రైతు రుణమాఫీకి కరోనా కాటు

– సిద్ధంకాని లబ్దిదారుల జాబితా – ఇప్పటికీ రైతులకు చేరని చెక్కులు – డబ్బులొస్తేనే మళ్ళీ కదలిక దిశ, న్యూస్ బ్యూరో: ‘పాతికవేల రూపాయల లోపు రుణాలున్న రైతులు రాష్ట్రంలో 5,83,916 మంది ఉన్నారు. వారందరి రుణాలను నూటికి నూరు శాతం ఒకే దఫా మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఈ నెలలోనే రూ. 25 వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం రూ. 1,198 కోట్లు విడుదల చేస్తున్నది’ అని ఆర్థిక మంత్రి […]

Update: 2020-05-01 05:53 GMT

– సిద్ధంకాని లబ్దిదారుల జాబితా
– ఇప్పటికీ రైతులకు చేరని చెక్కులు
– డబ్బులొస్తేనే మళ్ళీ కదలిక

దిశ, న్యూస్ బ్యూరో: ‘పాతికవేల రూపాయల లోపు రుణాలున్న రైతులు రాష్ట్రంలో 5,83,916 మంది ఉన్నారు. వారందరి రుణాలను నూటికి నూరు శాతం ఒకే దఫా మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఈ నెలలోనే రూ. 25 వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం రూ. 1,198 కోట్లు విడుదల చేస్తున్నది’ అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మార్చి 8వ తేదీన అసెంబ్లీలో తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ మాటలు చెప్పి యాభై రోజులైనా ఇప్పటికీ రుణమాఫీపై కదలిక లేదు. లబ్దిదారుల జాబితా తయారు కాలేదు. గ్రామ స్థాయి సమావేశాలూ జరగలేదు. బ్యాంకర్ల, వ్యవసాయ, రెవిన్యూ శాఖల సంయుక్త సమావేశమూ జరగలేదు. ప్రభుత్వం మాత్రం మార్చి 18వ తేదీన రూ. 1210 కోట్లను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. రుణమాఫీ కోసం గతేడాది బడ్జెట్‌లో రూ. 6,000 కోట్లను కేటాయించింది. ఇప్పుడు అందులోంచే ఈ మొత్తాన్ని విడుదల చేసింది. కానీ రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ మొదలే కాలేదు. కరోనా ప్రభావం అని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. కానీ, ఈ కరోనా ప్రభావం రుణమాఫీని ఎన్ని నెలలు వెంటాడుతుందో తెలియదు.

రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది రైతులున్నట్లు ప్రభుత్వ అంచనా. ఇందులో లక్ష రూపాయల లోపు రుణాలున్న రైతులకు నాలుగు విడతల్లో మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందుకు సుమారు రూ. 24,738 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేసింది. నాలుగు విడతల్లో తొలి విడతకు అవసరమైన రూ. 6,225 కోట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) బడ్జెట్‌లో కేటాయించింది. కానీ రూ. 25 వేల లోపు రుణం ఉన్న రైతులకు మాత్రం ఒకే దఫాలో మార్చి నెల 31వ తేదీకల్లా మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. బ్యాంకు ఖాతాల్లో కాకుండా రైతుల చేతికే నేరుగా చెక్కులు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన పది రోజులకే జీవో కూడా వచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ నుంచే నిధులను కూడా కేటాయించింది. ఇక లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలను రూపొందించడం, దానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించడం జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా రెండు నెలలు కావస్తున్నా ఇది కొలిక్కి రాలేదు.

గణాంకాలు ఉన్నా లబ్దిదారులెవరో తెలియదు..

