కత్తులు దూస్తోన్న కాంగ్రెస్.. తెలంగాణలో ప్రత్యామ్నాయం ఎవరు..?

రణమేదైనా రాష్ట్రంలో పొలిటికల్ హీట్​వచ్చింది. మొన్నటి వరకు ఏం చేసినా టీఆర్ఎస్‌దే హవా. ఎందుకంటే ప్రతిపక్షం అనేదే లేదు. అందుకు తగ్గట్టుగానే ప్రతిపక్షం కూడా సైలెంట్‌గానే ఉండిపోయింది. అందుకు కారణం కొందరు ఆరోపిస్తున్నట్టు కోవర్టులా? లేక కేసీఆర్ బలం ముందు తట్టుకోలేకనా? అనేది ఇప్పటికీ అర్థంకాని విషయమే. దుబ్బాక ఉప ఎన్నికల నుంచి బీజేపీ కొంచెం ఊపు మీదికి వచ్చింది. గ్రేటర్ ఎన్నికలలో బలమైన పోటీ ఇచ్చింది. అప్పుడు కాంగ్రెస్​ మాత్రం డీలా పడింది. కాంగ్రెస్ ​ఇక […]

Update: 2021-07-27 22:34 GMT

రణమేదైనా రాష్ట్రంలో పొలిటికల్ హీట్​వచ్చింది. మొన్నటి వరకు ఏం చేసినా టీఆర్ఎస్‌దే హవా. ఎందుకంటే ప్రతిపక్షం అనేదే లేదు. అందుకు తగ్గట్టుగానే ప్రతిపక్షం కూడా సైలెంట్‌గానే ఉండిపోయింది. అందుకు కారణం కొందరు ఆరోపిస్తున్నట్టు కోవర్టులా? లేక కేసీఆర్ బలం ముందు తట్టుకోలేకనా? అనేది ఇప్పటికీ అర్థంకాని విషయమే. దుబ్బాక ఉప ఎన్నికల నుంచి బీజేపీ కొంచెం ఊపు మీదికి వచ్చింది. గ్రేటర్ ఎన్నికలలో బలమైన పోటీ ఇచ్చింది. అప్పుడు కాంగ్రెస్​ మాత్రం డీలా పడింది. కాంగ్రెస్ ​ఇక కనుమరుగనే సంకేతాలు కూడా వచ్చాయి. కాంగ్రెస్‌ను పాతిపెట్టి కేసీఆర్​ తనకు బలమైన ప్రత్యర్థిగా బీజేపీని తెచ్చుకున్నారని, ఢిల్లీలో దోస్తులుగా ఉంటూనే, రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషించేలా బీజేపీని దింపారనీ ప్రచారాలు కూడా జరిగాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో బీజేపీ మళ్లీ బోల్తా పడింది. దీంతో అప్పటి వరకు రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అనే నోళ్లన్నీ మూతపడ్డాయి.

ధైర్యం కూడదీసుకుని..

కాంగ్రెస్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఎంతదాకా అంటే, అప్పుడే రాజ్‌భవన్​ ప్రధాన గేట్‌కు తమ జెండాలు ఎగురవేసేంత ధైర్యాన్ని కూడబెట్టుకుంది. దీనికి కారణం రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ ​కావడమే. టీపీసీసీ చీఫ్​ప్రకటన తర్వాత రేవంత్‌రెడ్డి అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నాలు చేశారు. విమర్శించిన నేతలందరినీ కలిశారు. కొంతమంది స్వాగతించారు. మరికొంతమంది ఇప్పుడు కలుసుడు ఎందుకు, వద్దు పో అన్నారు. టీడీపీ రంగు పులుముకుని కొత్తగా పార్టీలోకి వచ్చిన రేవంత్‌కు పీసీసీ ఎందుకంటూ కాంగ్రెస్‌లోని సీనియర్లు అడ్డుపడ్డారు. ‘మేం లేమా’ అంటూ అధిష్టానానికి లేఖలు పంపారు. కానీ, ఏది అనుకున్నారో అదే జరిగింది. రేవంత్‌కు పగ్గాలు వచ్చాయి. పగ్గాలు అందుకున్న గంటలోనే రేవంత్‌రెడ్డి కూడా వ్యూహాత్మకంగానే మాట్లాడారు. ఇక నుంచి సొంత ప్రచారం వద్దని తెలంగాణ దేవత సోనియాగాంధీ అని, అందరూ సోనియా జపం చేయాలని ఒకింత ఆగ్రహంతోనే చెప్పారు.

కలిసికట్టుగా ముందుకు..

