ఏసీబీ దాడుల సమాచారం.. నోట్ల కట్టలు కాల్చిన టీఆర్ఎస్ నేత
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ /కల్వకుర్తి : ఏసీబీ అధికారులు దాడులు చేయడానికి వచ్చారని తెలుసుకున్న అధికార పార్టీ నేత ఒకరు ఐదు లక్షల రూపాయలను తగలబెట్టిన ఘటన ఈరోజు సాయంత్రం కల్వకుర్తి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం కోరింత తండాకు చెందిన రాములు నాయక్ వెల్దండ మండలంలోని బెల్లంపల్లి గ్రామంలో 15 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశాడు. ఈ పొలంలో క్రషర్ మిషన్ ఏర్పాటు చేసుకోవడానికి, మైనింగ్ తీసుకోవడానికి వీలుగా సంబంధిత […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ /కల్వకుర్తి : ఏసీబీ అధికారులు దాడులు చేయడానికి వచ్చారని తెలుసుకున్న అధికార పార్టీ నేత ఒకరు ఐదు లక్షల రూపాయలను తగలబెట్టిన ఘటన ఈరోజు సాయంత్రం కల్వకుర్తి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం కోరింత తండాకు చెందిన రాములు నాయక్ వెల్దండ మండలంలోని బెల్లంపల్లి గ్రామంలో 15 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశాడు.
ఈ పొలంలో క్రషర్ మిషన్ ఏర్పాటు చేసుకోవడానికి, మైనింగ్ తీసుకోవడానికి వీలుగా సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. మైన్స్ అధికారులు వెల్దండ తహసీల్దార్ నుండి ఎన్ఓసి తీసుకురమ్మని కోరడంతో రాములు నాయక్ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంలో తహసీల్దార్ సైదులు గౌడ్ ఈ పని కావడానికి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ వైస్ ఎంపీపీ అయిన వెంకటయ్య గౌడ్‌ను కలవమని సూచించాడు.
రాములు నాయక్ ఈ విషయాన్ని వెంకటయ్య గౌడ్ దృష్టికి తీసుకువెళ్లగా ఎన్ఓసి కోసం తహసీల్దార్ లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని వాటిని సమకూరిస్తే వెంటనే ఎన్ఓసి వస్తుందని చెప్పాడు. చివరకు 5 లక్షల రూపాయలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని రాములు నాయక్ ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు ఇచ్చిన ఐదు లక్షల రూపాయలను మంగళవారం కల్వకుర్తి పట్టణంలో ఉన్న వెంకటయ్య గౌడ్‌కు అందజేశాడు.
ఆ డబ్బులు చెల్లించి రాములు నాయక్ బయటకు వచ్చిన వెంటనే ఏసీబీ డి.ఎస్.పి శ్రీకృష్ణ ఆధ్వర్యంలో పలువురు సిబ్బంది ఆకస్మికంగా దాడికి వచ్చారని గమనించిన వెంకటయ్య గౌడ్ వెంటనే తలుపులు వేసుకొని తాను తీసుకున్న డబ్బులకు నిప్పంటించాడు. ఏసీబీ అధికారులు తలుపులను తోసుకొని లోపలికి వెళ్లి మంటల్లో కాలుతున్న రూపాయలను చూసి మంటలను ఆర్పేశారు. అప్పటికే 70 శాతం నోట్లు కాలి ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని వెంకటయ్య గౌడ్‌తో పాటు తహసీల్దార్ సైదులు గౌడ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వెల్దండ తహసీల్దార్ కార్యాలయంతో పాటు హైదరాబాదులో ఉన్న తహసీల్దార్, టీఆర్ఎస్ నేత వెంకటయ్య గౌడ్ ఇళ్లల్లో ఏకకాలంలో దాడులు చేసినట్లు సమాచారం.