ఓట్ల కోసం జిమ్మిక్కులు.. వింటే ఆఫర్స్ లేదా వార్నింగ్

దిశ, తెలంగాణ బ్యూరో : మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరింత లోతుగా వెళ్తోంది. రెండు చోట్లా గెలిచి తీరాలనే పట్టుదలతో ప్రణాళికా రచన చేస్తూ ఉద్యోగవర్గాలపై ఒత్తిడి తెస్తోంది. అవసరమైతే బెదిరింపులకు గురి చేసైనా ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. మండలి ఎన్నికల తర్వాతే పీఆర్సీ నిర్ణయం ఉంటుందని బూచీగా చూపిస్తోంది. ఈ ఎన్నికల్లో కూడా వ్యతిరేకతను చూపిస్తే వచ్చేది కష్టకాలమేనంటూ హెచ్చరికలను పంపుతోంది. ఇప్పటి వరకు వ్యతిరేకంగా ఉన్న నేతలను దగ్గరకు తీస్తోంది. రెండోసారి […]

Update: 2021-03-03 11:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరింత లోతుగా వెళ్తోంది. రెండు చోట్లా గెలిచి తీరాలనే పట్టుదలతో ప్రణాళికా రచన చేస్తూ ఉద్యోగవర్గాలపై ఒత్తిడి తెస్తోంది. అవసరమైతే బెదిరింపులకు గురి చేసైనా ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. మండలి ఎన్నికల తర్వాతే పీఆర్సీ నిర్ణయం ఉంటుందని బూచీగా చూపిస్తోంది. ఈ ఎన్నికల్లో కూడా వ్యతిరేకతను చూపిస్తే వచ్చేది కష్టకాలమేనంటూ హెచ్చరికలను పంపుతోంది. ఇప్పటి వరకు వ్యతిరేకంగా ఉన్న నేతలను దగ్గరకు తీస్తోంది.

రెండోసారి పెరిగిన వ్యతిరేకత..

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రభుత్వ ఉద్యోగ వర్గాలపై టీఆర్​ఎస్​ దృష్టి పెట్టింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్​ఎస్​పై ఉద్యోగవర్గాల విమర్శలు ఎక్కువయ్యాయి. ఉద్యోగులు ప్రభుత్వం ప్రకటించిన హామీలను నెరవేర్చడం లేదనే ఆగ్రహంతో ఉన్నారు. తొలిసారి ఎలాగో నెట్టుకొచ్చినా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. రాష్ట్రంలో ఇప్పుడు ఉద్యోగ జేఏసీ లేకుండా చేసే ప్లాన్​ అమలవుతోందని ఉద్యోగ సంఘాల్లో చర్చ నడుస్తోంది. గతంలోనే ఆర్టీసీ జేఏసీని నిర్వీర్యం చేసిన విధానాన్ని ఇప్పుడు ఇతరులపై కూడా కొనసాగించబోతున్నారని ఉద్యోగ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.

ప్లాన్​ బీ..

ఓవైపు ఉద్యోగులను ప్రసన్నం చేసుకునే పాట్లు వేగిరం చేస్తున్నారు. మండలి ఎన్నికల్లో అండగా ఉంటేనే మంచి పీఆర్సీ అంటూ సంకేతాలంటూ చెప్పకనే చెప్పుతున్నారు. ఇలా ఉద్యోగులను ఒక విధంగా మభ్య పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే సంఘ నేతలను కూడా భయపెడుతున్నట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. నిన్నటిదాకా ప్రభుత్వంపై గరంగా ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు ఒక్కసారిగా మద్దతు చెబుతున్నారంటే అధికార పార్టీ ఎంత భయానికి గురి చేస్తోందో తెలుస్తోంది.

మధుసూదన్​రెడ్డి మళ్లీ మారాడు..

తెలంగాణ లెక్చరర్స్‌ సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అక్టోబర్, 2019 ​లో అరెస్ట్‌ చేసి జెల్లో ఉంచిన విషయం తెలిసిందే. పాత విషయమే అయినా ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తుంది. కారణాలేమైనా ఇంటర్​ జేఏసీ చైర్మన్​ ​ మధుసూదన్​రెడ్డిని ప్రభుత్వం టార్గెట్​ చేసింది. ఆ సమయంలో ఇంటర్​ పేపర్ల లీకేజీ, మార్కుల్లో అవకతవకలపై ఆయన ​ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టిన కారణంగానే ప్రభుత్వం ఆయనపై గురి పెట్టిందనేది ఉద్యోగ వర్గాల టాక్​. తర్వాత ఆయన ప్రభుత్వంపై కొంత ఆగ్రహంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఒక్కసారిగా మారి టీఆర్​ఎస్​కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. పల్లా రాజేశ్వర్​రెడ్డికి మద్దతుగా ఉంటామని ప్రకటించారు.

బెదిరింపులా… బుజ్జగింపులా..?

మండలి ఎన్నికల కోసం సీఎం కేసీఆర్​ నేరుగా రంగంలోకి దిగారు. ఎన్నికల్లో గెలిచి తీరాలనే లక్ష్యంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఉద్యోగ వర్గాలను ప్రసన్నం చేసుకోవడానికి ఉద్యోగ నేతలను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కొంతమంది ఉద్యోగ నేతలపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఆర్సీ అంశంలో రోడ్డెక్కిన ఉద్యోగ సంఘాలన్నీ కీలకమైన మండలి ఎన్నికల్లో మాత్రం సైలెంట్​ అయ్యాయి. ప్రభుత్వం నుంచి బెదిరింపులు రావడంతోనే సైలెంట్​ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇలా మొత్తంగా కొందరిని బుజ్జిగిస్తూ, కొందరిని బెదిరిస్తున్నట్లు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు.

Tags:    

Similar News