ఆ కుంభకోణానికి మూడేళ్లు
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన భారీ కుంభకోణం సంగతి ఇక అంతేనని తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ వాణిజ్య పన్నుల శాఖ అధికారి కార్యాలయంలోని భారీ స్కాం జరిగి నేటికి మూడేళ్లు అవుతున్నా సొమ్ము రికవరీగానీ, బాధ్యులపై చర్యలుగానీ అంతంత మాత్రంగానే ఉన్నాయి. కుంభకోణానికి కారుకులైన వారి పక్కా ప్లాన్‌లో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసును పక్కదారి పట్టించినట్లు ఆరోపణలున్నాయి. ఇక అంతా ఉత్తిమాటనేనని అర్థమవుతోంది. దిశ ప్రతినిధి, నిజామాబాద్: మూడేళ్ల కిందట యావత్తు రాష్ట్రాన్ని […]
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన భారీ కుంభకోణం సంగతి ఇక అంతేనని తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ వాణిజ్య పన్నుల శాఖ అధికారి కార్యాలయంలోని భారీ స్కాం జరిగి నేటికి మూడేళ్లు అవుతున్నా సొమ్ము రికవరీగానీ, బాధ్యులపై చర్యలుగానీ అంతంత మాత్రంగానే ఉన్నాయి. కుంభకోణానికి కారుకులైన వారి పక్కా ప్లాన్‌లో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసును పక్కదారి పట్టించినట్లు ఆరోపణలున్నాయి. ఇక అంతా ఉత్తిమాటనేనని అర్థమవుతోంది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: మూడేళ్ల కిందట యావత్తు రాష్ట్రాన్ని కుదిపేసిన భారీ కుంభకోణానికి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ వాణిజ్య పన్నుల శాఖ అధికారి కార్యాలయం వేదికైంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను చలాన్ రూపంలో చెల్లించేందుకు ఇన్ వాయిస్‌లను నకిలీలుగా తయారు చేసి వ్యాపారులు, రైస్ మిల్లర్లు రాష్ట్ర ఖజనాకు గండికొట్టారు. బోధన్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో పాటు అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారుల వరకు ఇందులో ఉండడంతో రాష్ట్ర ఖజానాకు రూ.260 కోట్ల వరకు చిల్లుపడింది. స్థానికంగా నిజామాబాద్ జిల్లాలోని రైస్ మిల్లులు, కార్ల షోరూంల అధినేతలు ఉండడం కోట్లలో జరిగిన కుంభకోణం అప్పట్లో సర్వత్ర చర్చనీయాంశమైంది. గుర్తు తెలియని వ్యక్తి ఆకాశరామన్న ఉత్తరాన్ని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌కు పంపడం ద్వారా ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర సీబీ సీఐడీ, విజిలెన్స్ అధికారులు విచారణ చేసి ఒక సీఐతో పాటు పలువురు అధికారులను అరెస్టు చేసిన సొమ్ము మాత్రం ఇంకా పూర్తిగా రికవరీ కాలేదు.
రూ.62 కోట్లే రికవరీ
ఈ కుంభకోణంలో ప్రభుత్వానికి రూ.260 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేసింది. దశాబ్ద కాలంలో నకిలీ ఈ చలాన్‌లతో ఇన్ వాయిస్‌లను రూపొందించి ఖజానాకు గండి కొట్టిన వ్యవహరంలో ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ద్వారా విచారణ చేసి జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు, పలు షోరూంల అధినేతలు కుంభకోణంలో ఉన్నారని తేల్చింది. వారి నుంచి సొమ్మును రాబట్టాలని నిర్ణయించింది. కుంభకోణానికి కారకులైన జిల్లా కేంద్రానికి చెందిన సీఏ శివరాజ్‌తోపాటు అతని కొడుకును, వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి సీటీవో, ఏసీటీవో, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లను అరెస్టు చేసింది. ప్రభుత్వానికి పడిన గండిని పూడ్చుకునేందుకు ప్రభుత్వం రెవెన్యూ రికవరి యాక్టు(ఆర్ఆర్వో)ను ప్రయోగించింది. అరెస్టుల భయం నుంచి తప్పించుకునేందుకు అందులో కొందరు వ్యాపారులే ముందుకు వచ్చి ప్రభుత్వానికి సుమారు రూ.62 కోట్లు తిరిగి చెల్లించారు. ఇక ఆ తర్వాత మిగతావారి నుంచి రికవరీ చేయడాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ర్ట పన్నులు, కేంద్రపన్నుల స్థానంలో కేంద్రం జీఎస్టీని తీసుకురవడంతో ఈ కుంభకోణం రికవరీ మరుగనపడింది. కుంభోణంలో ప్రమేయం ఉన్న అధికారులు, ఉద్యోగులకు నిజామాబాద్ డివిజన్ దాటి బదిలీలు, పదోన్నతులు ఇవ్వకుండా చేసిన ఉత్తర్వులకు ఇక కాలం చెల్లిపోయింది.
అధికార పార్టీలో చేరినందుకేనా.?
తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన అతిపెద్ద కుంభకోణంలో భాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకంజ వేసింది. ఎందుకంటే వారంతా బడా వ్యాపారులు కావడం, అలాగే అప్పటి వరకు అధికార పార్టీకి సానుభూతిపరులుగా మాత్రమే ఉన్నవారు ఆ తర్వాత ఆ పార్టీలో చేరడమేనని తెలుస్తోంది. కుంభకోణం నుంచి బయటపడేందుకే వారు అధికార పార్టీలో చేరినట్లు అప్పట్లో పలువురు ఆరోపించారు. ఇక వారిపై చర్యలేమో గానీ, వారి చేరికతో వాళ్లపై ఈగ కూడా వాలకుండా ప్రభుత్వం చూసుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ క్రమంలో రికవరీ కావాల్సి సొమ్ము, బాధితులపై చర్యలు ఇక అంతే సంగతి అని పలువురు చర్చించుకుంటున్నారు.