ట్విట్టర్‌కు కేంద్రం షాక్.. నిర్లక్ష్యమే కొంపముంచిందా..?

న్యూఢిల్లీ : మైక్రో బ్లాగింగ్ ప్లా్ట్‌ఫామ్ ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కొత్త డిజిటల్ చట్టాలను ఉద్దేశపూర్వకంగా అమలుజేయ తిరస్కరిస్తున్నదని కేంద్రం ఆరోపించింది. తత్కారణంగానే ట్విట్టర్‌కు లీగల్ ప్రొటెక్షన్‌ను రద్దు చేసినట్టు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. కొత్త ఐటీ రూల్స్‌ను కేంద్ర ప్రభుత్వం మూడు నెలల కిందే రూపొందించింది. మే 26వ తేదీ వరకు వాటిని అమలు చేయాలని సోషల్ మీడియా సంస్థలకు సమయమిచ్చింది. ఇతర సంస్థలు అమలు చేసినప్పటికీ ట్విట్టర్ మాత్రం ఒకడుగు ముందుకు రెండడుగులు […]

Update: 2021-06-16 11:14 GMT

న్యూఢిల్లీ : మైక్రో బ్లాగింగ్ ప్లా్ట్‌ఫామ్ ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కొత్త డిజిటల్ చట్టాలను ఉద్దేశపూర్వకంగా అమలుజేయ తిరస్కరిస్తున్నదని కేంద్రం ఆరోపించింది. తత్కారణంగానే ట్విట్టర్‌కు లీగల్ ప్రొటెక్షన్‌ను రద్దు చేసినట్టు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. కొత్త ఐటీ రూల్స్‌ను కేంద్ర ప్రభుత్వం మూడు నెలల కిందే రూపొందించింది. మే 26వ తేదీ వరకు వాటిని అమలు చేయాలని సోషల్ మీడియా సంస్థలకు సమయమిచ్చింది. ఇతర సంస్థలు అమలు చేసినప్పటికీ ట్విట్టర్ మాత్రం ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నచందంగా వ్యవహరిస్తున్నది. రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, చీఫ్ కంప్లయెన్స్ ఆఫీసర్‌లుగా స్థానిక ఉద్యోగులను నియమించాలని నూతన ఐటీ చట్టాల్లో కేంద్రం పొందుపరించింది. పలుసార్లు అదనపు సమయాన్ని అడుగుతూ చట్టాలను కచ్చితంగా అమలు చేయకుండా ట్విట్టర్ దోబూచులాడింది. తొలుత రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్‌లను తాత్కాలిక ప్రాతిపదికన నామినేట్ చేసింది. కానీ, వీరు సంస్థ ఉద్యోగులు కాదు. తాజాగా చీఫ్ కంప్లయెన్స్ అధికారిని నియమించినట్టు ప్రకటించి వివరాలను త్వరలో అందజేస్తామని తెలిపింది. ఈ వివరాలూ తమకు అందలేవని కేంద్రం తెలిపింది.

లా ఆఫ్ ల్యాండ్ ఎందుకు పాటించరు : కేంద్రం

కేంద్ర ఐటీ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ట్విట్టర్‌పై ట్విట్టర్‌లోనే విరుచుకుపడ్డారు. నూతన ఐటీ చట్టాల అమలుకు ట్విట్టర్‌కు అనేక అవకాశాలిచ్చినా, ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తూ వస్తున్నదని ట్వీట్ చేశారు. విశాలమైన భారత భూభాగంలో అనేక సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నాయని, వీటి కారణంగా ఏ కొంచెం భిన్నమైన వార్త అయినా చిచ్చురేపొచ్చని, దీనికితోడు ఫేక్ న్యూస్ బెడదా ఉన్నదని తెలిపారు. వీటి నివారణకే తాము ఇంటర్మీడియరీ మార్గదర్శకాలను రూపొందించామని వివరించారు. కానీ, ఫ్రీ స్పీచ్ గురించి గొప్పగా చెప్పే ట్విట్టర్ అందుకు ఉపకరించే గైడ్‌లైన్స్ అమలు చేయకపోవడం చిత్రంగా ఉన్నదని పేర్కొన్నారు. లా ఆఫ్ ల్యాండ్‌ను పాటించకుండా యూజర్ల సమస్యను పరిష్కరించడానికి వెనుకాడుతున్నదని, సంస్థ ఇష్టారీతిన ‘వక్రీకరణ’ అనే ట్యాగ్‌ను ఇస్తున్నదని ఆరోపించారు. భారత కంపెనీలు ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి చట్టాలు పాటిస్తాయని, మరి ఇతర దేశాల సంస్థలూ ఇక్కడి చట్టాలను అమలు చేయడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంలోనే ట్విట్టర్‌కు లీగల్ ప్రొటెక్షన్ ఉన్నదా? అనే అనుమానాలు వస్తున్నాయని, మే 26న అమల్లోకి వచ్చిన గైడ్‌లైన్స్‌ను ట్విట్టర్ అమలు చేయడం లేదన్న విషయాన్ని గుర్తుంచుకుంటే చాలని వివరించారు.

సెక్షన్ 79 ఇచ్చే లీగల్ ప్రొటెక్షన్ ఏంటి..?

కొత్త ఐటీ చట్టాలను పాటించని సోషల్ మీడియా సంస్థలకు సెక్షన్ 79 కల్పించే మినహాయింపులు వర్తించవని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో సెక్షన్ 79 కల్పించే రక్షణపై చర్చ మొదలైంది. ఇంటర్మీడియరీగా గుర్తించిన థర్డ్ పార్టీ(సోషల్ మీడియా సైట్లు)ల్లో షేర్ చేసిన, పోస్టు చేసిన నేరపూరిత, చట్ట ఉల్లంఘన, ప్రేరేపిత అంశాల నుంచి వాటికి లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది. చట్టవిరుద్ధ పోస్టు చేసిన సదరు యూజర్ మాత్రం విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, ఈ రక్షణను ఉపసంహరిస్తే సదరు యూజర్‌తోపాటు థర్డ్ పార్టీ కూడా విచారణకు అర్హమే అవుతుంది.

Tags:    

Similar News