- అంగట్లో అమ్మకానికి గాలి
- పీలుస్తున్న గాలిలో 99% కలుషితమే
- భయపెడుతున్న డబ్ల్యూహెచ్‌వో లెక్కలు
- త్వరలోనే గాలిని కొనుక్కునే దుస్థితి
- మార్కెట్లోకి రానున్న మినరల్ గాలి
- ఢిల్లీలో మోగుతున్న డేంజర్ బెల్స్
గాలి మనిషికి ప్రాణవాయువు. అది మనిషి జీవన నాణ్యతను నిర్ణయిస్తుంది. అంతేకాదు పర్యావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అటువంటిది ప్రపంచంలో 99 శాతం జనాభా పీల్చుతున్న గాలి కలుషితమైనదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) ఓ నివేదికలో కుండబద్దలు కొట్టింది. 6,000 మున్సిపాలిటీల్లో గాలి నాణ్యతకు సంబంధించి సర్వే చేసింది. వాయు కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులతో ఏడాదికి 70 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని హెచ్చరించింది. ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికే నీటి కాలుష్యంతో మార్కెట్ లో మినరల్ వాటర్ కొనుగోలు చేస్తున్న దుస్థితి ఇప్పుడు మినరల్ గాలి కూడా కొనాల్సి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాయు కాలుష్యంపై ‘దిశ’ స్పెషల్ స్టోరీ. - అనిల్ శిఖా
ఢిల్లీలో డేంజర్ బెల్స్
దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా గాలి కాలుష్యం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 451 గా నమోదైంది. ఇది దాదాపు 25 సిగరెట్లు పీల్చితే వచ్చే కాలుష్యంతో సమానం. దీని దెబ్బకు ఢిల్లీ ప్రజల ఆయుష్షు కూడా దాదాపు ఏడేళ్లు తగ్గుతుందని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. కాలుష్యం క్రమంగా తగ్గే వరకు నిర్మాణ పనులు, భవనాల కూల్చివేతలు, మైనింగ్, ఇతర సంబంధిత కార్యకలాపాలు నిలిపివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా, ప్రాథమిక పాఠశాలలలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ పరిస్థితి మిగతా రాష్ట్రాలకు కూడా ఓ హెచ్చరికగా కానున్నది. ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధానంగా ఢిల్లీకి సమీప రాష్ట్రాలలో వరి పంట వ్యర్థ్యాలను పంట పొలాల్లో బహిరంగంగా కాల్చివేయటం ఒక కారణమైతే, వాహనాల ద్వారా పెద్దఎత్తున వెలువడుతున్న కాలుష్యం రెండో కారణం.
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం
వాయు కాలుష్య నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్లీన్ ఎయిర్ పోగ్రామ్ చేపట్టింది. దేశంలోనే 130 నగరాల్లో ఇది పనిచేస్తున్నది. ఇందుకోసం రూ.11,211 కోట్లు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం , అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కడప, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరంలో విభాగాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ నోడల్ ఆఫీసర్లు కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. అదేవిధంగా తెలంగాణలోని హైదరాబాద్ నల్గొండ సంగారెడ్డిలో ఈ ప్రాజెక్టు పని చేస్తున్నది.
స్వచ్ఛంద సంస్థలు కృషి
కాలుష్య నివారణకు దేశవ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు కూడా కృషి చేస్తున్నాయి. https://antipollution.org వంటి సంస్థలు బెంగళూరు, హైదరాబాదులో పనిచేస్తున్నాయి.
మీ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ తెలుసుకోవాలంటే..
ఇంటర్నెట్లో పరిశోధించి మీ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీని తెలుసుకోవచ్చు. https://www.airnow.gov అనే వెబ్‌సైట్లోకి వెళ్లి మీ పట్టణాన్ని నమోదు చేస్తే అక్కడ గాలి నాణ్యత ఎంత ఉందో తెలుస్తుంది.
గాలినీ డబ్బాలలో అమ్మేస్తున్నారు..
