పొలిటికల్ హాట్ న్యూస్.. రేవంత్‌కు ఊహించని షాక్..!
దిశ, తెలంగాణ బ్యూరో : సుమారు ఏడేండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ దగ్గరవుతున్నది. వంద జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేవదని, చరిత్ర కాల గర్భంలో కలిసిపోయిందని కామెంట్స్ చేసిన టీఆర్ఎస్.. ప్రస్తుతం హస్తం స్నేహాన్ని కోరుకుంటున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీకి సహకారం అందిస్తూ వచ్చిన గులాబీ పార్టీ ప్రస్తుతం ఆ బంధాలను తెంచుకున్నామనే సంకేతాన్ని ఇచ్చింది. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఇద్దరు కేంద్ర మంత్రులను పరుష పదజాలంతో దూషించిన […]
దిశ, తెలంగాణ బ్యూరో : సుమారు ఏడేండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ దగ్గరవుతున్నది. వంద జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేవదని, చరిత్ర కాల గర్భంలో కలిసిపోయిందని కామెంట్స్ చేసిన టీఆర్ఎస్.. ప్రస్తుతం హస్తం స్నేహాన్ని కోరుకుంటున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీకి సహకారం అందిస్తూ వచ్చిన గులాబీ పార్టీ ప్రస్తుతం ఆ బంధాలను తెంచుకున్నామనే సంకేతాన్ని ఇచ్చింది. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఇద్దరు కేంద్ర మంత్రులను పరుష పదజాలంతో దూషించిన సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం చేతకానిదంటూ అభివర్ణించారు. ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై 14 విపక్ష పార్టీలు నిర్వహించిన సమావేశానికి టీఆర్ఎస్ తరఫున లోక్‌సభ, రాజ్యసభ పక్ష నేతలు హాజరుకావడం సరికొత్త రాజకీయ చర్చకు దారితీసింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని నిర్వహించిన సమావేశానికి టీఆర్ఎస్ నేతలు హాజరుకావడం ద్వారా బీజేపీకి బైబై చెప్పినట్లేనన్న సంకేతాన్ని ఇచ్చినట్టయింది. ఎట్టి పరిస్థితుల్లో ఈటలకు బీజేపీలో స్థానం కల్పించవద్దని కేసీఆర్ చేసిన సూచన బెడిసికొట్టడంతో మొదలైన అసంతృప్తి, వ్యతిరేకత.. హుజూరాబాద్ ఫలితం తర్వాత తారస్థాయికి చేరిందని బీజేపీ నేతల అభిప్రాయం. వడ్ల కొనుగోళ్ల విషయాన్ని రాజకీయంగా మార్చడానికి, కేంద్రం మీద యుద్ధం ప్రకటించడానికి ఆ అసహనమే కారణమైనట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అండ టీఆర్ఎస్‌కు అనివార్యమనే భావనతోనే ప్రస్తుతం ఆ పార్టీతో స్నేహాన్ని స్టార్ట్ చేస్తున్నదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
ఎందుకోసం..?
బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్ష పార్టీలకు టీఆర్ఎస్ దగ్గర అవుతుండటంతో అది కేవలం అంశాలవారీ మద్దతులో భాగమా? లేక కాంగ్రెస్‌కు సహకారం అందించాలనే నిర్ణయంలో భాగమా? లేదంటే రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ నుంచి సహకారం పొందడానికేనా? రానున్న ఎన్నికల వరకూ ఇదే స్నేహాన్ని కొనసాగించి తెలంగాణలో బీజేపీని ఓడించాలనే లక్ష్యం కోసమే టీఆర్ఎస్ ఆలోచన చేస్తుందా? మరి ఏడేండ్లుగా టీఆర్ఎస్ వైఖరిని గమనించిన కాంగ్రెస్.. ఇప్పుడు టీఆర్ఎస్‌ను నమ్ముతుందా? అనే చర్చలు సైతం ఢిల్లీలో జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్న కేశవరావు ఇకపైన కీలక భూమిక పోషించనున్నారనే డిస్కషన్ సైతం జరుగుతున్నది.
కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది సీనియర్ నేతలతో ఆయన ఇప్పటికీ సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రస్తుతానికి పన్నెండు మంది రాజ్యసభ సభ్యుల్ని మొత్తం శీతాకాల సమావేశాల సెషన్ నుంచి సస్పెండ్ చేసిన అంశంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య స్నేహం చిగురించింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఒక జాతీయ పార్టీగా కూడా గుర్తించడానికి టీఆర్ఎస్ ఇంతకాలం నిరాకరించింది. ఇప్పుడు దోస్తానా ప్రారంభం కావడంతో రాష్ట్ర హస్తం నేతలు డైలమాలో పడ్డారు. బీజేపీకి ‘బీ-టీమ్’ అంటూ టీఆర్ఎస్‌ను తిట్టిన కాంగ్రెస్ చివరకు ఆ పార్టీని పక్కన పెట్టుకోవడం గమనార్హం.
రేవంత్ రెడ్డికి సవాళ్లు..
రాష్ట్రంలో రాజకీయ ఆధిపత్యం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలకు తాజా పరిణామాలు మింగుడుపడడం లేదు. కేసీఆర్‌పైన యుద్దం ప్రకటించి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తున్న దశలో ఢిల్లీలో జరిగిన సమావేశానికి ఆ పార్టీ నేతలు హాజరుకావడం ఎక్కడికి దారి తీస్తుందోననే గుబులు మొదలైంది. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా కలిసిన టీఆర్ఎస్ వైఖరి ఇకపైన ఎలా ఉంటుందోననే చర్చ మొదలైంది.
పీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తూ కార్యాచరణ మొదలు పెట్టిన రేవంత్ ఇకపైన ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్‌తో దోస్తానా అంశాలవారీగా మాత్రమే ఉన్నా.. రాష్ట్రంలో ఫైట్ చేయడంలో రేవంత్ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారన్నది కీలకం. రానున్న ఎన్నికల్లో 72 సీట్ల గెలుపొందడం ఖాయమంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ పలు సందర్భాల్లో కామెంట్స్ చేశారు. వడ్ల కొనుగోళ్ల అంశంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని, ఇద్దరూ కలిసి రైతులను నిండా ముంచుతున్నారని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అదే రైతు వ్యతిరేక విధానాల విషయంలో కాంగ్రెస్ తలపెట్టిన కార్యక్రమాల్లో టీఆర్ఎస్‌ను భాగస్వామ్యం చేసేలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ రాష్ట్ర నేతలతో టీఆర్ఎస్ వైఖరి ఇప్పటివరకు ఉప్పు-నిప్పుగా ఉన్నప్పటికీ.. కేంద్రంలోని పెద్దలతో మాత్రం సత్సంబంధాలే ఉన్నాయి. కానీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను పరుష పదాలతో కేసీఆర్ దూషించడంతో ఆ పార్టీతో దాదాపుగా బంధాన్ని తెంచుకోవాలన్న సంకేతాన్ని ఇచ్చినట్లయింది. పైగా కాంగ్రెస్ సహా విపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ హాజరై బీజేపీకి మెసేజ్‌ను సైతం పంపినట్లయింది. ఇన్నాళ్లు బీజేపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలను అందించిన టీఆర్ఎస్.. ఇకపైన ఎలా వ్యవహరించనున్నదనే చర్చలు మొదలయ్యాయి.