మాటలే.. తూటాలై..!
దుబ్బాక ఉప ఎన్నిక హీటెక్కింది.. రేపు సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడుతుండడంతో గెలుపు కోసం పార్టీలన్నీ శర్వశక్తలూ ఒడ్డుతున్నాయి.. ప్రచారంలో భాగంగా విమర్శలు, ప్రతివిమర్శలు జోరందుకున్నాయి.. అవి తీవ్రస్థాయికి చేరి వ్యక్తిగత దూషణలుగా మారుతున్నాయి.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ‘దుబ్బాక ఫైట్’ మరింత రసవత్తరంగా మారింది.. గతంలో ఏ నియోజకవర్గంలోనూ లేనంత తీవ్ర స్థాయిలో మూడు పార్టీలు తమ సత్తాను పోటాపోటీగా చూపుతున్నాయి.. ఇక బీజేపీ, టీఆర్ఎస్ నడుమ చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది.. దుబ్బాక గల్లీల్లో ఆ […]
దుబ్బాక ఉప ఎన్నిక హీటెక్కింది.. రేపు సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడుతుండడంతో గెలుపు కోసం పార్టీలన్నీ శర్వశక్తలూ ఒడ్డుతున్నాయి.. ప్రచారంలో భాగంగా విమర్శలు, ప్రతివిమర్శలు జోరందుకున్నాయి.. అవి తీవ్రస్థాయికి చేరి వ్యక్తిగత దూషణలుగా మారుతున్నాయి.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ‘దుబ్బాక ఫైట్’ మరింత రసవత్తరంగా మారింది..
గతంలో ఏ నియోజకవర్గంలోనూ లేనంత తీవ్ర స్థాయిలో మూడు పార్టీలు తమ సత్తాను పోటాపోటీగా చూపుతున్నాయి.. ఇక బీజేపీ, టీఆర్ఎస్ నడుమ చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది.. దుబ్బాక గల్లీల్లో ఆ రెండు పార్టీల నేతల ‘మాటలు తూటాలై..’ పేలుతున్నాయి..
దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు గడువు దగ్గరపడుతున్నకొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. టీఆర్ఎస్ తరఫున ఆ జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే లాంటి నేతలు మాత్రమే ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్, బీజేపీ తరఫున మాత్రం రాష్ట్ర స్థాయి నేతలంతా అక్కడే మకాం వేశారు. రెండు రోజులుగా ఈ రెండు పార్టీల అగ్రనేతలంతా నియోజకవర్గంలోని గ్రామాల్లో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. మూడు పార్టీల ప్రచారంతో దుబ్బాక నియోజకవర్గంలోని రోడ్లన్నీ దుమ్ము రేగుతున్నాయి. రేపు (నవంబరు 1) సాయంత్రం ప్రచార పర్వానికి తెరపడుతుండడంతో అన్ని పార్టీలూ చివరి రౌండ్‌పై దృష్టి పెట్టాయి. గెలిస్తే నియోజకవర్గానికి ఏం చేస్తాం అనే అంశంకంటే ప్రత్యర్థి గెలవడం ద్వారా జరిగే నష్టాన్ని ఎత్తి చూపడంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. ఒక పార్టీ లొసుగులు, లోపాలు, బలహీనతలను మరో పార్టీ బైటపెట్టుకుంటున్నాయి.
సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా వ్యవసాయమే కాబట్టి మెజారిటీ ఓటర్లు రైతులు, వారి కుటుంబాలకు చెందినవారే. అందుకే రైతుల కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ గొప్పగా చెప్పుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టంతో రైతుల పొలాల్లో మీటర్లు పెట్టాల్సి వస్తుందని హైలైట్ చేస్తోంది. బీజేపీ సైతం రైతు జపం చేస్తూ, పంటల బీమా పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వమేనని, అనేక పథకాలకు సబ్సిడీ ఇస్తోంది కూడా కేంద్ర ప్రభుత్వమేనని వ్యాఖ్యానిస్తోంది. ఎవరి మాటల్లో నిజమెంతో తెలియదుగానీ ఓటర్లను తమదైన శైలిలో ఆకట్టుకోడానికి విమర్శలు, ప్రతివిమర్శలు మాత్రం జోరుగానే సుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర నిధులపై చర్చకు సిద్ధమేనా అని సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి.
అన్ని పార్టీలూ ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించే వల్లెవేస్తున్నాయిగానీ ఇప్పటివరకు జరిగినదేంటో మాత్రం చెప్పలేకపోతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. విమర్శలు తీవ్ర స్థాయికి చేరుకుని వ్యక్తిగత దూషణలుగా మారుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం భిన్నమైన శైలిలో ప్రచారం చేసుకుంటోంది. కేంద్రం ఇచ్చిన నిధుల గురించి బీజేపీ ప్రస్తావిస్తూ ఉంటే, ఒక్క పైసా కూడా రాలేదని టీఆర్ఎస్ వ్యాఖ్యానిస్తోంది. గడచిన ఆరున్నరేళ్లలో నియోజకవర్గానికి ప్రభుత్వం చాలా చేసింది అని చెప్పడమే తప్ప నిర్దిష్టంగా ఆ అభివృద్ధి ఏమిటో మాత్రం ప్రజలకు తెలియకుండా గోప్యంగానే ఉంచుతున్నాయి ఈ రెండు పార్టీలు.
గతంలో ఏ నియోజకవర్గంలోనూ లేనంత తీవ్ర స్థాయిలో మూడు పార్టీల మధ్య పోటీ ముమ్మరంగా ఉంది. అన్ని పార్టీలూ పైచేయి సాధించాలని తాపత్రయపడుతున్నాయి. ఈ మూడు పార్టీలకూ ఇక్కడి గెలుపు ఏదో ఒకరకంగా భవిష్యత్తులో బలపడడానికి దోహదపడేదే. అందుకే ఈ ఉప ఎన్నికకు ఎక్కడలేని ప్రాధాన్యత పెరిగింది. అంజన్ రావు ఇంట్లో నగదు బీజేపీదేనంటూ టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పోలీసులే పెట్టారని బీజేపీ అంటోంది. ఈ రెండు పార్టీలూ రహస్యంగా కుమ్మక్కై తమ గెలుపును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీజేపీ తీసుకొస్తున్న బిల్లులన్నింటికీ టీఆర్ఎస్ మద్దతు తెలపడం ఇందులో భాగమేనని ఉదహరిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీలను ఓడించడం ద్వారా మాత్రమే ఈ నియోజకవర్గానికి న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరుతోంది.
మళ్లీ తెరపైకి తెలంగాణ సెంటిమెంట్..
ఎన్నికల సమయంలో పార్టీలు వేయని ఎత్తుగడలు లేవు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ సెంటిమెంట్‌ను అస్త్రంగా వాడుకున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈ అస్త్రాన్ని బలంగానే ప్రయోగించాయి. ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం అదే సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ ఏర్పడేదా అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ దయ చూపక ఉండకపోతే తెలంగాణ ఏర్పడేదా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధనే తప్ప మరో లక్ష్యమే లేని టీఆర్ఎస్ పద్నాలుగేళ్లు కొట్లాడి సాధించిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టే నియోజకవర్గానికి అభృవృద్ధి, సంక్షేమం సాధ్యమైందని టీఆర్ఎస్ గొప్పగా ప్రచారం చేస్తోంది. తెలంగాణ ఏర్పడితే ప్రజలు బతుకులు బాగుపడతాయనుకున్నాంగానీ రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రైవేటు టీచర్లు ఆత్మహత్య చేసుకుంటారనుకోలేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఏర్పడితే ప్రజాస్వామ్యం బలపడుతుందని అనుకున్నాంగానీ కల్వకుంట్ల రాజ్యాంగం వస్తుందని, పిడికెడు మందికే సౌభాగ్యం వస్తుందని అనుకోలేదని బీజేపీ అంటోంది. కానీ ప్రజలు మాత్రం ప్రశ్నించే గొంతు ఉండాలని, సమస్యలను పరిష్కారం చేసే నేతలుండాలని, ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ఉండాలని కోరుకుంటున్నారు.
పోలింగ్‌పై నమ్మకం లేదు..
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందని, దాసోహమైపోయిందని ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అనుమానాలు వ్యక్తం చేయడమే కాక ఆధారాలతో సహా అధికార పార్టీకి అనుకూలంగా పోలింగ్ సిబ్బంది పనిచేస్తున్న వీడియోలను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ప్రత్యర్థి పార్టీలను వేధింపులకు గురిచేస్తూ ఇబ్బంది పెట్టడానికి పోలీసు యంత్రాంగాన్ని టీఆర్ఎస్ వాడుకుంటోందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, కేంద్ర పారామిలిటరీ బలగాల ఆధ్వర్యంలో పోలింగ్ ప్రక్రియ జరగాలని లేఖల ద్వారా కోరాయి. ఓటమి తప్పదనే అంచనాకు వచ్చి అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేసే ఎత్తుగడలతో ప్రత్యర్థి పార్టీలు ఎత్తులు వేస్తున్నాయని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. చివరకు శాంతిభద్రతల పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల సంఘం తరఫున ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారి పరిశీలకుడిగా వచ్చారు. కేంద్ర బలగాలు కూడా దుబ్బాకకు చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని కొత్త అంశాలు ఈ ఉప ఎన్నికల్లో దుబ్బాకలో కనిపిస్తున్నాయి. మూడు పార్టీలకూ ఇక్కడి గెలుపు కీలకం కావడంతో చావో రేవో తేల్చుకోవాలనుకుంటున్నాయి. ఏ పార్టీలో ఎలాంటి సైలెంట్ ఓటింగ్ జరుగుతుందో, ఎవరి పుట్టి మునుగుతుందోననే అనుమానం మూడు పార్టీల్లోనూ బలంగానే ఉంది.