పల్లెల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్.. వలస వెళ్లిన వారికి నో ఎంట్రీ
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో స్వచ్ఛంద లాక్‌డౌన్ మొదలైంది. వేలాది గ్రామాలు సెల్ఫ్ లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. కరోనా సెకండ్‌వేవ్ గ్రామాలకు విస్తరించడం, పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు రావడంతో గ్రామాల్లో నియంత్రణ చర్యలు మొదలయ్యాయి. స్థానిక పంచాయతీ పాలకవర్గాలు అత్యవసరంగా తీర్మానాలు చేసుకుంటూ నిర్ణయం తీసుకుంటున్నారు. సెల్ఫ్ లాక్‌డౌన్ పాటిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శులు సంబంధిత శాఖకు తీర్మానాలను పంపిస్తున్నారు. సెల్ఫ్ లాక్‌డౌన్ పాటిస్తున్న గ్రామాల్లో దుకాణాలను ఉదయం, సాయంత్రం వేళల్లోనే తెరుస్తున్నారు. పలు గ్రామాల్లో ఉదయం […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో స్వచ్ఛంద లాక్‌డౌన్ మొదలైంది. వేలాది గ్రామాలు సెల్ఫ్ లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. కరోనా సెకండ్‌వేవ్ గ్రామాలకు విస్తరించడం, పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు రావడంతో గ్రామాల్లో నియంత్రణ చర్యలు మొదలయ్యాయి. స్థానిక పంచాయతీ పాలకవర్గాలు అత్యవసరంగా తీర్మానాలు చేసుకుంటూ నిర్ణయం తీసుకుంటున్నారు. సెల్ఫ్ లాక్‌డౌన్ పాటిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శులు సంబంధిత శాఖకు తీర్మానాలను పంపిస్తున్నారు. సెల్ఫ్ లాక్‌డౌన్ పాటిస్తున్న గ్రామాల్లో దుకాణాలను ఉదయం, సాయంత్రం వేళల్లోనే తెరుస్తున్నారు. పలు గ్రామాల్లో ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచుతున్నారు. పలు గ్రామాల్లో నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులపై రూ. 500 నుంచి రూ. 1000 వరకు జరిమానా సైతం వసూలు చేస్తున్నారు. దీంతో పకడ్బందీగా సెల్ఫ్ లాక్‌డౌన్ అమలవుతోంది. కొన్ని గ్రామాల్లో పక్షం రోజులు అమలు చేస్తుండగా, మరికొన్ని గ్రామాల్లో నెల రోజుల పాటు అమలు చేస్తున్నారు. పక్షం రోజుల అమలు పూర్తయిన గ్రామాల్లో రెండోసారి సెల్ఫ్ లాక్‌డౌన్‌ను సైతం తీర్మానాలు చేసుకున్నారు.
సరిహద్దులు బంద్
రాష్ట్ర సరిహద్దులు కాకుండా… గ్రామాల సరిహద్దులను బంద్ చేస్తున్నారు. గ్రామాల్లోకి కొత్తవారిని అనుమతించడం లేదు. పట్టణాలకు వలసవెళ్లిన వారు గ్రామాల్లోకి వెళ్లాంటే కరోనా పరీక్షలు చేయించుకుని వెళ్లాల్సిందే. లేకుంటే నిర్మోహమాటంగా వద్దని చెప్పుతున్నారు. వలస వెళ్లిన వారిని అనుమతించినా… దాదాపు 15 రోజుల పాటు వారిని ఇంటికే పరిమితం చేస్తున్నారు. అలాంటి ప్రాంతాలను ప్రతిరోజూ బ్లీచింగ్, ఇతర క్రిమింసహారక మందులతో పిచికారి చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల్లో కూడా ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలను నియంత్రిస్తున్నారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని ముంబాయి, నాందెడ్, పుణే, బీవండి తదితర ప్రాంతాలతో సంబంధాలున్న గ్రామాల్లోనే ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో… నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. ఈ శివారు ప్రాంతాల్లో కట్టుదిట్టం చేస్తూ సెల్ప్ లాక్‌డౌన్ పాటిస్తున్నారు.
అటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట జిల్లా కృష్ణ, నారాయణపేట, దామరగిద్ద మండలాలతో పాటు జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు, కేటీదొడ్డి, అయిజ మండలాల ప్రాంతాల్లో రవాణా, రాకపోకలు నిలిచిపోయాయి.. ఆ రాష్ట్ర సరిహద్దుల్లోని కృష్ణా (దేవసూగూరు), జలాల్‌పూర్, సింధనూరు, నందిన్నె, బల్గెరల్లో అక్కడి పోలీసు, రెవెన్యూ శాఖలు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశాయి. అంబులెన్స్‌లు, కూరగాయల వాహనాలు, సరుకు రవాణా, ఆక్సిజన్ వాహనాలు, పండ్ల సరఫరా, పాల సరఫరా వాహనాలకు మాత్రమే ఇరువైపులా అనుమతి లభిస్తోంది. హైదరాబాద్, మహబూబ్‌నగర్ నుంచి రాయచూర్‌కు వెళ్లాల్సిన బస్సులను కృష్ణ మండలం టైరోడ్డు వరకే పరిమితం చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్, భీంపూర్, రత్నాపూర్, పిప్పల్‌కోటి, కరంజి(టి) మండలాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ సరిహద్దు మండలాలు, గ్రామాల్లో ఊరు చుట్టూ ముళ్లకంచెను ఏర్పాటు చేసి కొత్త వారిని అడ్డుకుంటున్నారు. అలాగే వంతుల వారీగా ఊళ్లో గస్తీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇతర గ్రామాల నుంచి ఎలాంటి వాహనాలు రాకుండా ప్రత్యేకంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసుకున్నారు.