అభివృద్ధిలో రాజకీయాలు ఉండొద్దు : దత్తాత్రేయ
దిశ, భువనగిరి రూరల్: అభివృద్ధిలో రాజకీయాలు ఉండొద్దని, అది పేదలు, రైతులు, బడుగు బలహీనులకు సంబంధించిందని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వైద్యాన్ని రాజకీయాలకు అతీతంగా అందించాలన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ను ఆయన సందర్శించారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ 2003 సంవత్సరంలో ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి దూరదృష్టితో స్వస్థ సురక్షా యోజన కింద ఎయిమ్స్ వైద్య కళాశాలను ప్రకటించారని గుర్తు చేశారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల […]
దిశ, భువనగిరి రూరల్: అభివృద్ధిలో రాజకీయాలు ఉండొద్దని, అది పేదలు, రైతులు, బడుగు బలహీనులకు సంబంధించిందని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వైద్యాన్ని రాజకీయాలకు అతీతంగా అందించాలన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ను ఆయన సందర్శించారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ 2003 సంవత్సరంలో ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి దూరదృష్టితో స్వస్థ సురక్షా యోజన కింద ఎయిమ్స్ వైద్య కళాశాలను ప్రకటించారని గుర్తు చేశారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల వారికి మంచి వైద్య సేవలు అందించేందుకు ప్రధానమంత్రి మోడీ 200 ఎకరాలలో ఎయిమ్స్ వైద్య కళాశాలను ఆధునిక వైద్య సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నారని, భవిష్యత్తులో ఎయిమ్స్ ఒక ఆణిముత్యంలాగా నిలుస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వైద్యం చాలా అవసరమని, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల వారు డబ్బు చెల్లించలేక కొవిడ్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారని విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఎయిమ్స్ కళాశాలలు అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.
ప్రధానమంత్రి వైద్య రంగం ప్రాముఖ్యతను గుర్తించి బడ్జెట్లో రెండు లక్షల 4 వేల కోట్లు కేటాయించారని, ప్రతి జిల్లాకు ప్రభుత్వ వైద్య ఆసుపత్రి, వైద్య కళాశాల ఏర్పాటే ప్రధానమంత్రి లక్ష్యమని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ఆయుష్మాన్ భవ పథకానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉండడం పట్ల ