టీఎస్​పీఎస్సీ కొత్త పాలకవర్గానికి కొత్త టెన్షన్​

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (టీఎస్​పీఎస్సీ) రెండో పాలకవర్గం కొలువుదీరేందుకు సిద్ధమైంది. ఆరు నెలల తర్వాత పాలకవర్గం నియామకమైంది. ఈసారి ఐఏఎస్​ అధికారి నేతృత్వంలో కమిటీ వేశారు. అయితే రాష్ట్రంలోని ఆయా శాఖల్లో దాదాపు 1.09 లక్షల ఉద్యోగాల ఖాళీలున్నాయని పీఆర్సీ కమిషన్​ నివేదికల్లో వెల్లడించింది. అంతకు ముందు సీఎం కేసీఆర్​గత ఏడాది నవంబర్​లో రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో టీఎస్​పీఎస్సీ ముందు భారీ […]

Update: 2021-05-20 11:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (టీఎస్​పీఎస్సీ) రెండో పాలకవర్గం కొలువుదీరేందుకు సిద్ధమైంది. ఆరు నెలల తర్వాత పాలకవర్గం నియామకమైంది. ఈసారి ఐఏఎస్​ అధికారి నేతృత్వంలో కమిటీ వేశారు. అయితే రాష్ట్రంలోని ఆయా శాఖల్లో దాదాపు 1.09 లక్షల ఉద్యోగాల ఖాళీలున్నాయని పీఆర్సీ కమిషన్​ నివేదికల్లో వెల్లడించింది. అంతకు ముందు సీఎం కేసీఆర్​గత ఏడాది నవంబర్​లో రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో టీఎస్​పీఎస్సీ ముందు భారీ సవాళ్లే ఉంటున్నాయి. ప్రస్తుతం ఒక్క సభ్యుడు ఉండగా… కొత్తగా ఛైర్మన్​తో పాటు ఏడుగురు సభ్యులను నియమించారు. దీంతో టీఎస్​పీఎస్సీలో సభ్యుల సంఖ్య 8కి చేరింది. ఇంకో రెండు ఖాళీలున్నాయి. కాగా కొత్త పాలకవర్గం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండా పాలకవర్గం కొలువుదీరనుంది.

ఉద్యోగాల కోసం వెయిటింగ్​

రాష్ట్రంలో 50వేల ఉద్యోగాల భర్తీ ప్రకటనతో ఆయా శాఖల్లో ఖాళీల వివరాలను కూడా తీసుకున్నారు. దీనిలో పోలీస్​బోర్డ్, మెడికల్​బోర్డు వంటి వాటిని మినహాయిస్తే… టీఎస్​పీఎస్సీ ద్వారా దాదాపు 36 వేల పోస్టును భర్తీ చేయాల్సి ఉంది. ఇదివరకు ఒక్కో శాఖకు ఒక్కోసారి పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చే పద్ధతి ఉండగా… ఇక నుంచి మాత్రం మార్చివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని శాఖల్లో భర్తీకి ఒకేసారి అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అధికారికంగా వెలువరించాల్సి ఉంది. దాదాపు ఆరు నెలల నుంచి అతి త్వరలోనే భర్తీ చేస్తామని ఏదో సందర్భంలో చెప్పుతూనే ఉన్నారు.

గతంలో 35 వేల పోస్టులు భర్తీ

తెలంగాణ తొలి పాలకవర్గం ఆధ్వర్యంలో టీఎస్​పీఎస్సీ ద్వారా ఆరేళ్లలో 108 నోటిఫికేషన్లు జారీ చేసి, 45 లక్షల మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి, 35,724 పోస్టుల నియామక ప్రక్రియ పూర్తి చేసినట్లు టీఎస్​పీఎస్సీ కేలండర్​లో వెల్లడించారు. కానీ ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న గ్రూప్​–1 నోటిఫికేషన్​మాత్రం రాలేదు. 2011లో 150 గ్రూప్​ –1 కింద భర్తీ చేశారు. అప్పటి నుంచి దానికి సంబంధించిన ఎలాంటి నోటిఫికేషన్​ విడుదల చేయలేదు. త్వరలోనే వస్తుందంటూ ఆరేండ్ల నుంచి చెప్పుతూనే ఉన్నారు. కానీ సాధ్యం కాలేదు.

మరోవైపు టీఎస్​పీఎస్సీ ద్వారా ఎప్పుడు పోస్టులను భర్తీ చేసినా ఆరోపణలు సాధారణమే. తాజాగా నర్సుల జాబితాలో కూడా అక్రమాలు జరిగాయంటూ కొంతమంది అభ్యర్థులు టీఎస్​పీఎస్సీని ముట్టడించారు. గతంలోనూ పలు సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. కానీ టీఎస్​పీఎస్సీ నుంచి ఎలాంటి అక్రమాలు జరుగలేదని అప్పటి పాలకవర్గం తేల్చి చెప్పింది.

ఇప్పుడే అసలు పరీక్ష

ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్​ కోసం ఎదురుచూస్తున్నారు. టీఎస్​పీఎస్సీలో నమోదైన నిరుద్యోగులే 9 లక్షల మంది వరకు ఉన్నారు. వీరంతా దాదాపు ఆరేండ్ల నుంచి సరైన నోటిఫికేషన్ల కోసం చూస్తున్నారు. రాష్ట్రంలో గతేడాది జరిగిన జీహెచ్​ఎంసీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం తరుపున 50వేల పోస్టులను భర్తీ చేస్తామంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​పలుమార్లు ప్రకటించారు. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు మొదలయ్యాయి. మళ్లీ పుస్తకాల్లో నిమగ్నమయ్యారు.

అయితే ఇటీవల డిసెంబర్​లో టీఎస్​పీఎస్సీ పాలకవర్గం గడువు ముగిసింది. అప్పటి నుంచి ఉద్యోగాల భర్తీకి ఆటంకాలు ఎదురవుతున్నట్లు అధికారులు చెప్పుతున్నారు. పూర్తిస్థాయి పాలకవర్గం లేకపోవడంతో నోటిఫికేషన్​ విడుదల కావడం లేదంటూ చెప్పుకొచ్చారు. కానీ ఎట్టకేలకు ఒక ఛైర్మన్​, 8 మంది సభ్యులతో టీఎస్​పీఎస్సీ కమిటీ శుక్రవారం కొలువుదీరుతోంది. దీంతో నోటిఫికేషన్లు ఈ నాలుగైదు నెలల్లోనే ఇస్తారనే ఆశల్లో ఉన్నారు. ప్రస్తుతం ఐఏఎస్​ఆధ్వర్యంలో పాలకవర్గం రావడంతో నిరుద్యోగుల్లో కూడా కొంత ఆశ మొదలైంది. నిక్కచ్చిగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే పాలకవర్గం మొత్తం ఉన్నా… అటు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సాధ్యమవుతుందని అధికారులంటున్నారు. దీంతో ప్రభుత్వ అనుమతి కోసం టీఎస్​పీఎస్పీ ఎదురుచూడాల్సిందేనని చెప్పుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుకున్న సమయంలో నోటిఫికేషన్లు వెలువడకుంటే… పాలకవర్గానికి కూడా గడ్డు రోజులే.

Tags:    

Similar News