Car Cremation: కారుకు అంత్యక్రియలు చేసిన ఓనర్.. వైరల్ అవుతున్న వీడియో

మనిషి చనిపోతే అతడి చుట్టూ జనాలు చేరి కన్నీళ్లతో వీడ్కోలు పలికి చివరికి సమాధి చేయడం మనందరం చూసుంటాం.

Update: 2024-11-09 05:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: మనిషి చనిపోతే అతడి చుట్టూ జనాలు చేరి కన్నీళ్లతో వీడ్కోలు పలికి చివరికి సమాధి చేయడం మనందరం చూసుంటాం. లేదంటే మనం అల్లారుముద్దగా ప్రేమగా పెంచుకుంటున్న ఓ కుక్కో, పిల్లో, గేదో, ఆవో, పిట్టో చనిపోతే అంత్యక్రియలు చేశారంటే.. అబ్బో వాటిపై ఓనర్‌కి ఎంత ప్రేముందో అనుకోవచ్చు. కానీ.. సర్వీస్ అయిపోయిన ఓ వ్యక్తి ఏకంగా తన కారుకు శాస్త్ర ప్రకారం అంత్యక్రియలు జరిపించి భూమిలో సమాధి చేశారంటే నమ్ముతారా..? కానీ ఇది నిజం.

గుజరాత్‌ (Gujarat)లోని అమ్రేలి జిల్లా లాఠీ తాలూకాలో చెందిన సంజయ్ పోలారా అనే రైతు తన లైఫ్‌లో 12 ఏళ్ల పాటు సేవ చేసిన తన లక్కీ ‘వాగన్ ఆర్’ కారుపై ఇన్నేళ్లలో ఎంతో మమకారం పెంచుకున్నాడు. అలాగే ఈ కారు కొన్నాకే తమ జీవితాల్లో మార్పు వచ్చిందని, అదృష్టం కలిసొచ్చిందని నమ్ముతున్న ఆయన.. ఇప్పుడు పనికిరాకుండా మూలనపడ్డ ఆ కారుకు నిన్న (గురువారం)ఏకంగా రూ.4 లక్షలు ఖర్చు పెట్టి అంత్యక్రియలు (Cremation) చేశారు. అయితే ఇలా ఎందుకు కారును సమాధి చేశారు.? అడిగితే.. ‘భవిష్యత్ తరాలకు గుర్తుండాలనే ఉద్దేశంతో కారును ఖననం చేశాం’ అంటున్నారాయన.

తన పొలంలో పెద్ద గొయ్యి తీసి కారును నెమ్మదిగా లోపలికి దింపి మట్టిలో పూడ్చేశారు. గొయ్యి తవ్వడానికి, కారుని పూడ్చిపెట్టడానికి ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగించారు. ఏటవాలు మార్గాన్ని ఏర్పాటు చేసి 15 అడుగుల లోతు గొయ్యిలో కారును ఖననం చేశారు. గులాబీ పూరేకులు చల్లుతూ, పూజారుల మంత్రోచ్ఛారణల మధ్య కారుకు పచ్చని వస్రాన్ని కప్పి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు.

ఇదిలా ఉంటే కారు ‘సమాధి’ కార్యక్రమే కదా.. అని తూతూమంత్రంగా కానిచ్చేయలేదు. ఏకంగా గ్రామస్థులు, సాధువులు, మత గురువులతో పాటు ఏకంగా 2000 మందిని ఆహ్వానిస్తూ 4 పేజీల ఆహ్వాన పత్రికను పంపించారు. వారిలో ఓ 500 మంది రాకపోయినా.. 1500 మంది మాత్రం ఈ కార్యక్రమానికి అటెండ్ అయి కారు సమాధి కార్యక్రమాన్ని ఊత్సాహంగా వీక్షించారు. ఇక ఈ సమాధికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారింది.

ఇక ఈ కారు అంత్యక్రియలపై సంజయ్ మాట్లాడుతూ.. ‘‘నేను దాదాపు 12 ఏళ్ల క్రితం ఈ కారును కొన్నాను. ఈ కారు కుటుంబానికి సంపదను తెచ్చిపెట్టింది. ఈ కారు ద్వారా వ్యాపారంలో విజయాన్ని చూడటమే కాకుండా మా కుటుంబం గౌరవాన్ని కూడా పొందింది. అందుకే కారుని అమ్మడానికి బదులుగా సమాధి చేశాను’’ అని చెప్పారు. ఈ సమాధిపై మొక్కను నాటాలనుకుంటున్నానని, చెట్టు కింద 'కుటుంబానికి కలిసి వచ్చిన కారు' ఉందని భవిష్యత్ తరాలకు తెలియాలని అన్నారు.


Similar News