నేడు అఖిలపక్ష మహాధర్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన
దిశ, తెలంగాణ బ్యూరో: చాలా ఏండ్ల తర్వాత అఖిలపక్షం ఒక్కతాటిపైకి వచ్చి నిరసనకు దిగుతోంది. ప్రభుత్వం పథకాల్లో లోపాలు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ఇప్పటి వరకు ఉద్యమించిన సంఘటనలు తక్కువే. వాటిని అందిపుచ్చుకోవడంలో కూడా ప్రతిపక్షాలు, అఖిలపక్షం వెనకబడింది. ఎన్నికల సమయంలో మహా కూటమిగా అవతరించినా.. ఆ తర్వాత ఎవరికి వారుగానే మారిపోయారు. ఇప్పటి వరకు విడివిడిగా పోరాటం చేసిన ప్రతిపక్ష పార్టీలు.. ఇక నుంచి ప్రజా సమస్యలపై కలిసి పోరాడాలని నిర్ణయించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల […]
దిశ, తెలంగాణ బ్యూరో: చాలా ఏండ్ల తర్వాత అఖిలపక్షం ఒక్కతాటిపైకి వచ్చి నిరసనకు దిగుతోంది. ప్రభుత్వం పథకాల్లో లోపాలు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ఇప్పటి వరకు ఉద్యమించిన సంఘటనలు తక్కువే. వాటిని అందిపుచ్చుకోవడంలో కూడా ప్రతిపక్షాలు, అఖిలపక్షం వెనకబడింది. ఎన్నికల సమయంలో మహా కూటమిగా అవతరించినా.. ఆ తర్వాత ఎవరికి వారుగానే మారిపోయారు. ఇప్పటి వరకు విడివిడిగా పోరాటం చేసిన ప్రతిపక్ష పార్టీలు.. ఇక నుంచి ప్రజా సమస్యలపై కలిసి పోరాడాలని నిర్ణయించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఐక్యకార్యచరణతో దిగుతున్నాయి. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇప్పటికే అఖిలపక్షంతో గాంధీభవన్‌లో సమావేశం నిర్వహించగా.. మధుయాష్కి నేతృత్వంలో మంగళవారం మరోసారి భేటీ అయ్యారు.
నేడు మహాధర్నా
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రైతులు, నిరుద్యోగులు, దళిత, బీసీ వర్గాల సమస్యలపై ఐక్యంగా పోరాడాలని అఖిలపక్షం నిర్ణయం తీసుకుంది. ఒక్కో పార్టీ ఒక్కో సమస్యను ఎంచుకోవడం కంటే అంతా కలిసి నిరసనలకు దిగాలని తీర్మానించుకున్నారు. ఇటీవల టీఆర్ఎస్కు వ్యతిరేకత పెరుగుతుందని అఖిలపక్ష నేతలు భావిస్తున్నారు. కలిసి పోరాడితే అన్ని పార్టీలకు రాజకీయంగా కలిసి వస్తుందని అంచనా వేసుకుంటున్నారు. కేవలం రాష్ట్రంలోనే కాకుండా కేంద్రస్థాయి సమస్యలపై కూడా ఉమ్మడిగా పోరాటం చేసేందుకు సమావేశంలో తీర్మానం చేసుకున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో పోడు భూముల అంశాన్ని కూడా చేపట్టారు. ఇప్పటికే రెండుసార్లు గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితితో పాటు 12 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. దీనిలో భాగంగా నాలుగు ప్రధాన కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని, రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై బుధవారం కలిసికట్టుగా నిరసనకు దిగాలని, టీఆర్ఎస్, బీజేపీ యేతర పార్టీలన్నీ కలిసి హైదరాబాద్ ఇందిరాపార్కు దగ్గర మహాధర్నా నిర్వహించనున్నాయి. పెంచిన ధరలకు నిరసనగా ఈనెల 25న జరగనున్న భారత్ బంద్‌ను విజయవంతం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. అంతేకాకుండా టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా.. ఈనెల 30న తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. వచ్చే నెల 5న పోడుభూముల సంబంధించి రాస్తారోకో నిర్వహించనున్నారు. పోడుభూముల సమస్యపై అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు రాస్తారోకో చేస్తామని ప్రకటించాయి.
మరో విముక్తి పోరాటానికి సమయం వచ్చింది : మధుయాష్కీ
రాష్ట్రంలో దగాకోరుల పాలన ఉందని, కొంతమంది చేతుల్లోనే బంధీ అయిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ అన్నారు. బుధవారం నిర్వహించే మహాధర్నా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు
రవిచంద్ర, విఠల్, బీసీ సాధికార నుంచి కోల జనార్థన్, మాజీ సీఐ భూమయ్య, ముస్లీం హక్కుల పోరాట సమితి సలీంపాషా, జర్నలిస్టు పాశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం మధుయాష్కీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలోని సబ్బండవర్గాలకు న్యాయం జరుగాలంటే కేసీఆర్ పాలన పోవాలన్నారు. ప్రశ్నిస్తే అరెస్ట్‌లు, జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. ఇక నుంచి అవినీతి, ప్రజావ్యతిరేక పాలనను ఉపేక్షించేది లేదని, మరో పోరాటానికి సమయం ఆసన్నమైందన్నారు.
పరువు నష్టం దావా వేసి పరువు పోగొట్టుకున్నడు : మల్లు రవి
ప్రజా ప్రతినిధులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకొని ఆదర్శంగా ఉందామని రేవంత్ రెడ్డి అంటుంటే అది పరువునష్టం ఎలా అవుతుందని, కేటీఆర్ పరువు నష్టం దావా వేసి కేటీఆర్ పరువు పోగొట్టుకున్నారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ గా మార్చేందుకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. అందుకోసం రేవంత్ రెడ్డి 'వైట్ ఛాలెంజ్' వేస్తే అక్కడకు వచ్చి డ్రగ్ టెస్ట్ చేసుకోమని కేటీఆర్ కు ఛాలెంజ్ విసిరితే, రాహుల్ గాంధీతో పోల్చుకోవడం ఏంటని అన్నారు. రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో పెద్ద నాయకులని, ఆయన పేరు చెప్పి కేటీఆర్ తప్పించుకోవాడానికి చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ ను కేటీఆర్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఉపాధి హామీ రోజుల పెంపు, ప్రెట్రో ధరల పెంపు, వ్యవసాయ చట్టాలు తదితర అంశాలపై నిరసనగా ఈనెల 27న భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు మల్లు రవి పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నామని, దానికి తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు,అందుకోసం కుల సంఘాలు, ప్రజా సంఘాలన్నీ రావాలని పిలుపునిచ్చారు.