102 ఏళ్ల వయసులోనూ పాఠాలే ఆయన ఊపిరి!
దిశ, వెబ్‌డెస్క్ : జీవితానికి మార్గనిర్దేశనం చేస్తూ, మనల్ని సన్మార్గంలో నడిపించడంలో ‘విద్య’ కీలక పాత్ర పోషిస్తుందనేది జగమెరిగిన సత్యం. మనిషి ఉన్నతికి, వికాసానికి తోడ్పడేందుకు విద్య ఎంత ముఖ్యమో.. మనకున్న జ్ఞానాన్ని పదిమందికి పంచడమూ అంతే ముఖ్యం. పంచితే తరిగేది డబ్బు అయితే, పంచేకొద్దీ రెట్టింపయ్యేది జ్ఞానం. అందుకే ఒడిశాకు చెందిన ‘నంద సార్’ తన జ్ఞానాన్ని 70 ఏళ్లుగా పంచుతూనే ఉన్నాడు. ఇప్పటికే నాలుగు తరాలకు విద్యా వికాసాన్ని అందించిన నంద.. తన విద్యార్థుల […]
దిశ, వెబ్‌డెస్క్ : జీవితానికి మార్గనిర్దేశనం చేస్తూ, మనల్ని సన్మార్గంలో నడిపించడంలో ‘విద్య’ కీలక పాత్ర పోషిస్తుందనేది జగమెరిగిన సత్యం. మనిషి ఉన్నతికి, వికాసానికి తోడ్పడేందుకు విద్య ఎంత ముఖ్యమో.. మనకున్న జ్ఞానాన్ని పదిమందికి పంచడమూ అంతే ముఖ్యం. పంచితే తరిగేది డబ్బు అయితే, పంచేకొద్దీ రెట్టింపయ్యేది జ్ఞానం. అందుకే ఒడిశాకు చెందిన ‘నంద సార్’ తన జ్ఞానాన్ని 70 ఏళ్లుగా పంచుతూనే ఉన్నాడు. ఇప్పటికే నాలుగు తరాలకు విద్యా వికాసాన్ని అందించిన నంద.. తన విద్యార్థుల విజయంలోనే ఆనందాన్ని పొందుతున్నాడు. 102 ఏళ్ల వయసులోనూ పిల్లలకు పాఠాలు చెబుతూ తన ‘గురు’తర బాధ్యతను నిర్వర్తిస్తున్న ఆ మాస్టారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఒడిశా, జైపూర్ జిల్లా, కాంతిర అనే గ్రామంలో నంద సార్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. తన పేరు నంద పృస్టీ కాగా.. నంద సార్‌గానే అందరికీ సుపరిచితుడు. 102 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ పిల్లలకు పాఠాలు చెప్పడాన్ని ఆస్వాదిస్తూ, ఎంతోమంది జీవితాల్లో అక్షర వెలుగులు నింపుతూ, రాబోయే తరాలకు మంచి విషయాలు చెప్పడంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటున్నాడీ మాస్టారు. నంద పృస్టీ 70 ఏళ్ల నుంచి ‘ఉపాధ్యాయుడిగా’ సేవలందిస్తున్నాడంటే, వృత్తి పట్ల తనకున్న అంకితభావం ఏపాటిదో మనకు అర్థమవుతోంది.
రైతు కుటుంబంలో పుట్టిన ‘నంద’ నివసిస్తున్న కాంతిర గ్రామంలో అందరూ నిరక్షరాస్యులే కావడంతో, తండ్రి సలహా మేరకు జైపూర్ జిల్లా కేంద్రంలో చదువుకున్నాడు నంద. విద్యాభ్యాసాన్ని పూర్తిచేసి స్వగ్రామానికి తిరిగొచ్చిన తనకు.. గ్రామంలో చదువుకోకుండా, ఏ లక్ష్యం లేకుండా తిరుగుతున్న పిల్లలు, యువకులు కనిపించారు. దీంతో ఆ పిల్లలందర్నీ అక్కున చేర్చుకుని అక్షరాలు నేర్పించడం మొదలుపెట్టాడు. అలా స్వాతంత్ర్యం రాక మనుపు నుంచే మొదలైన ఆయన ఆచార్య వృత్తి.. ఇప్పటికీ నిర్విఘ్నంగా, నిర్విరామంగా కొనసాగుతోంది.
ఒకే ఫ్యామిలీలో నాలుగు జనరేషన్స్‌కు చదువు చెప్పిన ఘనత కూడా ఈయనకే దక్కింది. చాలా ప్రశాంతంగా, విద్యార్థికి ఒకటికి పదిసార్లు చెప్పడానికి నంద సార్ ఎప్పుడూ సిద్ధమే. కానీ చదువుపై అశ్రద్ధ చేసినా, క్రమశిక్షణ తప్పినా పిల్లల్ని గట్టిగానే మందలిస్తాడు. చెట్టు కింద, ఎలాంటి వసతులు లేకుండానే ఆయన తన బడిని కొనసాగించాడు. విద్యార్థుల దగ్గర డబ్బుల తీసుకోకుండా తన వృత్తిపట్ల గౌరవాన్ని చాటాడు. నంద చేస్తున్న కృషితో పాటు చదువు చెప్పే తీరు నచ్చడంతో పెద్దలు కూడా తన వద్దకు అక్షరాలు నేర్పించమని వచ్చేవాళ్లు. దాంతో ఆయన రెండు షిఫ్టుల్లో తరగతులు చెప్పడం మొదలు పెట్టాడు. ఉదయం వేళ చిన్నారులకు చదువు చెబితే, సాయంత్రం పూట పెద్దవారికి అక్షరాభ్యాసం చేయించేవాడు.
‘ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో సంతోషముంటుంది. నా విద్యార్థులు వాళ్ల వాళ్ల జీవితాల్లో స్థిరపడి, మంచి ఉద్యోగం తెచ్చుకున్నామని చెబితే ఆ ఆనందం ముందు ఎన్ని కోట్లున్నా వ్యర్థమే అనిపిస్తుంది. నాలో ఊపిరి ఉన్నంత కాలం ఈ వృత్తిలోనే ఉంటాను’ అని నంద సార్ అంటున్నాడు. సరస్వతీ కటాక్షంతో వీలైనంత కాలం ఆ మాస్టర్ నలుగురికి విద్యను అందించాలని మనమూ కోరుకుందాం.