫ్ బోర్డ్ మనుషులు 100 సంవత్సరాలుగా ఎటు పోయారు. వందేళ్ల క్రితం అక్కడ అడివి ఉండేది. ఇప్పుడు ఊరయ్యింది. మధ్యలో వక్ఫ్ అంటున్నారు. ఆరు ఊరుల జనం గిరిజనులమే. అన్యాయం చేస్తే సహించం.
-గుగులోత్ అశోక్, రైతు

ఏళ్లుగా గిరిజన రైతులే అనుభవదారులుగా ఉన్నారు

రికార్డుల ప్రకారం భూమి స్వభావము వక్ఫ్ బోర్డ్ పేరు మీదనే ఉంది. కానీ ఇక్కడ గిరిజనులు 60 సంవత్సరాలుగా కాస్తుదార్లుగా ఉన్నారు. ధరణి సైట్ ద్వారా మేము ఎవరికి పాస్ బుక్ జారీ చేయలేదు. వక్ఫ్ బోర్డ్ ద్వారా నోటీసులు వచ్చాయి. అవి వారికి అందించాము అంతే తప్ప రైతుల సాగును అడ్డుకోలేదు. ఎప్పటి నుంచో గిరిజన రైతులే అనుభవదారులుగా ఉన్నారు. సాగు చేస్తున్నారు.
-జూలూరి సుభాషిణి, తహశీల్దార్ ఖానాపూర్

Tags:    

Similar News