ఇంతకీ నువ్వెవరూ..?
దిశ, న్యూస్ బ్యూరో : సీఎం కేసీఆర్ బీజేపీకి మిత్రుడో.. శత్రువో తెలియడం లేదు. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీల వలె రాష్ట్ర బీజేపీ పరిస్థితి కూడా గందరగోళంగానే ఉంది. మోడీ, కేసీఆర్ మధ్య దోస్తానా అర్థం కాక రాష్ట్ర బీజేపీ రాష్ర్ట నాయకత్వం తలలు పట్టుకుంటోంది. మొదటి ఐదేళ్ళ కాలంలో నెలకొన్న పరిస్థితే ఇప్పుడు కూడా పునరావృతమవుతోందంటూ అనుమానించడం తప్ప.. దీన్ని బైటకు కక్కలేక, మనసులో ఉంచుకోలేక సతమతమవుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకోవాలంటే […]
దిశ, న్యూస్ బ్యూరో : సీఎం కేసీఆర్ బీజేపీకి మిత్రుడో.. శత్రువో తెలియడం లేదు. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీల వలె రాష్ట్ర బీజేపీ పరిస్థితి కూడా గందరగోళంగానే ఉంది. మోడీ, కేసీఆర్ మధ్య దోస్తానా అర్థం కాక రాష్ట్ర బీజేపీ రాష్ర్ట నాయకత్వం తలలు పట్టుకుంటోంది. మొదటి ఐదేళ్ళ కాలంలో నెలకొన్న పరిస్థితే ఇప్పుడు కూడా పునరావృతమవుతోందంటూ అనుమానించడం తప్ప.. దీన్ని బైటకు కక్కలేక, మనసులో ఉంచుకోలేక సతమతమవుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకోవాలంటే అధికార టీఆర్ఎస్ మీద యుద్ధం చేయక తప్పడం లేదు. ఆ క్రమంలోనే రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి పార్టీ సభ్యత్వాన్ని పెంచుకుంటూ కేడర్‌ను బలోపేతం చేస్తూ ఉంది. కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం కేసీఆర్‌ను దగ్గరకు చేర్చుకుంటూ ఉంది. ఈ రెండు రకాల ట్రీట్‌మెంట్లు అర్థం కాక రాష్ట్ర బీజేపీలో అయోమయ స్థితి నెలకొంది.
సీఏఏను వ్యతిరేకిస్తూ కేబినెట్‌లో తీర్మానం చేసిన కేసీఆర్‌ను.. రాష్ట్రపతి భవన్ ఇటీవల ట్రంప్‌కు ఇచ్చిన విందు కార్యక్రమానికి ఆహ్వానించడాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. కేసీఆర్‌ను విందుకు ఆహ్వానించి తమకు తలవంపు తెచ్చారని ఢిల్లీ పార్టీ పెద్దలపై రాష్ర్ట నాయకులు ఫైర్ అవుతున్నారు. బీజేపీ పార్టీకి బద్ధ శత్రువైన మజ్లిస్ ఎజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నారంటూ రాష్ట్ర బీజేపీ నేతలు గట్టిగానే వాదిస్తున్నారు. కేంద్రం రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని టీఆర్ఎస్ నాయకులు, ఆధారాలతో సహా చూపిస్తామని బీజేపీ నాయకులు ఇటీవల ఒకరిపై ఒకరు సవాళ్ళు విసురుకున్నారు.
ఇవన్నీ పక్కనబెట్టి.. ఒక్కసారి చాన్స్ ఇస్తే కేంద్ర నాయకత్వాన్ని ఇట్టే బుట్టలో వేసుకునే చాణక్యమున్న కేసీఆర్‌కు కేంద్రం నుంచి ఆహ్వానం ఇస్తే ఇక రాష్ర్టంలో తమకు పని లేకుండా పోతుందని బీజేపీ నేతలు వాపోతున్నారు. అదీగాక దేశంలో 28 మంది సీఎంలు ఉంటే కేవలం 8 మంది ముఖ్యమంత్రులను విందుకు ఆహ్వానించడం, అందులోనూ రాష్ట్రంలో బీజేపీని అడుగడుగునా అడ్డుకుంటూ విమర్శిస్తున్న కేసీఆర్‌కు ఇన్విటేషన్ ఇవ్వడం రాష్ర్ట నాయకత్వానికి ఏ కోశాన మింగుడు పడటం లేదు. ఇక కేసీఆర్‌పై తాము చేసే విమర్శలు వర్క్‌అవుట్ అయ్యే పరిస్థితి లేదనే ఆందోళన బీజేపీ నేతల్లో మొదలైంది.
ఆశలపై నీళ్లు..
నాలుగు ఎంపీ సీట్లు, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఓట్ల శాతంతో ఉత్సాహంతో ఉన్న బీజేపీ నేతలు రాష్ట్రంలో అధికార పార్టీని ఎదుర్కొనేందుకు అస్ర్తశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. కేసీఆర్‌పై ఇటీవల విమర్శల దాడిని పెంచారు. ఈ దశలో జాతీయ నాయకత్వం తమ ఆవేశంపై నీళ్లు చల్లిందని రాష్ట్ర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్‌తో, బీజేపీకి దోస్తానానా..లేక శతృత్వమా అన్న విషయం బీజేపీ నాయకులకు అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలింది..