మా నీళ్లు మా ఇష్టం.. కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన వాదనలకు తెలంగాణ సర్కారు ఘాటుగా స్పందించింది. తెలంగాణకు దక్కిన కృష్ణా జలాల వాటాను ఇష్టమొచ్చిన రీతిలో వాడుకుంటుందని, దీనికి ఆంధ్రప్రదేశ్ నుంచి అభ్యంతరం వ్యక్తం కావాల్సిన అవసరమే లేదని స్పష్టం చేసింది. ఏపీ లేవనెత్తిన వాదనలు అర్థరహితమని, గతంలో బచావత్ ట్రిబ్యునల్, ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన స్పష్టతకు విరుద్ధమైనవని వ్యాఖ్యానించింది. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరాలను వ్యక్తం చేయడాన్ని తప్పుపట్టిన తెలంగాణ ఇకపైన కూడా […]

Update: 2021-07-04 11:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన వాదనలకు తెలంగాణ సర్కారు ఘాటుగా స్పందించింది. తెలంగాణకు దక్కిన కృష్ణా జలాల వాటాను ఇష్టమొచ్చిన రీతిలో వాడుకుంటుందని, దీనికి ఆంధ్రప్రదేశ్ నుంచి అభ్యంతరం వ్యక్తం కావాల్సిన అవసరమే లేదని స్పష్టం చేసింది. ఏపీ లేవనెత్తిన వాదనలు అర్థరహితమని, గతంలో బచావత్ ట్రిబ్యునల్, ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన స్పష్టతకు విరుద్ధమైనవని వ్యాఖ్యానించింది. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరాలను వ్యక్తం చేయడాన్ని తప్పుపట్టిన తెలంగాణ ఇకపైన కూడా పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తామని కృష్ణా బోర్డు చైర్మన్‌కు రాసిన లేఖలో సాగునీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ స్పష్టం చేశారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌లో ఏపీ, తెలంగాణ చెరి సగం పంచుకోవాలన్న వాదన కూడా అర్ధ సత్యమని, 2015లో కుదర్చుకున్న పరస్పర అవగాహన ఆ ఒక్క సంవత్సరానికి మాత్రమే పరిమితమైన తాత్కాలిక ఒప్పందమని వివరించారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి అవసరాల కోసం నీటిని వాడటం ద్వారా ఏపీకి త్రాగు, సాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నది కూడా వాస్తవ విరుద్ధమైనదని పేర్కొన్నారు.

కృష్ణా జలాల వినియోగం, పంపకం అంశాల్లో ఏర్పడిన వివాదాన్ని పురస్కరించుకుని కృష్ణా బోర్డుకు కొన్ని రోజుల క్రింద ఏపీ రాసిన లేఖకు తెలంగాణ ఈ-ఇన్-సీ రాసిన లేఖలో పలు చట్టబద్ధమైన అంశాలను ప్రస్తావించారు. ప్లానింగ్‌ కమిషన్‌ 1963లోనే శ్రీశైలం ప్రాజెక్టును జల విద్యుత్ ఉత్పత్తి అవసరాల కోసం నిర్మించినదిగా నొక్కిచెప్పిందని, ఆ తర్వాత కృష్ణా ట్రిబ్యునల్-1 సైతం పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తికి అనుమతి మంజూరు చేసిందని మురళీధర్ గుర్తుచేశారు. తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా లాంటి ప్రాజెక్టులు కృష్ణా బేసిన్‌కు వెలుపల ఉన్నాయని, శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం (880 అడుగులు) దాటిన తర్వాత మాత్రమే మిగులు (అదనపు) జలాలను తరలించాలన్న నిబంధన ఉన్నదని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌ను సైతం కోరలేదని గుర్తుచేశారు.

ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలని, దానికంటే తక్కువ నీటిమట్టం ఉంటే విద్యుత్ ఉత్పత్తి చేయవద్దంటూ తెలంగాణకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ఏపీ 1990-91 నుంచి 2019-20 వరకు ఏప్రిల్, మే నెలల్లో ఎప్పుడూ ఆ నిబంధనను పాటించలేదని, పైగా 834 అడుగుల వరకు కూడా ఉంచలేదని పేర్కొన్నారు. దీనికి తోడు 2013లో సమైక్య రాష్ట్రంలోనే 760 అడుగువ లరకూ నీటిని కృష్ణా డెల్టా అవసరాల కోసం తరలించుకోవచ్చంటూ కొత్త జీవో జారీ అయిందని, ఇప్పడు మాత్రం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉంటే రకరకాల సాకులు చెప్తున్నదని ఏపీపై మురళీధర్ ఆ లేఖలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంతంలో సమైక్య రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టులకు నీటిని కేటాయింపులు చేయాలని కోరినా తిరస్కరిస్తున్న ఏపీ ఇప్పుడు బేసిన్ వెలుపలి ప్రాంతానికి నీటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించింది. పైగా విద్యుత్ అవసరాలకు, నాగార్జునసాగర్ రిజర్వాయర్ నిర్వహణ కోసం తప్ప ఇతర ప్రాజెక్టులకు నీటిని తరలించవద్దంటూ ప్లానింగ్ కమిషన్ చాలా స్పష్టంగా పేర్కొన్నదని మురళీధర్ ఆ లేఖలో ఉదహరించారు.

629 టీఎంసీలు వాడుకున్న ఏపీ..

ఏపీ ప్రభుత్వం 2020-21 సంవత్సరంలో కృష్ణా జలాలను సుమారు 629 టీఎంసీల మేర వాడుకున్నదని, జూన్ 10వ తేదీ నాటికి పెన్నార్ బేసిన్‌లోని కండలేరు, సోమశిల, వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో సుమారు 95 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని, ఇదంతా శ్రీశైలం నుంచి తరలించినదేనని మురళీధర్ పేర్కొన్నారు. దీనికి తోడు మరో 360 టీఎంసీల నీరు కూడా ఇతర రిజర్వాయర్లలో ఏపీ నిల్వ చేసిందని, ఇప్పటికిప్పుడు ఐదు వేల క్యూసెక్కులను ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి తరలించడానికి సౌకర్యం ఉన్నదని పేర్కొన్నారు. శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఏపీకి నీరు అందకుండా పోతుందనే వాదన అసంబద్ధమైనదని, నిరాధారమైనదని పేర్కొన్నారు. 2019-20లో 170 టీఎంసీలను, 2020-21లో 124 టీఎంసీలను తరలించుకున్నదని, కానీ తెలుగుగంగ ద్వారా చెన్నయ్ నగరానికి 10 టీఎంసీలు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.

Tags:    

Similar News