పాతికవేల రూపాయల లోపు వ్యవసాయ రుణాలున్న రైతుల వివరాలను సేకరించడం, గ్రామాలవారీగా పరిశీలించడం, ఖరారు చేయడానికి సంబంధిత నిర్దిష్ట ప్రోటోకాల్‌ను రూపొందించాల్సి ఉంటుందని, ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను తయారుచేయనున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. జిల్లా స్థాయిలో బ్యాంకర్ల కమిటీ సమావేశాలు నిర్వహించి ఈ పథకం కింద అర్హత కలిగిన రైతుల జాబితాను రూపొందించాల్సి ఉంది. నిజానికి వ్యవసాయ శాఖకుగానీ, బ్యాంకులకుగానీ కరోనాకు సంబంధించి ప్రత్యక్షంగా ఎలాంటి బాధ్యతలు లేవు. ఇక రెవిన్యూ అధికారుల దగ్గర పట్టాదారు పాస్‌బుక్‌లకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. ఈ మూడు శాఖలూ సంయుక్తంగా లబ్ధిదారుల జాబితాను రూపొందించడానికి కరోనా పరిస్థితులు పెద్దగా అడ్డంకేమీ కాదు. అయినా కరోనా పేరుతో ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అర్హులైన లబ్దిదారుల జాబితా రూపొందిన తర్వాత రెవిన్యూ, వ్యవసాయ శాఖ విస్తరణాధికారుల సంయుక్త పర్యవేక్షణలో గ్రామస్థాయి సమావేశాలను నిర్వహించి లబ్దిదారుల పేర్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. పైస్థాయిలోనే ఇంకా కొలిక్కి రాకపోవడంతో గ్రామస్థాయిలో సమావేశాలు జరిగే ఆస్కారమే లేదు. కరోనా లాక్‌డౌన్ మే నెల 7వ తేదీతో ముగుస్తున్నందున పాతికవేల రుణమాఫీకి సంబంధించి కసరత్తు మొదలవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒక్కో రైతుకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల్లో వ్యవసాయ రుణాలు ఉంటాయి. వాటి వివరాలను కూడా సేకరించాల్సి ఉంటుంది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఈ ప్రక్రియను మొదలుపెట్టినా మే నెల చివరికైనా అందుతుందా అనేది ప్రశ్నార్థకంగానే మారింది.

ఖరీఫ్ రైతుబంధు కూడా అంతేనా?

కరోనా పరిస్థితులు ఎలా ఉన్నా రైతులకు మాత్రం సీజన్ ప్రకారం సాగు పనులు మొదలుకాక తప్పదు. ప్రతీ సంవత్సరం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతుబంధు డబ్బులను ప్రభుత్వం మే నెలలోనే ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసం కనీసంగా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. గతేడాది ఖరీఫ్ సీజన్‌కు సుమారు 47.50 లక్షల మంది రైతులకుగాను రూ. 6,155 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. కానీ చివరకు 40.26 లక్షల మంది రైతులకు రూ. 3,925 కోట్లతోనే సరిపెట్టింది. ఏడెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు మాత్రమే ఇచ్చి మిగిలినవారికి అందజేయలేదు. ఆ రకంగా రెండు వేల కోట్లకు పైగానే ప్రభుత్వానికి మిగిలింది. ఈసారి ఎంత మంది రైతుల్ని ఈ పథకం కింద అర్హులుగా ప్రకటిస్తుందో, ఎంత ఖర్చు చేస్తుందో స్పష్టత లేదు. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో మాత్రం రూ. 14 వేల కోట్లను ప్రతిపాదించింది. గతేడాదికంటే ఇది రూ. 2000 కోట్లు ఎక్కువ. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రానికి వచ్చే స్వీయ ఆర్థిక వనరులన్నీ నిలిచిపోవడంతో రైతుబంధు పథకానికి అవసరమైన నిధులను ఎలా సమకూర్చుకుంటుందన్నది కీలకంగా మారింది. అందువల్ల ఐదెకరాల కంటే తక్కువ సాగుభూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ నిధులను ఇచ్చి సరిపెట్టుకునే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నిర్ణయమే తీసుకున్నట్లయితే లబ్ధిదారులు సుమారు 35 లక్షల మంది లోపు మాత్రమే ఉండే అవకాశం ఉంది.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి అర్హులైన రైతులకు మాత్రం ఒక విడతగా ఏప్రిల్ నెల మొదటి వారంలో రూ. 2000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ రైతుబంధు విషయానికొస్తే తమది సంక్షేమ ప్రభుత్వమంటూ మంత్రులు, అధికార పార్టీ నేతలు చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ, రేషన్ కార్డున్నా బ్యాంకు ఖాతాలో రూ. 1500 జమ కాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో తాలు, తరుగు పేర తూకంలో జరుగుతున్న మోసం రైతులకు నష్టాలనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో రైతుబంధు కూడా అదే తీరులో ఉంటుందేమో అనే గుసగుసలు మొదలయ్యాయి. అయితే కరోనా పరిస్థితుల్ని అర్థం చేసుకున్న రైతులు విమర్శల బాట పట్టకుండా సహృదయంతో అర్థం చేసుకుని సైలెంట్‌గా ఉంటున్నారు. అదే ప్రభుత్వానికి ఇప్పుడు వరంగా మారింది.

Tags: Telangana, Rythu Bandhu, Agriculture, Financial Assistance, Cheque, budget, Corona, LockDown

Tags:    

Similar News