ఎక్కడివి అక్కడే.. నిధులు రావు.. సమస్యలు తీరవు!
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ‘తెలంగాణ వచ్చి ఏడేండ్లు గడిచినా.. మాకు డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదు.. రెండేళ్ల క్రితం దరఖాస్తు పెట్టుకున్నా పింఛను వస్తలేదు.. 57ఏళ్లు ఉంటే పింఛను ఇస్తామని ప్రజాప్రతిధులు అంటున్నా.. ఇప్పటికీ ఇవ్వడం లేదు. రెండున్నరేళ్లుగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నా మంజూరు చేయడంలేదు.. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పినా అమలుకు నోచుకోలేదు.. మా భూముల్లో ప్రాజెక్టులు కడుతున్నా.. ఏళ్లయినా పరిహారం అందలేదు. ఊరు నీళ్లలో మునిగితే.. పునరావాసం చూపడంలేదు..’ […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ‘తెలంగాణ వచ్చి ఏడేండ్లు గడిచినా.. మాకు డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదు.. రెండేళ్ల క్రితం దరఖాస్తు పెట్టుకున్నా పింఛను వస్తలేదు.. 57ఏళ్లు ఉంటే పింఛను ఇస్తామని ప్రజాప్రతిధులు అంటున్నా.. ఇప్పటికీ ఇవ్వడం లేదు. రెండున్నరేళ్లుగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నా మంజూరు చేయడంలేదు.. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పినా అమలుకు నోచుకోలేదు.. మా భూముల్లో ప్రాజెక్టులు కడుతున్నా.. ఏళ్లయినా పరిహారం అందలేదు. ఊరు నీళ్లలో మునిగితే.. పునరావాసం చూపడంలేదు..’ ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోకపోగా.. స్థానిక సమస్యల పరిష్కారం కాకపోవడంతో వెల్లువలా వినతులు వస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలను, మండల స్థాయి ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో ప్రజలు నిలదీస్తుండడంతో ఇప్పుడేం చేద్దామనే అంతర్మథనంలో అధికార పార్టీ నాయకులు పడిపోయారు.
రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి, ప్రజాప్రతినిధులకు మూడేళ్ల గడువు ఉండగానే క్షేత్రస్థాయిలో నిరసనలు, చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సర్కారు ముందుకెళ్లే పరిస్థితి లేకపోగా.. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు సఫలీకృతం కాలేకపోతున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, కొత్త పింఛన్లు, 57 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు వంటి పథకాల అమలులో సర్కారు, ప్రజాప్రతినిధులకు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే వేలాది సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.
పెండింగ్‌లో వేల దరఖాస్తులు
2019 మార్చి నుంచి కొత్త పింఛన్లకు సర్కారు అనుమతి ఇవ్వకపోగా.. 20 వేల వరకు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. 57 ఏళ్లు దాటిన వారికి పింఛన్ ఇస్తామని చెప్పి.. ఎన్నికల ఓటరు జాబితా ప్రకారం అర్హులను కూడా గుర్తించారు. సుమారు 60 వేల మంది వరకు అర్హులు ఉండగా, వీరికి రెండేళ్లుగా ఎదురుచూపులే మిగిలాయి. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో చెప్పగా, రూ.25వేల లోపు వారికే మాఫీ కాగా, మిగతా వారికి ఇప్పటి వరకు సర్కారు నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 15 వేల మందికి, రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రజల్లో రోజురోజుకూ అసంతృప్తి పెరుగుతుండడంతో అధికార పార్టీ నాయకులకు తలనొప్పిగా మారింది.
డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల్లో అసహనం
ఉమ్మడి జిల్లాలో 6,686 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైనా.. 951 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇందులో రెండు గ్రామాల్లో మాత్రమే పూర్తయి గృహ ప్రవేశం చేయగా.. 60 మంది లబ్ధిదారులు మాత్రమే కొత్తింట్లోకి వెళ్లారు. మిగతా గ్రామాల్లో పనులు మధ్యలోనే ఉండగా.. చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో పేదోడి సొంతింటి కల నెరవేరటం కష్టమేనని తెలుస్తోంది. ఇండ్ల నిర్మాణ స్థలంతో పాటు నిర్మాణానికి కూడా డబ్బులు వసూలు చేస్తుండగా.. ఏళ్లు గడిచినా ఇండ్లు ఇవ్వకపోవటంతో లబ్ధిదారుల్లో అసహనం పెరుగుతోంది. ఇటీవల కుభీర్ మండలం మాలేగాంలో లబ్ధిదారులు ఏకంగా స్థానిక ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డిని అడ్డుకుని నిలదీశారు.
నిరసనలు.. ఆందోళనలు..
స్థానిక సమస్యల పరిష్కారంలోనూ అధికార పార్టీ నేతలకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. ఉమ్మడి జిల్లాలో సదర్మాట్, గుండెగాం, కాళేశ్వరం పనులు చేస్తున్నా.. రైతులకు పరిహారం, పునరావాసం విషయంలో నిరీక్షణ తప్పడం లేదు. ఇటీవల సదర్మాట్ ముంపు నిర్వాసితులు భూముల పరిహారం కోసం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. పల్సీకర్ రంగారావు ప్రాజెక్టులో భైంసా మండలం గుండేగాం గ్రామం ఏటా ముంపునకు గురవుతున్నా.. పునరావాసం కల్పించలేదు. ప్రతి సంవత్సరం వానాకాలంలో నిరసనలు, ఆందోళనలు చేస్తుండగా.. వారికి సర్కారు నిధులు కేటాయించి పునరావాసం చూపడంలేదు. గత ఏడాది మార్చి నుంచి కరోనా ప్రభావంతో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. దీంతో నిధులు రాకపోవడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మింగలేక.. కక్కలేని పరిస్థితి ఉంది. ఏం చేయాలో పాలుపోక అంతర్మథనంలో పడిపోతున్నారు.
‘సదర్మాట్’ నిర్వాసితుల ఆందోళన
సదర్మాట్ బ్యారేజీ నిర్వాసితుల కథ కలెక్టరేట్ కు చేరింది. మామడ మండలం పొన్కల్ వద్ద నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ నిర్వాసితులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పది రోజులుగా వివిధ రూపంలో నిరసన తెలియజేస్తున్న నిర్వాసితులు తాజాగా సోమవారం కలెక్టరేట్ కు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వెంటనే పరిహారం అందించి తమను ఆదుకోవాలని డిమాండ్‌చేశారు. ఈ మేరకు రైతులు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.