ఆసుపత్రికి వెళ్లి వచ్చే సరికి పాతిక లక్షలు మాయం
దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాతిక లక్షల రూపాయలు ఎత్తుకెళ్ళి పోలీసులకు సవాల్ విసిరారు దుండగులు.. అనారోగ్య సమస్యలు నుంచి బయటపడటానికి పోగు చేసుకుని దాచిన డబ్బు దొంగల పాలైంది. ఆరోగ్యం బాగ లేకపోవడంతో డబ్బులు ఇంట్లో ఉంచి ఆస్పత్రికి వెళ్లిన బాధిత కుటుంబ సభ్యులకు ఇంటికి తిరిగి వచ్చేలోపు ఇల్లు గుళ్ళయింది. ఇంట్లో దాచిన పాతిక లక్షలతో పాటు 5 తులాల బంగారం ఎత్తుకెళ్లడంతో బాధిత కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. పోలీసులు, బాధితులు తెలిపిన […]
దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాతిక లక్షల రూపాయలు ఎత్తుకెళ్ళి పోలీసులకు సవాల్ విసిరారు దుండగులు.. అనారోగ్య సమస్యలు నుంచి బయటపడటానికి పోగు చేసుకుని దాచిన డబ్బు దొంగల పాలైంది. ఆరోగ్యం బాగ లేకపోవడంతో డబ్బులు ఇంట్లో ఉంచి ఆస్పత్రికి వెళ్లిన బాధిత కుటుంబ సభ్యులకు ఇంటికి తిరిగి వచ్చేలోపు ఇల్లు గుళ్ళయింది. ఇంట్లో దాచిన పాతిక లక్షలతో పాటు 5 తులాల బంగారం ఎత్తుకెళ్లడంతో బాధిత కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు.
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ కాలనికి చెందిన నగువోతు నర్సిహులు తన ఇంట్లోనే కిరాణా దుకాణం నడిపిస్తూ వ్యాపారం చేసుకుంటున్నాడు. అయితే గత కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగ లేకపోవడంతో మూడు రోజులుగా నిజామాబాద్ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్సల కోసం ఇంట్లో పాతిక లక్షలు పొగుచేసి పెట్టుకున్నారు. నగదుతో పాటు 5 తులాల బంగారం కూడా ఇంట్లోనే ఉంచి నిజామాబాద్ ఆస్పత్రికి వెళ్లారు. బుధవారం ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. దాంతో ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో డబ్బు, బంగారం చూడగా కనిపించలేదు. దాంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. అడిషనల్ ఎస్పీ అన్యోన్య, డీఎస్పీ సోమనాథం పరిస్థితిని సమీక్షించారు. డాగ్ స్క్వార్డ్‌ను రప్పించి తనిఖీలు చేపట్టారు. చోరీ జరిగిన ఇంట్లో రక్తపు మరకలు కూడా ఉన్నాయి. పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించారు. డీఎస్పీ సోమనాథం మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామన్నారు. రూరల్ సీఐ, పట్టణ సీఐ, సీసీఎస్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక టీములు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే ఈ కేసును చేదిస్తామని చెప్పారు. ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం పెట్టి వెళ్లవద్దని సూచించారు.