Viral: మొదటి ట్రయల్ రన్ కే కుప్పకూలిన వాటర్ ట్యాంక్

ప్రజలకు మంచి నీటిని సరఫరా చేసేందుకు నిర్మించిన వాటర్ ట్యాంక్ మొదటి ట్రయల్ రన్ కే కుప్పకూలిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

Update: 2024-08-26 07:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలకు మంచి నీటిని సరఫరా చేసేందుకు నిర్మించిన వాటర్ ట్యాంక్ మొదటి ట్రయల్ రన్ కే కుప్పకూలిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. సీతాపూర్ జిల్లా కాఖరియా గ్రామంలో తాగు నీటి సమస్య ఎక్కువగా ఉంది. త్రాగు నీరు లేక జనం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దీంతో కేంద్రం తీసుకొచ్చిన జల్ జీవన్ మిషన్ కింద ఊరు చివర వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తి కావడంతో ట్యాంకు సామర్థ్యాన్ని చూడటం కోసం ట్రయల్ రన్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఆదివారం మొదటి ట్రయల్ రన్ కింద ట్యాంకులో పూర్తిగా నీరు నింపడంతో ట్యాంకు కింద పిల్లర్లు కదలడం ప్రారంభమైంది.

ప్రమాదాన్ని గమణించిన అధికారులు అప్రమత్తమై అధికారులు దూరంగా వెళ్లి నిలబడ్డారు. కొద్ది సేపటికే నీటితో సహా వాటర్ ట్యాంకు కుప్పకూలింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ట్యాంకు ఒక్కసారికే కూలడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అయ్యి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. నాసిరకంగా నిర్మాణం చేపట్టినందుకు కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేసి, ప్రజాధనాన్ని వృధా చేసినందుకు జరిమానా విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఉత్తరప్రదేశ్ బ్రిడ్జిలే కాదు. ట్యాంకులు కూడా కూలిపోతాయా అని కామెంట్లు పెడుతున్నారు.


Similar News