వ్యాక్సిన్ కంపెనీ పేరు రహస్యం.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా?

దిశ, తెలంగాణ బ్యూరో : హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్లకు ఉచితంగానే వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇక 45 ఏళ్ల వయస్సు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, 60 ఏళ్లకు చేరుకున్న వృద్ధులకు టీకాలు ఇవ్వడం మార్చి 1వ తేదీ నుంచి మొదలుకానుంది. ఇందుకోసం శనివారం నుంచే రిజిస్ట్రేషన్లు (పేర్లు నమోదు చేసుకోవడం) ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వనున్నా ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా ధరతో పాటు ప్రతీ డోస్‌కు […]

Update: 2021-02-26 13:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్లకు ఉచితంగానే వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇక 45 ఏళ్ల వయస్సు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, 60 ఏళ్లకు చేరుకున్న వృద్ధులకు టీకాలు ఇవ్వడం మార్చి 1వ తేదీ నుంచి మొదలుకానుంది. ఇందుకోసం శనివారం నుంచే రిజిస్ట్రేషన్లు (పేర్లు నమోదు చేసుకోవడం) ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వనున్నా ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా ధరతో పాటు ప్రతీ డోస్‌కు రూ.100 చొప్పున సర్వీసు చార్జిని చెల్లించాల్సి ఉంటుంది. టీకా ధరను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది. లాంఛనంగా మార్చి 1వ తేదీన ఉదయం 10.00 గంటల నుంచి 11.30 గంటల మధ్యలో కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది.

టీకా తీసుకోవడానికి అర్హులెవరు?

కరోనా వ్యాక్సిన్ తీసుకోడానికి 45 ఏళ్ల వయసు దాటి వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, 60వ వడిలోకి చేరుకున్నవారు అర్హులుగా కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. జనవరి 1, 2021 నాటికి 59 ఏళ్ళు నిండినవారంతా అర్హులేనని స్పష్టం చేసింది. ఇక ఏయే అనారోగ్యాలు ఉన్నవారు టీకాలు తీసుకోడానికి అర్హులో కూడా వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శులు, అధికారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా?

వ్యాక్సిన్ తీసుకోడానికి పేర్లను నమోదు చేసుకోవడంపై కూడా కేంద్రం స్పష్టత ఇచ్చింది. మూడు రకాలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్‌లో ‘ఆన్‌లైన్’ విధానం ద్వారా పేర్లను నమోదు చేసుకోవడం ఒక విధానం. ప్రభుత్వ, ప్రైవేట్​ ఆస్పత్రుల్లో పేర్లను నమోదు చేసుకుని అప్పటికప్పుడే వ్యాక్సిన్ తీసుకునే స్పాట్ రిజిస్ట్రేషన్ రెండో విధానం. గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పేర్లను నమోదు చేయించుకోవడం లేదా ఆశ వర్కర్లు, ఏఎన్ఎం కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి పేర్లను నమోదు చేసుకోవడం మూడో విధానం. ఏ విధానంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న ఏడు రకాల గుర్తింపు కార్డుల వివరాలను పొందుపర్చడం తప్పనిసరి. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారుల పేర్ల నమోదు ప్రక్రియను మార్చి నెల చివరికల్లా పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

ప్రైవేటు ఆస్పత్రులకు నిబంధనలు

రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులకూ కాకుండా కేవలం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఎంపానెల్ అయినవాటికి మాత్రమే ప్రభుత్వం వ్యాక్సిన్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది. ప్రతీ డోస్‌కు రూ.100 చొప్పున సర్వీసు చార్జి పేరుతో లబ్ధిదారుల నుంచి వసూలు చేసుకోడానికి వెసులుబాటు కల్పించింది. టీకా ధర విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మాత్రమే వసూలు చేయాలి. లబ్ధిదారులు వ్యాక్సిన్ కోసం కట్టిన డబ్బుల్ని విధిగా ప్రత్యేకంగా ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. రసీదులను రాష్ట్ర ప్రభుత్వానికి చూపించాలి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత స్వల్పంగా సైడ్ ఎఫెక్టులు వచ్చినా, రియాక్షన్లు వచ్చినా ప్రైవేటు ఆస్పత్రులే అవసరమైన చికిత్సను అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకాలు తీసుకున్నవారికి సైడ్ ఎఫెక్టులు వచ్చినట్లయితే ప్రభుత్వమే చికిత్స అందిస్తుంది.

మార్చి నెలలో తొలి డోస్

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే 45 ఏళ్ల వయసు పైబడినవారికి, 60 ఏళ్లకు చేరుకున్న వృద్ధులకు తొలి డోస్ మార్చి నెలలోనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జనాభా లెక్కల ప్రకారం చూస్తే మొదటి కేటగిరీలోకి వచ్చేవారు దాదాపు 12 శాతం మంది ఉంటారని, అరవై ఏళ్లు ఆ పైన వయసువారు సుమారు 11 శాతం ఉంటారని వైద్యారోగ్య శాఖ అంచనా. ఈ రెండు రకాలను కలిపితే రాష్ట్రంలో దాదాపు అరవై లక్షల వరకు ఉంటుందని లెక్కలేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1200 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వారానికి ఐదు రోజుల చొప్పున టీకాలు ఇవ్వాలని భావిస్తోంది. ఈ ప్రకారం రోజుకు కనీస స్థాయిలో 1.20 లక్షల మందికి టీకాల పంపిణీ జరుగుతుంది. వారానికి ఐదు లక్షలకు తగ్గకుండా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మార్చి మొత్తంలో సుమారు పాతిక లక్షల మందికి తొలి డోస్ పూర్తవుతుందని, మిగిలినవారికి ఏప్రిల్ నెల చివరికల్లా పూర్తవుతుందని వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. తొలి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్ ఇవ్వాల్సి ఉంటున్నందున ఏప్రిల్ లో తొలి, రెండో డోసుల ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. అదే విధంగా మే, జూన్ నెలల్లో కూడా ఉంటుందని, మొత్తం ప్రక్రియ జూన్ చివరికల్లా పూర్తవుతుందని అంచనా.

వ్యాక్సిన్ కంపెనీ పేరు రహస్యం

ప్రస్తుతం ‘కొవిషీల్డ్’కు ఎలాంటి కన్సెంట్ లెటర్ అవసరం లేకుండానే వైద్యారోగ్య సిబ్బంది టీకాలు ఇస్తున్నారు. ‘కొవాగ్జిన్’కు మాత్రం లబ్ధిదారుల నుంచి కన్సెంట్ లెటర్ తీసుకుంటున్నారు. ఇకపైన అలాంటి నిబంధన లేకుండా రెండు రకాల వ్యాక్సిన్‌కు ఒకే విధానం అమలుకానుంది. కానీ ఎవరికి ఏ కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌ను ఇస్తున్నారనేది గోప్యంగానే ఉండనుంది.

ప్రతి రెండు వారాలకు ఒక ప్రణాళిక

ఏ రాష్ట్రంలో ఎంత మంది లబ్ధిదారులుంటారు, వారికి ఎన్ని డోసుల టీకాలు అవసరం తదితర వివరాలన్నింటినీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రెండు వారాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఆ వివరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం టీకాలను సరఫరా చేస్తుంది. ఒకవేళ వ్యాక్సిన్ డోసులలో లోపాలు ఉన్నా, రవాణాలో వృథా అయినా, ఇతర కారణాలతో వినియోగించలేని పరిస్థితులు తలెత్తినా వాటిని కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఆ మేరకు స్టాకును సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News