PM Modi: అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని వాడుకుంది: ప్రధాని మోడీ
వక్ఫ్ నిబంధనలను తమ స్వార్థానికి మార్పులు చేసింది. అధికారం కోసం రాజ్యాంగాన్ని ఆయుధంలా వాడుకుందని ఆరోపించారు.

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగిన కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వక్ఫ్ నిబంధనలను తమ స్వార్థానికి మార్పులు చేసింది. అధికారం కోసం రాజ్యాంగాన్ని ఆయుధంలా వాడుకుందని ఆరోపించారు. ఇప్పుడు ముస్లింల కోసం నిరసనలు చేస్తున్న కాంగ్రెస్, తాము అధికారంలో ఉన్నప్పుడు ఎందుకని వారికి ఉన్నతస్థాయి బాధ్యతలు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ముస్లిం అధ్యక్షుడిని ఎందుకు ఎన్నుకోవట్లేదని, ముస్లిం అభ్యర్థులకు 50 శాతం టిక్కెట్లను ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. సోమవారం హర్యానాలోని హిస్సార్ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోడీ.. రాష్ట్ర అభివృద్ధి పయనంలో ఈ విమానాశ్రయం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, దళితుల చిహ్నం, రాజ్యాంగ రూపశిల్పి అయిన బీఆర్ అంబేద్కర్‌ను స్మరించుకుంటూ, డాక్టర్ అంబేద్కర్ పోరాటం తన ప్రభుత్వానికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. ప్రతి నిర్ణయం, విధానం అంబేద్కర్‌కే అంకితం అని అన్నారు.
ఈ సందర్భంగా.. కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రతిపక్ష పార్టీ అధికారం కోసం రాజ్యాంగాన్ని ఆయుధంగా మార్చుకుందన్నారు. 'ఎమర్జెన్సీ సమయంలో అధికారాన్ని నిలుపుకోవడం కోసం రాజ్యాంగ స్ఫూర్తిని హతమార్చారు. రాజ్యాంగం విలువల గురించి మాట్లాడే కాంగ్రెస్, దాన్ని ఎన్నడూ పాటించలేదు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు ముస్లింలు కూడా నష్టపోయేలా చేసింది. కాంగ్రెస్ కొంతమంది ముస్లింలకు మాత్రమే ప్రయోజనాలు అందేలా చేసింది. మిగిలిన వారంతా చదువుకోని పేదలుగా మిగిలిపోయారు. ఈ విధానానికి అతిపెద్ద రుజువు వక్ఫ్ చట్టం అని మోడీ అన్నారు. కాగా, ఇప్పటికే పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం తర్వాత అమల్లోకి వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం-2025పై ముస్లిం సంఘాలు నిరసనకు దిగాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని విపక్ష పార్టీలు, ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఈ అంశంపై ఇప్పటికే 15 పిటిషన్లు దాఖలవగా, ఏప్రిల్ 16న విచారణ చేపట్టనున్నారు.