పగలు టీఆర్ఎస్.. రాత్రి బీజేపీ
దిశ ప్రతినిధి ,హైదరాబాద్ : మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు విజయం కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. పగటి పూట బస్తీలలో పాదయాత్రలు, కళాజాతలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రధాన అనుచరులతో విందులు ఏర్పాటు చేసి గెలుపుపై సమాలోచనలు చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలకు కేవలం మూడు రోజులే ఉన్న నేపథ్యంలో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ప్రత్యర్థి పార్టీలపై ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ డివిజన్ […]
దిశ ప్రతినిధి ,హైదరాబాద్ : మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు విజయం కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. పగటి పూట బస్తీలలో పాదయాత్రలు, కళాజాతలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రధాన అనుచరులతో విందులు ఏర్పాటు చేసి గెలుపుపై సమాలోచనలు చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలకు కేవలం మూడు రోజులే ఉన్న నేపథ్యంలో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ప్రత్యర్థి పార్టీలపై ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ డివిజన్ లో గట్టి పోటీ ఉందనుకుంటున్న పార్టీ ప్రధాన నాయకులను మచ్చిక చేసుకుంటున్నారు. ప్రత్యర్థి అభ్యర్థుల అనుచరులను రాత్రికి రాత్రే కొనేస్తున్నారు.
లోపాయికారి ఒప్పందాలు …
జీహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్యనే ఉన్నది. అయితే ఆయా పార్టీల అభ్యర్థులు ఎదుటి పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారు. పగటి సమయంలో ఓ పార్టీలో తిరిగిన నాయకులు రాత్రయ్యే సరికి మరో పార్టీ నాయకులతో విందులలో మునిగి తేలుతున్నారు. తమ చేతిలో ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఎంత ఇస్తారని నేరుగా బేరసారాలకు దిగుతున్నారు. ఓటర్లు తమకేం ఇస్తారని నేరుగా అభ్యర్థులకు ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు. ‘మా వద్ద ఇన్ని ఓట్లు ఉన్నాయి , ఎంత ఇస్తారు , ఎప్పుడు ఇస్తారు ? అని అడుగుతున్నారు. కొందరు ఒక్కో ఓటుకు రూ.ఐదు వేల చొప్పున డిమాండ్ చేస్తున్నారు.
మీరడగింది చేస్తా….
ఎన్నికలలో భాగంగా మీరడగింది చేస్తా, ఓటు మాత్రం నాకే వేయాలని పలువురు అభ్యర్థులు ప్రత్యర్థి అభ్యర్థుల అనుచరులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘మీ స్నేహితులు ఎంత మంది ఉన్నారు.. రాత్రి విందుకు తీసుకురండి. అవతలి పార్టీవాళ్లు ఏం ఇచ్చినా, అంతకంటే ఎక్కువనే చేస్తా. మీ స్నేహితులందరితో పార్టీ అరేంజ్ చేయ్, మందు, మటన్, చికెన్‌తో విందు ఇద్దాం’ అంటూ అభ్యర్థులు ప్రత్యర్థి అభ్యర్థుల అనుచరులకు గాలం వేస్తున్నారు. అవతలి పార్టీల ఓట్లను పొందేందుకు చూస్తున్నారు.
టీఆర్ఎస్‌లో తిరుగుతూ ….
గోషామహల్ నియోజకవర్గం మంగళ్ హాట్ డివిజన్ కు చెందిన ఓ ద్వితీయ శ్రేణి నాయకుడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంట పగలు ప్రచారం చేస్తున్నాడు. రాత్రి సమయంలో బీజేపీ నాయకులతో టచ్ లో ఉంటున్నాడు. ఈ విషయం టీఆర్ఎస్ అభ్యర్థికి తెలియడంతో అతడిని అందరి సమక్షంలోనే ప్రశ్నించినట్లు సమాచారం. ఇదే డివిజన్ లో బీజేపీ అభ్యర్థి ఎంపిక కాస్త ఆలస్యంగా ప్రకటించారు. అయితే బీజేపీ అభ్యర్థి పేరు ఖరారు కాగానే సదరు టీఆర్ఎస్ నాయకులు ఏకంగా తనకే టిక్కెట్ దక్కినంతగా సంబురాలు చేసుకున్నట్లు తెలిసింది. విషయం కాస్త టీఆర్ఎస్ డివిజన్ ఇంచార్జ్ ల వద్దకు వెళ్లడంతో వాళ్లను చీవాట్లు పెట్టినట్లు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుసగుస లాడుతున్నారు. ఇదే పరిస్థితి గ్రేటర్ లోని ఇతర డివిజన్లలో కూడా ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తమ వెంట ఉన్నది నమ్మకస్తులో, వెన్నుపోటు దారులో తెలియక అభ్యర్థులు అయోమయానికి గురువుతున్నారు.