ప్రచారం కోసం ప్రభుత్వ నిధులు.!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణ లోపమో.. లేక జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రవర్తనా నియామవళి బృందాల వైఫల్యమో గానీ అధికార పార్టీకి చెందిన రంగుల బ్యానర్లు, హోర్డింగ్‌లు వేల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. అనుమతి లేకుండా ప్రభుత్వ ఆస్తులపై ఎన్నికల ప్రచారం చేసుకోవడం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కిందికి వస్తుంది. అధికార పార్టీకి మాత్రం ఈ విషయంలో ఎన్నికల సంఘం మినహాయింపు ఇచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నాలుగు […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణ లోపమో.. లేక జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రవర్తనా నియామవళి బృందాల వైఫల్యమో గానీ అధికార పార్టీకి చెందిన రంగుల బ్యానర్లు, హోర్డింగ్‌లు వేల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. అనుమతి లేకుండా ప్రభుత్వ ఆస్తులపై ఎన్నికల ప్రచారం చేసుకోవడం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కిందికి వస్తుంది. అధికార పార్టీకి మాత్రం ఈ విషయంలో ఎన్నికల సంఘం మినహాయింపు ఇచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నాలుగు రోజులు పూర్తయిన టీఆర్ఎస్ హోర్డింగ్, బ్యానర్లతో నగరం గులాబీమయంగా మారింది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులైన బస్టాండ్లు, పబ్లిక్ టాయిలెట్లు తేడా లేకుండా బల్దియా పరిధిలోని ప్రతీ ప్రభుత్వ స్థలాన్ని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. మెట్రో కారిడార్లలోని ఫ్లైఓవర్ల కింద లాలీపాప్‌లు, ఇతర బ్యానర్లు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి.
ప్రచారానికి ప్రభుత్వ నిధులు, ఆస్తులు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అన్ని అస్త్రాలు ఉపయోగించుకుంటున్నట్టు కనిపిస్తోంది. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లు, పబ్లిక్ టాయిలెట్లు, వాటర్ ఏటీఏంలనూ పార్టీ ప్రచార హోర్డింగ్‌లతో నింపేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకునేలా రూపొందించిన బ్యానర్లతో పాటు ’టీఆర్ఎస్‌కే మీ ఓటు’ అని రాయించిన ప్రచార పత్రాలతో నింపేశారు. అయినా ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ అటువైపు దృష్టిసారించడం లేదు. బల్దియాకు ఆదాయం వచ్చే వనరులు, ఆస్తులపై యథేచ్ఛగా అధికార పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండటం గమనార్హం. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రచారం కోసం 15 రోజుల క్రితమే ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు సమాచారం. ఎల్‌ఆర్ఎస్, బీఆర్ఎస్, ఉమెన్ సేఫ్టీ, ఐటీ, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, కేబుల్ బ్రిడ్జి వంటి పనులకు విస్తృత ప్రచారం కల్పించేలా భారీ హోర్డింగ్‌లు, బ్యానర్లను ఫ్లైఓవర్లు, నగరంలోని ప్రభుత్వ ఆస్తులపై ఏర్పాటు చేయించారు. వీటినే ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకునేలా అధికార పార్టీ వ్యూహాలు చేసుకుంటుంది. నగరంలో అధికంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎన్నికల ప్రచారం హోర్డింగ్‌లే ఉన్నా.. ఎన్నికల సంఘం తొలగించేందుకు వెనకాడుతోందనే విమర్శలు వస్తున్నాయి. మెట్టుగూడ, తార్నాక, ఖైరతాబాద్ ప్రాంతాల్లోని మెట్రో కారిడార్‌లోనూ, ఉస్మానియా క్యాంపస్, సెక్రటేరియట్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఉప్పల్, అంబర్ పేట, ఎల్బీనగర్ ఏరియాల్లోని బస్టాండ్‌లు, టాయిలెట్లపైనా టీఆర్ఎస్ ఎన్నికల హోర్డింగ్ కనిపిస్తున్నాయి.