కొండా దంప‌తుల‌పై ఉత్త‌మ్ ప‌గ‌బ‌ట్టా‌రా…?

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి గ‌త కొద్దిరోజులుగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌లో మకాం వేశారు. ప్ర‌చారంలో అన్నీతానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్య‌ర్థి రాములునాయ‌క్ ప‌రిచ‌య కార్యక్ర‌మం పేరుతో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో ప‌ర్య‌టిస్తూ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణ‌యం కాంగ్రెస్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శ‌నివారం హ‌న్మ‌కొండ‌లో ప‌ర్య‌టించిన ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ఇనుగాల వెంక‌ట్రామిరెడ్డి ఇంట్లో […]

Update: 2021-02-28 03:17 GMT

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి గ‌త కొద్దిరోజులుగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌లో మకాం వేశారు. ప్ర‌చారంలో అన్నీతానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్య‌ర్థి రాములునాయ‌క్ ప‌రిచ‌య కార్యక్ర‌మం పేరుతో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో ప‌ర్య‌టిస్తూ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణ‌యం కాంగ్రెస్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శ‌నివారం హ‌న్మ‌కొండ‌లో ప‌ర్య‌టించిన ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ఇనుగాల వెంక‌ట్రామిరెడ్డి ఇంట్లో స‌మావేశం ఏర్పాటు చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ప‌రకాల నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జ్ బాధ్య‌త‌ల‌ను ఇనుగాల‌కు అప్ప‌గిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

ప‌ర‌కాల‌తోనే ఎదిగిన కొండా దంప‌తులు

ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం నుంచే కొండా సురేఖ రాష్ట్ర‌స్థాయి నాయ‌కురాలిగా ఎదిగారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ త‌రుఫున కొండా సురేఖ‌ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సురేఖ వైఎస్సార్ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మరణానంతరం జరిగిన నాటికీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. అందులో కూడా ఇమ‌డ‌లేక‌పోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన అనంత‌రం కేసీఆర్‌కు ద‌గ్గ‌రై గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్లిపోయి సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన ప‌ర‌కాల నుంచి పోటీ చేసి సురేఖ ఓట‌మిపాల‌య్యారు. గ‌డిచిన సంవ‌త్స‌ర కాలంగా పార్టీకి, ప్ర‌జాక్షేత్రానికి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. అయితే ఆరు మాసాలుగా కొండా దంప‌తులు త్రిముఖ వ్యూహంతో ఆక్టివ్ అయ్యారు.

త్రిముఖ వ్యూహం

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సురేఖ వ‌రంగ‌ల్ తూర్పు నుంచే పోటీ చేస్తుంద‌న్న పాజిటివ్ సిగ్న‌ల్స్‌ను అక్క‌డి నేత‌ల‌కు పంప‌డంతో శ్రేణులు ఆక్టివ్ అయ్యాయి. ఓ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని కొండా దంప‌తులు వ‌రంగ‌ల్‌లో ఓ ర్యాలీ నిర్వ‌హించి హ‌ల్చ‌ల్ చేశారు. అయితే వ‌రంగ‌ల్ తూర్పు, భూపాల‌ప‌ల్లి, ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన సీట్ల‌ను త‌మ‌కు అప్ప‌గించాల‌ని కొండా దంప‌తులు నేరుగా అధిష్ఠానంకు విన్న‌వించిన‌ట్లు స‌మాచారం. కూతురు సుస్మితా ప‌టేల్‌ను కూడా రాజ‌కీయ అరంగేట్రం చేయించాల‌నే వ్యూహంతో వారు ఈ డిమాండ్‌ను అధిష్ఠానం వ‌ద్ద పెట్టిన‌ట్లు స‌మాచారం. కూతురును భూపాల‌ప‌ల్లి, ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏదైనా స్థానం నుంచి పోటీ చేయించాలని, మిగిలిన మ‌రో చోటు నుంచి త‌మ అనుయాయుల‌కు ద‌క్కేలా చూడ‌ల‌న్న‌ది కొండాక‌పుల్స్ వ్యూహమ‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కొండా దంప‌తుల‌కు మంచి క్యాడ‌ర్ ఉంది. ప‌రకాల‌లో గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన‌ప్ప‌టికీ అక్క‌డి నేత‌ల‌తో కొండా దంప‌తులు ట‌చ్‌లో ఉన్నారు. భూపాల‌ప‌ల్లి విష‌యంలోనూ అంతే.

షాక్ ఇచ్చిన ఉత్త‌మ్‌…

ప‌ర‌కాల‌లో తాము ఒక‌టి త‌లిస్తే మ‌రోటి జ‌రిగిన‌ట్లయింది కొండా క‌పుల్స్‌కు. ఇనుగాల వెంక‌ట్రామ్‌రెడ్డికి ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి ఒక ర‌కంగా అగ్గిరాజేశార‌నే చెప్పాలి. అయితే ఇటీవ‌ల కొండా దంప‌తులు కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డికి రాజీవ్‌భ‌రోసా యాత్ర ముగింపు స‌భ‌లో వేలాది కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల స‌మూహంలో మ‌ద్ద‌తు ప‌లికారు. రేవంత్‌రెడ్డి పాద‌యాత్ర‌ను వైఎస్సార్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌తో పోల్చ‌డం విశేషం. మొత్తంగా రేవంత్‌రెడ్డి ఆకాశానికి ఎత్తారు. కొండా దంప‌తులు రేవంత్ వ‌ర్గంలో చేరిపోయార‌ని మీడియా కూడా కోడై కూసింది. ఈ పరిణామాలే ఉత్త‌మ్ ప‌ర‌కాల‌పై తాజా నిర్ణ‌యానికి కార‌ణ‌మ‌య్యాయ‌ని కాంగ్రెస్ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. మ‌రీ దీనిపై కొండ కంపుల్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మ‌రి.

Tags:    

Similar News