Flight Lieutenant: వస్తానని మాట ఇచ్చావు కదా! అంతిమయాత్రలో కాబోయే భార్య గుండెలవిసేలా రోదన
గుజరాత్ లోని జామ్ నగర్ సమీపంలో రెండు రోజుల క్రితం (ఐఏఎఫ్) వాయుసేనకు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిన ఘటనలో పైలట్ సిద్ధార్థ్ యాదవ్ (28) మృతి చెందిన విషయం తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్ లోని జామ్ నగర్ సమీపంలో రెండు రోజుల క్రితం (ఐఏఎఫ్) వాయుసేనకు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిన ఘటనలో పైలట్ (Flight Lieutenant Siddharth Yadav) సిద్ధార్థ్ యాదవ్ (28) మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం హర్యానాలోని రేవారీ జిల్లాలోని తన స్వస్థలమైన మజ్రా భల్కి గ్రామంలో పూర్తి సైనిక లాంఛనాలతో ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ యాదవ్ అంత్యక్రియలు జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని అనేక మంది మాజీ సైనికులతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపై నిలబడి ఆయన అంతిమయాత్రలో నివాళులు అర్పించారు.
ఈ క్రమంలోనే సిద్ధార్థ్ యాదవ్ సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రమాదం జరగడానికి పది రోజుల ముందే (మార్చి 23) ఢిల్లీకి చెందిన యువతితో ఆయనకు నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది. నవంబర్ 2 న పెళ్లి ముహూర్తం సైతం నిర్ణయించారు. మరికొద్ది రోజుల్లో వివాహ బంధంలోకి అడుగు పెట్టాల్సిన సమయంలో మృత్యువు ఒడిలోకి వెళ్లడంతో ఇరు కుటుంబాల్లో విషాద చాయలు అలముకున్నాయి. అంతిమయాత్రలో సిద్ధార్థ్ కాబోయే భార్య కన్నీరు మున్నీరు అయ్యారు.
నన్ను తీసుకెళ్లడానికి వస్తానని మాట ఇచ్చావు కదా.. ఇలా వచ్చావేంటి అని ఆ కాబోయే భార్య ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ యాదవ్ పార్థివదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. దీంతో అక్కడ ఉన్నవారంతా కన్నీరు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, గుజరాత్‌లోని జామ్‌నగర్ ఐఏఎఫ్ స్టేషన్ సమీపంలోని ఒక గ్రామంలో జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోయిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పైలట్లలో ఒకరైన ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి.