భద్రాచలం బరిలో కోరం కనకయ్య..?
దిశ, భద్రాచలం : జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య చూపు భద్రాచలం అసెంబ్లీ సీటుపై పడినట్లు కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి ఆయన బరిలోకి దిగడానికి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. భద్రాచలం నియోజకవర్గ పర్యటనల వెనుక ఆంతర్యం అదే అనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో లేకపోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా భద్రాచలం నుంచి పోటీచేసి గ్రూపు గొడవల మూలంగా ఓటమి పాలైన డాక్టర్ తెల్లం వెంకట్రావుకు […]
దిశ, భద్రాచలం : జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య చూపు భద్రాచలం అసెంబ్లీ సీటుపై పడినట్లు కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి ఆయన బరిలోకి దిగడానికి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. భద్రాచలం నియోజకవర్గ పర్యటనల వెనుక ఆంతర్యం అదే అనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో లేకపోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా భద్రాచలం నుంచి పోటీచేసి గ్రూపు గొడవల మూలంగా ఓటమి పాలైన డాక్టర్ తెల్లం వెంకట్రావుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చి భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు.
వచ్చే 2023 ఎన్నికల్లో మళ్ళీ ఆయనకే పార్టీ టిక్కట్ లభించే అవకాశాలు ఉండగా, డాక్టర్ తెల్లం వెంకట్రావుని వ్యతిరేకిస్తున్న వారు ఓ గ్రూపుగా ఏర్పడి కోరం కనకయ్యను తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. భద్రాచలం నియోజకవర్గంపై పట్టు కలిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డాక్టర్ తెల్లం వెంకట్రావులు ఒకే మాట, ఒకే బాటగా నడుస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణని వ్యతిరేకించే కొందరికి తెల్లం వెంకట్రావు వైఖరి ఏ మాత్రం నచ్చడం లేదు. తమతో కలిసి రావాలని చాలాసార్లు చెప్పి విఫలమైనారు. ఆ క్రమంలో బాలసానిని విభేదించే దుమ్మగూడెం, చర్ల, వెంకటాపురం మండలాలకు చెందిన ఓ సామాజికవర్గం నాయకులు మంత్రి అండదండలతో కోరం కనకయ్యకి భద్రాచలం టిక్కట్ ఇప్పించుకుని బరిలోకి దించాలనే ఎత్తుగడతో ఉన్నట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలోనే భద్రాచలం నియోజకవర్గంలో బలమైన బాలసాని వర్గం తమ బలాన్ని పటిష్టపర్చుకునే పనిలో పడ్డారు. బాలసాని తన రాజకీయ చతురతతో భద్రాచలం, చర్ల, వెంకటాపురం మండలాల్లో తన వెంట నడిచే నాయకులకు పార్టీ అధ్యక్ష పదవులు దక్కించుకున్నారు. అనుబంధ కమిటీల్లోనూ ఆయన అనుచరులే అధికంగా ఉన్నారు.
ఎమ్మెల్యే లేని లోటు కనకయ్యతో భర్తీ..
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా మహబూబాబాద్ ఎంపీ సీటు గెలిచినా, నిత్యం నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రాంతం వారైన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అందుబాటులో ఉంటున్నా, లోకల్ ఎమ్మెల్యే లేని లోటు భద్రాచలం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీకి మైనస్ గానే ఉంది. స్థానిక అధికారాన్ని బట్టే అధికారులు, నాయకుల మాట వింటారని ఆలస్యంగా గ్రహించిన టీఆర్ఎస్ లీడర్లు ఆ లోటుని జడ్పీ చైర్మన్ కనకయ్య ద్వారా భర్తీ చేస్తున్నారు. తరచూ ఆయన ఈ ప్రాంతంలో పర్యటించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే క్రమంలో ఎంపీ, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ పర్యటనల సందర్భంగా వారి ముఖ్య అనుచరులుగా లోకల్ అధికారుల దృష్టిని ఆకర్షించేలా మండల నాయకులు హడావుడి చేయాల్సి వస్తోంది. అంతేగాక ఉన్నతస్థాయి ప్రజాప్రతినిథులతో అవసరమైనపుడు లోకల్ అధికారులకు ఫోన్లు చేయించుకొని పైరవీల కోసం తమ పరపతి, పలుకుబడి పెంచుకునేందుకు పాట్లు పడక తప్పడం లేదు. భద్రాచలం సీటు పార్టీ గెలవకపోవడమే దీనికి ప్రధాన కారణం. అంతేగాక గ్రూపు గొడవల వలన ఎంపీపీ, జడ్పీటీసీ వంటి కీలక పదవులు కోల్పోవడం కూడా మరో కారణంగా చెప్పక తప్పదు.
