గ్రేటర్ ఎన్నికల్లో తోపులు వీళ్లే..
మొన్నటి వరకు మంత్రులది ఒకటే హడావిడి.. నియోజకవర్గాల్లో వారి పర్యటనలే హైలైట్.. ఎటూ చూసినా వారి క్యాన్వాయ్లే.. ఎక్కడ చూసినా వారు పాల్గొనే కార్యక్రమాలే.. ఒక దశలో అమాత్యుల టూర్లకు అధికారులు, స్థానిక శాసనభ్యులు విసిగిపోయిన సందర్భాలూ ఉన్నాయి.. కానీ, ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలే కింగ్ మేకర్స్ అయ్యారు.. లోకల్ ప్రయార్టీ దృష్ట్యా టీఆర్ఎస్ అధిష్ఠానం వారికే అగ్రతాంబూలం ఇస్తూ, బరిలో నిలిపే అభ్యర్థుల ఖరారులో వారు చెప్పినోళ్లకే ప్రాధాన్యం ఇచ్చింది.. పూర్తి బాధ్యతను […]
మొన్నటి వరకు మంత్రులది ఒకటే హడావిడి.. నియోజకవర్గాల్లో వారి పర్యటనలే హైలైట్.. ఎటూ చూసినా వారి క్యాన్వాయ్లే.. ఎక్కడ చూసినా వారు పాల్గొనే కార్యక్రమాలే.. ఒక దశలో అమాత్యుల టూర్లకు అధికారులు, స్థానిక శాసనభ్యులు విసిగిపోయిన సందర్భాలూ ఉన్నాయి.. కానీ, ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలే కింగ్ మేకర్స్ అయ్యారు.. లోకల్ ప్రయార్టీ దృష్ట్యా టీఆర్ఎస్ అధిష్ఠానం వారికే అగ్రతాంబూలం ఇస్తూ, బరిలో నిలిపే అభ్యర్థుల ఖరారులో వారు చెప్పినోళ్లకే ప్రాధాన్యం ఇచ్చింది.. పూర్తి బాధ్యతను వారికే అప్పగిస్తూ, అమాత్యులను డివిజన్లకు బాధ్యులుగా చేస్తూ అధినేత నిర్ణయం తీసుకున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బల్దియాలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అనూహ్యంగా పుంజుకున్న బీజేపీని ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. దీంట్లో ఎమ్మెల్యేల ఆధిపత్యం కొనసాగుతోంది. వారి చెప్పిన వారికే అధిక ప్రాధాన్యమిచ్చినట్లుగా జాబితాలు చెబుతున్నాయి. విబేధాలు ఉన్న ప్రాంతాల్లోనూ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు విలువ ఇచ్చారు. బల్దియాలోని మంత్రులకు పెద్దగా ప్రాధాన్యమిచ్చినట్లుగా కనిపించడం లేదు. వారి జాబితాలను పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. మొన్నటి దాకా అంతా తమదేనంటూ నగరంలో పర్యటించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు అభ్యర్థిత్వాల ఖరారులో ప్రాతినిధ్యం కనిపించలేదని పలువురు పేర్కొంటున్నారు.
గతంలో నగర మంత్రులకు గెలుపు బాధ్యతలను కూడా అప్పగించారు. ఇప్పుడేమో చిన్న చిన్న డివిజన్లకు పరిమితమయ్యారు. అప్పగించిన డివిజన్లలో మాత్రమే ప్రచారానికి కట్టబడి ఉండేటట్లుగా మార్గదర్శకం చేసినట్లు తెలిసింది. నగర మంత్రులకు కూడా వారి నియోజకవర్గ స్థాయిలోని డివిజన్లలో అభ్యర్థులు ఎంపిక, గెలుపు బాధ్యతలను కట్టబెట్టినట్లు ప్రచారం చేస్తున్నారు. కానీ కొందరు మంత్రుల కుటుంబ సభ్యులకు కూడా డివిజన్ల బాధ్యతలను అప్పగించారు.
నాడు సవాళ్లు.. నేడు మౌనం..
ఎన్నికలకు ముందు నగరంలో సవాళ్లు, ప్రతి సవాళ్లు విసిరిన మంత్రులు బల్దియా ఎన్నికల్లో మౌనం వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అభ్యర్థిత్వాల ఖరారులో ముద్ర వేయించుకోలేకపోయారు. తను ప్రాతినిధ్యం వహించిన సనత్ నగర్ తో పాటు గోషామహల్, అంబర్ పేట, నాంపల్లి, ముషీరాబాద్, కంటోన్మెంటు నియోజకవర్గాల్లో రోజూ పర్యటించేటట్లుగా షెడ్యూల్ ఉండేది. ఒక దశలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో పాటు అధికారులూ విసిగిపోయారు. లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కడుతున్నామంటూ కాంగ్రెస్ కు సవాల్ విసిరి పార్టీ శాసనపక్ష నేత భట్టి విక్రమార్కను వెంట తీసుకెళ్లి చూపించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇప్పుడేమో ఎన్నికల్లో తన నాయకత్వాన్ని నిలబెట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు రాజకీయ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అలాగే హోంమంత్రి మహమూద్ అలీ, సబితారెడ్డి, చామకూర మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు అనునిత్యం పర్యటనలతో బిజీగా కనిపించేవారు. ఇప్పుడేమో మహమూద్ అలీ మినహా మిగతా వారిని ఒక్కొక్క డివిజన్ కే పరిమితం చేశారు.
డివిజన్లకే పరిమితం..
బల్దియా ఎన్నికల్లో చాలా మంత్రులు డివిజన్లకే పరిమితమయ్యారు. గల్లీల్లో వారి కాన్వాయ్ లు వెళ్లే వీలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ఒక్కొక్క డివిజన్ కే పరిమితమయ్యారు. ప్రగతి భవన్ లో జరిగే ప్రతీ సమీక్షలో పాల్గొనే వాళ్లు, సీఎం కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనక చక్రం తిప్పే నాయకులు, రెవెన్యూ చట్టాల రూపకల్పనలో కీలక భూమిక పోషించిన వారు కూడా ఒక్కో డివిజన్ కే పరిమితమయ్యారు. టీఆర్ఎస్ వ్యూహాత్మక ప్రణాళికను పూర్తిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన అనుచరులే రూపొందిస్తున్నట్లు సమాచారం. స్టార్ క్యాంపెయిన్ లోనూ పలువురి పేర్లు ఉన్నప్పటికీ ఈ వారం పాటు జరిగే ప్రచారంలో కేటీఆర్ చరిష్మా మీదనే ఆధారపడ్డట్లు తెలుస్తోంది. అందుకే ఆయన రోడ్డు షోను ప్రతి డివిజన్ లోనూ ఉండేటట్లు షెడ్యూల్ ను సిద్ధం చేస్తున్నారు. అయితే పాత బస్తీలో ఎంఐఎం పార్టీతో ఎలాంటి పొత్తు లేదని ప్రకటించారు. కేటీఆర్ తో సహా మంత్రులంతా అదే మాటను పదేపదే వల్లిస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ ఎస్ స్టార్ క్యాంపెయిన్ పాత బస్తీలో ఏ మేరకు ఉంటుందో చూడాలని పలువురు పేర్కొంటున్నారు.
మంత్రులకు అప్పగించిన డివిజన్లు….
క్రమ సంఖ్య డివిజన్ మంత్రి
1. సరూర్ నగర్ జి.జగదీష్ రెడ్డి
2. భరత్ నగర్ టి.హరీష్ రావు
3. మీర్ పేట ఎర్రబెల్లి దయాకర్ రావు
4. చిలుకానగర్ సత్యవతి రాథోడ్
5. గాజులరామారం వేముల ప్రశాంత్ రెడ్డి
6. రంగారెడ్డినగర్ చామకూర మల్లారెడ్డి
7. హైదర్ నగర్ కేటీ రామారావు
8. వెంకటాపురం కొప్పుల ఈశ్వర్
9. మల్కాజిగిరి ఈటల రాజేందర్
10. కేపీహెచ్బీ కాలనీ పువ్వాడ అజయ్
11. అంబర్ పేట సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
12. అడిక్ మెట్ వి.శ్రీనివాస్ రెడ్డి
13. ఎర్రగడ్డ గంగుల కమలాకర్
14. బంజారాహిల్స్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
15. వివేకానందనగర్ బి.వినోద్ కుమార్(ప్రణాళిక సంఘం)
మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డికి సూరారం డివిజన్ బాధ్యతలు అప్పగించారు. అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఓ డివిజన్ ను కేటాయించారు. అందరు మంత్రుల కంటే మల్లారెడ్డి కుటుంబం పార్టీకి చాలా దగ్గరగా ఉందని జాబితా స్పష్టం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పదవులు ఈ కుటుంబానికి దక్కే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.