టెక్కీ శారదకు అండగా టీటా
దిశ, న్యూస్‌బ్యూరో: ఆకర్షణీయమైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఆకస్మికంగా పోయినప్పటికీ, రెట్టించిన ఉత్సాహంతో తన కుటుంబం నిర్వహిస్తున్న కూరగాయల వ్యాపారంలో భాగస్వామ్యం పంచుకుంటూ వార్తల్లోకెక్కిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు శారదకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) గొప్ప అవకాశం కల్పించింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంతర్జాతీయ స్థాయి శిక్షణను రూపాయి ఖర్చు లేకుండా అందజేసేందుకు టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల నిర్ణయించారు. ఈ మేరకు శనివారం శిక్షణ పత్రాన్ని అందజేశారు. దీంతో పాటుగా టెక్కీ శారదకు […]
దిశ, న్యూస్‌బ్యూరో: ఆకర్షణీయమైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఆకస్మికంగా పోయినప్పటికీ, రెట్టించిన ఉత్సాహంతో తన కుటుంబం నిర్వహిస్తున్న కూరగాయల వ్యాపారంలో భాగస్వామ్యం పంచుకుంటూ వార్తల్లోకెక్కిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు శారదకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) గొప్ప అవకాశం కల్పించింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంతర్జాతీయ స్థాయి శిక్షణను రూపాయి ఖర్చు లేకుండా అందజేసేందుకు టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల నిర్ణయించారు. ఈ మేరకు శనివారం శిక్షణ పత్రాన్ని అందజేశారు. దీంతో పాటుగా టెక్కీ శారదకు ఉచితంగా ల్యాప్‌ట్యాప్ అందజేశారు. రకరకాల కారణాల వల్ల ఉద్యోగాలు కోల్పోతున్న వారు శారదను ఆదర్శంగా తీసుకోవాలని సందీప్ మక్తాల పిలుపునిచ్చారు. వర్చుసా ఐటీ కంపెనీలో కీలకమైన స్థానంలో ఉద్యోగం చేస్తున్న టెక్కీ శారద అనూహ్య పరిణామాల నేపథ్యంలో కొలువును కోల్పోవడం, ఉద్యోగం పోయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా తల్లిదండ్రులతో కలిసి కూరగాయలు అమ్ముకునే వ్యాపారంలో పాలు పంచుకోవడం పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
తెలంగాణలోని ఐటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల ఆమెను సంప్రదించారు. ఆమె చేసిన ఉద్యోగం, కలిగి ఉన్న నైపుణ్యాల గురించి తెలుసుకొని శారదకు ఆర్థిక సహాయం అందించడం కంటే, నైపుణ్యాలు అందించి కొత్త ఉద్యోగం సాధించేందుకు సహకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు టీటా తరఫున కృత్రిమ మేధస్సులో ఉచితంగా శిక్షణ అందించనున్నారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఎట్ డల్లస్ ద్వారా అందించే శిక్షణ అనుమతి పత్రం ఇచ్చారు. తన కూరగాయల వ్యాపారం నిర్వహించుకుంటూనే నేర్చుకునేలా ల్యాప్‌టాప్ ఎంతో సహాయకారిగా ఉండనుంది. ఈ సందర్భంగా సందీప్ మక్తాల మాట్లాడుతూ.. ఐటీ రంగంలోని వారు ఉద్యోగం తొలగించబడితే (లే ఆఫ్)కు గురైన వారు తీవ్రమైన చర్యలకు పాల్పడుతారని, ఇదే రీతిలో పొగాకు హరిణి అనే టెక్కీ ఉద్యోగిని గత ఏడాది కన్నుమూసిన ఉదంతం అనేక మందిని కలచి వేసిందన్నారు. ఉద్యోగాలు కోల్పోతున్నామని ఆందోళన వద్దని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆచరణలో చాటి చెపుతూ శారద అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా టీటా అధికారిక ప్రతినిధి వెంకట్ వనం, టీటా సభ్యులు మహ్మద్ ఇలియాస్, హారిక తదితరులు పాల్గొన్నారు.