తెలంగాణలో పశు ‘వైద్య’మేదీ..?
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పశువులకు వైద్యం దూరమవుతోంది. ప్రస్తుతం వైద్యులు పాటిస్తున్న సమయపాలతో రైతులకు, వైద్యులకు మధ్య దూరం పెరుగుతోంది. దీంతో మూగజీవాలకు సరైన సమయంలో వైద్యం అందడం లేదు. పశువైద్యులు ఉదయం 7 గంటలకే దవాఖానకు రావాలని, దీంతో జీవాలకు సరైన వైద్యం అందడంతో పాటు, ఎలాంటి నష్టం ఉండదని రైతులు అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 7 గంటలకే పశువుల ఆసుపత్రులను తెరవగా, స్వరాష్ట్రంలో అది 9 గంటలకు మారింది. పశు […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పశువులకు వైద్యం దూరమవుతోంది. ప్రస్తుతం వైద్యులు పాటిస్తున్న సమయపాలతో రైతులకు, వైద్యులకు మధ్య దూరం పెరుగుతోంది. దీంతో మూగజీవాలకు సరైన సమయంలో వైద్యం అందడం లేదు. పశువైద్యులు ఉదయం 7 గంటలకే దవాఖానకు రావాలని, దీంతో జీవాలకు సరైన వైద్యం అందడంతో పాటు, ఎలాంటి నష్టం ఉండదని రైతులు అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 7 గంటలకే పశువుల ఆసుపత్రులను తెరవగా, స్వరాష్ట్రంలో అది 9 గంటలకు మారింది. పశు వైద్యశాలల సమయాన్ని ఉదయం 8 నుంచి 9 కి మారుస్తూ 2017లో అధికారులు నిర్ణయించారు. అప్పటి నుంచి తెలంగాణలో పశువైద్యశాలలు ఉదయం 9 గంటల తరువాత తెరుచుకుంటున్నాయి.
దీంతో పశువుల మేతకు వెళ్లిన తరువాత వైద్యులు హాస్పిటళ్లకు వచ్చి ఎవరికి వైద్యం చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పశువైద్యశాలలు ఉదయం 9 గంటలకు తెరుచుకుంటున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లోని మూగజీవాలకు పూర్థిస్తాయిలో వైద్యం అందడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఉదయం 7 గంటలకే వైద్యులు వస్తే జీవాలన్ని ఇండ్ల వద్దే ఉంటాయని, ఎలాంటి సమస్య ఉన్నా త్వరగా పరిష్కారమవుతుందంటున్నారు. ఉదయం 9 గంటలకు దవాఖానలు తెరుచుకోవాల్సి ఉండగా వైద్యులు స్థానికంగా ఉండకపోవడంతో వైద్యులు వచ్చి, ఆసుపత్రులు తెరిచేలోపు ఉదయం 10 గంటలు దాటుతుందని, అప్పటికే పశువులన్నీ మేతకు వెళ్తున్నాయని రైతులు చెప్పుతున్నారు.
సరైన సమయమూ అదే
గొర్రెలు, మేకలకు చేయాల్సిన వ్యాక్సిన్లు, పలు టీకాలతో పాటు పశువులకు చేసే కృత్రిమ గర్భధారణ టీకాలను సూర్యోదయం (చల్లటి వాతావరణం)లోపు చేయాల్సి ఉంది. ఆ సమయంలో అయితేనే టీకాలు పూర్థిస్థాయిలో పనిచేస్తాయని అధికారులే చెబుతున్నారు. దీని కారణంగానే చాలా వరకు టీకాలను ఐస్ బాక్స్‌లో నిల్వ చేస్తారు. అయితే వ్యాక్సిన్లను చల్లటి సమయంలో మాత్రమే ఇవ్వాల్సి ఉండగా, మన దగ్గర మాత్రం అధికారుల జాప్యంతో ఉదయం 11 తరువాత వేస్తున్నారు. ఉదయం 11 తరువాత వ్యాక్సిన్లు ఇవ్వకూడదనప్పటికీ స్వయంగా శాఖ డైరెక్టర్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఉదయం 11 తరువాత గొర్రెలకు పీపీఆర్ వ్యాక్సిన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై పలు ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న పశువైద్యుల్లో కొంతమందికి ఆయా మండలాలు, జిల్లాల వారీగా ఆ శాఖ ప్రత్యేక డ్యూటీలను వేస్తున్నారు. ఈ కారణాలతో ఆ వైద్యులు స్పెషల్ డ్యూటీ పనిలోనే నిమగ్నమవాల్సి వస్తోంది. దీంతో అసలు చేయాల్సిన వైద్యాన్ని పారా స్టాఫ్ చేస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ అధికారులు చేయాల్సిన పనిని, వైద్యులకు అప్పగించడం వలనే వైద్యులు ఆస్పత్రులకు వెళ్లేందుకు ఆటంకంగా మారుతుందనే అపవాదు కూడా ఉంది.
ఉదయానికి మార్చాల్సిందే
రాష్ట్రంలోని మూగజీవాలకు అందిస్తున్న వైద్యాన్ని పూర్తిస్థాయిలో అందించాలంటే పశువైద్యశాలల సమయాన్ని ఉదయం 9 నుంచి 7కి కుదించాలని 2021 మార్చి 16న తెలంగాణ గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రకు లేఖ రాశారు. లేఖపై స్పందించిన సెక్రటరీ మార్చి 22న లేఖలోని అంశాలను ప్రస్తావిస్తూ పరిశీలించాలని ఆ శాఖ డైరక్టర్‌ను ఆదేశించారు. దీనిపై పరిశీలించిన డైరక్టర్ రెండు నెలల తరువాత 2021 మే 22న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సర్వీస్ అసోసియేషన్‌కు ఆసుపత్రుల సమయం కుదింపుపై నిర్ణయం కోసం వారి అభిప్రాయం చెప్పాలంటూ మరొక లేఖను పంపారు. అయితే దీనిపై అసోసియేషన్ ఇంకా రిప్లై ఇవ్వలేదు.
పక్క రాష్ట్రాల్లో ఉదయమే
ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల పశువైద్యశాలలను గమనిస్తే కొన్ని రాష్ట్రాల్లో సీజన్ వారీగా సమయం కేటాయించగా, మరికొన్నేమో ఉదయం, మధ్యాహ్నం వారీగా విభజింజి మూగజీవాలకు వైద్యాన్ని అందిస్తున్నాయి. తమిళనాడులో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు దవాఖానలు తెరుస్తున్నారు. మహారాష్ట్రలో ఉదయం 8 నుంచి 12 వరకు మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు, రాజస్థాన్‌లో సీజన్ వారీగా సమయాలకు కేటాయించారు. వేసవికాలంలో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, చలికాలంలో అంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటాయి. కర్నాటకలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు పశు వైద్యాస్పత్రులు ఉంటున్నాయి. కానీ మన దగ్గర మాత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటున్నాయి.
చాలా వరకు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలకే వైద్యశాలలు తెరుచుకుంటున్నాయి. దీనిపై పలు రైతు సంఘాలు కూడా అధికారులకు వివరించారు. రాష్ట్రంలో మూగ జీవాలు ఎక్కువ ఉంటాయని, పాడిపై ఆధారపడి లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, కానీ సరైన సమయంలో వైద్యం అందడం కష్టంగా మారిందంటున్నారు. రాష్ట్రంలో పశువైద్యశాలల సమయం ఉదయం 7 గంటలకు తెరిచే విధంగా చూడాలని అటు రైతులు, ఇటు సంఘాలు పశుసంవర్ధక శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాయి.