Viral Video: ఫేక్ టీటీఈ గుట్టురట్టు చేసిన యువకుడు.. రైళ్లో డబ్బు వసూలు చేస్తున్న మహిళ అరెస్ట్
ఎక్స్ ప్రెస్ రైళ్లో టికెట్ చెకింగ్ పేరుతో ప్రయాణికుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఫేక్ టీటీఏ బండారాన్ని ఓ ప్రయాణికుడు బట్టబయలు చేశాడు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఎక్స్ ప్రెస్ రైళ్లో టికెట్ చెకింగ్ పేరుతో ప్రయాణికుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఫేక్ టీటీఏ బండారాన్ని ఓ ప్రయాణికుడు బట్టబయలు చేశాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాటల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ కోచ్‌లో ఝాన్సీ అనే మహిళా టీటీఈగా నటిస్తూ టికెట్ చూపించాలని ప్రయాణీకులను అడిగింది. టికెట్ లేని కొందరు ప్రయాణికుల నుంచి డబ్బు కూడా వసూలు చేసింది. ఝూన్సీపై అనుమానం వచ్చిన ఓ ప్రయాణికుడు ఐడీ చూపించాలని కోరాడు. టికెట్ లేని వాళ్లకే ఐడీ చూపిస్తానని బుకాయించే ప్రయత్నం చేశింది.
ఆ ప్రయాణికుడు తనకు కూడా టికెట్ లేదని, ఐడీ చూపించి తనపై ఫైన్ వేయాలని తెలిపాడు. దీంతో అసలు బండారం బయటపడింది. ఝాన్సీ ఫేక్ టీటీఈగా ప్రయాణికుల నుంచి డబ్బు వసూలు చేస్తోందని గ్రహించి ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. తర్వాతి స్టేషన్ లో ఆర్పీఎఫ్ అధికారులు ఝాన్సీని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనను ఆ వక్తి చిత్రీకరించి నెట్టింట పోస్ట్ చేశాడు. దీంతో ఫేక్ టీటీఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు విచారణ జరిపడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత కొంతకాలంగా ఝాన్సీ టీటీఈగా నటిస్తూ.. జనరల్ భోగీల్లో తనికీలు చేస్తుందని, టికెట్ లేని వారి వద్ద నుంచి ఫైన్ పేరుతో వసూళ్లకు పాల్పడుతోందని గుర్తించారు.