ఇవన్నీ పక్కన పెడితే, కాంగ్రెస్​ పార్టీ మాత్రం మళ్లీ రణక్షేత్రంలోకి దిగింది. నెల రోజుల కిందట వరకు ఎలాంటి కార్యక్రమాలు చేద్దామన్నా కలిసిరాని నేతలు ఇప్పుడు తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. అక్కడ కేంద్రం.. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంపై కనీసం ఏదైనా నిరసనలకు పిలుపునిచ్చేవారు కూడా కరువయ్యారు. అది ఉత్తమ్​ నిర్లక్ష్యమా.. పార్టీలో కుంపట్లా అనేది పక్కన పెడితే ఏడేండ్లలో రోడ్లపైకి వచ్చిన సందర్భం తక్కువే. ఒకవేళ వచ్చినా ద్వితీయశ్రేణి నేతలే. అంతేకానీ, సీనియర్లు, కాంగ్రెస్​ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు నిరసన చేద్దామంటే వెనకడుగు వేశారు. అంతెందుకు, 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితేనే కిమ్మనకుండా ఉన్నారు. పార్టీ మారినవారు సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్‌కు లేఖ ఇచ్చినా, మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఏదో అన్నట్లుగా ఉన్నారే తప్ప మారుమాటెత్తలేదు. ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేలపై కోర్టుకెక్కేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ 12 మందిపై అనర్హత వేటు వేయిస్తామంటూ పీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. ఆయనకు తోడుగా పార్టీ నేతలు కూడా తొలిసారిగా పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై బహిరంగ ఆరోపణలకు దిగడం ఆశ్చర్యమే. దీనికి తోడుగా ఏఐసీసీ నిరసన కార్యక్రమాలను రాష్ట్రంలో అందిపుచ్చుకున్నారు. రేవంత్‌రెడ్డి సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు రోడ్డెక్కుతున్నారు. ఈ నెల 16న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి రణరంగంగా మార్చారు. ఇందిరాపార్కు నుంచి బారికేడ్లను దూకి రేవంత్‌రెడ్డి రాజ్‌భవన్ వైపు పరుగు తీశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా అదే ఉత్సాహంతో ఉరికాయి. పోలీస్ బందోబస్తును దాటుకుని వెళ్లి రాజ్‌భవన్ గేట్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేశాయి. ఇది ఒకింత ధైర్యమే. ఇటీవల కేంద్రంలో ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ కాంగ్రెస్​నిరసన కూడా ఉద్రిక్తంగానే మారింది. కొంతకాలం కిందట వరకు నిరసనలకు దూరంగా ఉన్న సీనియర్లు మొత్తం ఆందోళనలకు దిగారు. కాంగ్రెస్‌కు కొత్త పీసీసీ చీఫ్​ రావడమా.. లేకుంటే ఏఐసీసీ నుంచి హెచ్చరికలో మొత్తానికైతే కాంగ్రెస్​ రణక్షేత్రానికి దిగుతోంది. గతంలో నిరసనలకు పిలుపునిచ్చేందుకే వెనకాడిన నేతలు ఇప్పుడు ఆందోళనలకు ముందుకు వస్తున్నారు. గాంధీభవన్​ నుంచి ఇందిరాపార్కు.. అక్కడి నుంచి రాజ్‌భవన్​ వరకు సీనియర్లు ర్యాలీగా రావడం చాలా రోజుల తర్వాత ఇప్పుడే చూస్తున్నామని పార్టీ నేతలే చెప్పుకోవడం నిజంగా కొంత ఆశ్చర్యమే. అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగినట్టుగా ఇప్పుడు కాంగ్రెస్​ నేతలను జిల్లాల్లోనే కట్టడి చేస్తున్నారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్​ నేతలందరి ఇంటి దగ్గర 144 సెక్షన్​ పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశారంటే పరిస్థితి అర్థమవుతోంది.

ఇతర పార్టీలు కూడా..

రేవంత్​రెడ్డినో, కాంగ్రెస్‌నో చూస్తూ మిగిలిన పార్టీలు కూడా దూకుడు పెంచాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో రెండేండ్లు ఉండగానే ప్రధాన రాజకీయ పార్టీలు హీట్ పెంచుతున్నాయి.​ ఇదంతా కేవలం కాంగ్రెస్ జోష్‌తోనే అంటున్నారు. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను తప్పించడం, టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి రావడం వంటి పరిణామాలతో రాష్ట్రంలో కొత్త రాజకీయాలు మొదలయ్యాయి. కేసీఆర్​ తరహాలోనే రేవంత్​ కూడా పరుష వాగ్బా ణాలు సంధిస్తూ రెచ్చగొడుతుండటంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ దూకుడుకు అనుగుణంగా అటు తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇటు భారతీయ జనతా పార్టీ కూడా గొంతు పెంచాల్సి వస్తోంది. నిన్నమొన్నటి దాకా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రకటనలు గుప్పిస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీ.. రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఆగస్టు తొమ్మదిన క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో పాదయాత్రను ప్రారంభించబోతున్నట్లు సంజయ్ ప్రకటించారు.

– టి.సంపత్

Tags:    

Similar News