మంచినీటిని కొనాల్సి వస్తుందని మన పూర్వీకులు ఊహించి ఉండరు. ఇప్పుడు ఏ స్థాయి వారేనా నీటిని కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి. అదేవిధంగా రాబోయే రోజుల్లో గాలిని కూడా కొనాల్సి వస్తుందేమో.. తాజా ఉదాహరణలు చూస్తే నిజమే అనిపిస్తుంది. ఇటలీలో లేక్ కోమో అనే గ్రామం ఉంది. ఇక్కడ విరాట్ కోహ్లీ అనుష్క శర్మల పెళ్లి జరిగింది. ఇక్కడి స్వచ్ఛమైన గాలిని డబ్బాలలో నింపి కమ్యూనిక అనే సంస్థ అమ్మకానికి పెట్టింది. చిన్న టిన్ను ధర వెయ్యి రూపాయలకు పై మాటే. గతంలో మనదేశంలో కూడా ప్యూర్ హిమాలయ ఏర్ పేరుతో గాలి విక్రయం జరిగింది. ఆన్‌లైన్లో కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. ఆజ్ ఎయిర్, విటాలిటీ ఎయిర్ వంటివి కూడా అమ్మకాలు చేశాయి.
ఢిల్లీలో ఆక్సిజన్ బార్
వినటానికి ఆశ్చర్యంగానే ఉంటుంది కానీ, ఆల్కహాల్ బార్ లాగానే ఢిల్లీలో ఆక్సిజన్ బార్ వెలిసింది. ఆక్సీ ప్యూర్ అనే సంస్థ దీనిని నెలకొల్పింది. 15 నిమిషాలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేందుకు ఇది రూ.300 వరకు వసూలు చేస్తున్నది. ఇదే సంస్థ ఆక్సిజన్ సిలిండర్లను కూడా విక్రయిస్తున్నది. గత 10 రోజుల నుంచి వాయు కాలుష్యం పెరగడంతో అక్కడ ఎయిర్ప్యూరిఫైర్లను కొనేవారి సంఖ్య కూడా 40 శాతం పెరిగింది.
ఈ మొక్కలతో స్వచ్ఛ గాలి
ఇంట్లో స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, క్రిస్మస్ కాక్టస్, ఫిలోడెండ్రాన్, పీస్ లిల్లీ, డ్రాకేనా లాంటి మొక్కలు పెట్టుకుంటే గాలిని శుద్ధి చేస్తాయి. గాలి నుంచి ఫార్మాల్డిహైడ్‌ను తొలగించడం ద్వారా గాలిని శుభ్రపరుస్తాయి అని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క ఆకులు రోజంతా ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి. గదిలోని గాలిని శుద్ధి చేస్తాయని అంటున్నారు.
మొక్కలు , జంతువులుపై కూడా ప్రభావం
వాయు కాలుష్యం అనేది మనుషులపైనే కాదు జంతువులు మొక్కలు పైన కూడా ప్రభావం చూపుతుంది. మొక్కలలో వాయు కాలుష్యంతో కిరణజన్య సంయోగ క్రియ తగ్గుతుంది. దీంతో పెరుగుదల ఉండదు. ఆకులపై మచ్చలు వస్తాయి. దీంతో మొక్క పసుపు రంగుగా మారుతుంది. అదేవిధంగా జంతువుల్లోనూ ప్రభావం చూపిస్తుంది. గాలి కాలుష్యంతో జంతువుల్లో శ్వాస సమస్యలు ఎదురవుతాయి. పునరుత్పత్తి శక్తిని కూడా తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
ప్రజల్లోనూ చైతన్యం పెరగాలి..
భారతదేశంలో వాయు కాలుష్యం కారణంగా ఏటా దాదాపు లక్ష అకాల మరణాలు సంభవిస్తున్నాయి. భారతదేశంలో పిల్లలతో సహా దాదాపు 30 మిలియన్ల మంది ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నారు. ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశం. వాయు కాలుష్యం నియంత్రణకు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్రజలు కూడా చైతన్యం కావలసిన అవసరం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి. ఘన వ్యర్ధాల నిర్వహణ పటిష్టంగా చేయాలి. ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలి.
_ డాక్టర్ కె.శశిధర్, ఫ్యాకల్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం.