పాముకాటుకు యువకుడు బలి! ప్రాణం తిరిగి వస్తుందని గంగానదిలో రెండు రోజులుగా శవం!
దేశంలో మూఢనమ్మకాలు కొంత మంది ప్రజలు ఇంకా నమ్ముతున్నారని తాజాగా జరిగిన ఘటన మరోసారి రుజువు చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో మూఢనమ్మకాలు కొంత మంది ప్రజలు ఇంకా నమ్ముతున్నారని తాజాగా జరిగిన ఘటన మరోసారి రుజువు చేసింది. ఉత్తరప్రదేశ్- బులంద్‌షహర్‌లోని అనుప్‌సహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోహిత్ కుమార్ (20) అనే యువకుడు ఏప్రిల్ 26న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశలో ఓటు వేసి ఇంటికి తిరిగి వచ్చాడు. సాయంత్రం సమయంలో స్థానిక పార్కుకు వెళ్లిన అతడు పాము కాటుకు గురయ్యాడు. మొదటగా కుటుంబీకులు అతన్ని వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. కానీ అతను చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో వైద్యులు అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే గంగా నదిలో శరీరాన్ని పెడితే విషం తొలగిపోతుందని స్థానికంగా కొందరు ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే కుటుంబం మూఢనమ్మకాన్ని నమ్మి విషాన్ని తొలగించడానికి అతని మృతదేహాన్ని గంగానదిలో తాడుతో కట్టి ఉంచారు.
ఆ మృతదేహానికి గట్టిగా తాడు బిగించి నది ఓడ్డున ఉన్న రెయిలింగ్‌కు కట్టివేశారు. దీంతో ఒక అద్భుతం జరుగుతదని కుటుంబ సభ్యులు నమ్మారు. కానీ వారి ఫలితం శూన్యం. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వీడియో అయ్యింది. అయితే వారు ఆ మృతదేహాన్ని రెండు రోజుల నదిలోనే ఉంచారని చివరికి గంగా నది ఒడ్డున మృతదేహాన్ని దహనం చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. అందుకే చదువు అనేది చాలా ముఖ్యమైనదని, లేదంటే ఇలాంటి మూఢనమ్మకాలు ప్రజలు నమ్మాల్సి వస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నాయకులు సైతం ప్రజలకు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలని నెటిజన్లు సూచనలు ఇస్తున్నారు.