ఇల్లందులో కనకయ్యకు చాన్స్ లేనట్లే..
ఇల్లందు నియోజకవర్గానికి చెందిన కోరం కనకయ్య గత 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి బానోతు హరిప్రియ చేతిలో ఆయన ఓడిపోయారు. తదనంతర రాజకీయ పరిణామాల్లో హరిప్రియ టీఆర్ఎస్‌లో చేరగా, కోరం కనకయ్యకు జడ్పీ చైర్మన్ పదవి దక్కింది.
ప్రస్తుతం హరిప్రియ, కోరం కనకయ్య వర్గాల నడుమ ఉప్పునిప్పులా పరిస్థితులు ఉన్నాయి. హరిప్రియ పార్టీలో పైచేయి సాధిస్తూ కోరం కనకయ్య వర్గాన్ని వెనక్కి నెట్టేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కీలక పదవులు అన్నీ ఎమ్మెల్యే హరిప్రియ అనుచరులే దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ సీటు ఎమ్మెల్యే హరిప్రియ పదిల పర్చుకున్నట్లే. ఈ నేపథ్యంలో ఈసారి కోరం కనకయ్య ఇల్లందు నుంచి పోటీచేసే చాన్స్‌లేదు. దీంతో ఆయన చూపు భద్రాచలం నియోజకవర్గంపై పడింది. భద్రాచలం నియోజకవర్గంలో పార్టీలో గ్రూపులను కనకయ్య తనకు అనుకూలంగా మలుచుకొంటున్నారు. తన జడ్పీ చైర్మన్ పదవి ద్వారా ప్రజాసమస్యలను పరిష్కరిస్తూ ప్రజల విశ్వాసం చూరగొంటున్నారు. అదే క్రమంలో భద్రాచలం నియోజకవర్గ పార్టీ క్యాడర్‌తో పరిచయాలు పెంచుకొంటున్నారు. కనకయ్య కా(రా)వాలి అని భద్రాచలం పార్టీ శ్రేణులు అధిష్టానాన్ని అడిగేలా తన పనితీరు చూపిస్తున్నారు.
దూకుడు పెంచిన ‘తెల్లం’
నమ్మిన నాయకులు, అభిమానిస్తున్న అనుచరులే తనకు వెన్నుపోటు పొడవడానికి సిద్ధం అవుతున్నారని గ్రహించిన డాక్టర్ తెల్లం వెంకట్రావు నష్ట నివారణ చర్యలపై దూకుడు పెంచారు. తన వ్యతిరేకులకు పార్టీ కమిటీల్లో పదవులు దక్కకుండా చెక్ పెడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పంపిన డబ్బులు ఓటర్లకు చేరకపోవడం వల్లనే నష్టం జరిగినట్లు ఆయన గుర్తించి డబ్బులు పంపిణీ చేయని నాయకులను పక్కన బెడుతున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. పైరవీల కోసం పరుగులు తీసేవారిని, పార్టీ కోసం పనిచేసేవారిని ఆయన గుర్తించే పనిలో నిమగ్నమైనారు. పోస్టుమార్టం చేయకుంటే భవిష్యత్తులో పార్టీకి నష్టం తప్పదనే భావనతో తెల్లం వెంకట్రావు కఠిన నిర్ణయాలతో అడుగులు వేస్తున్నారు.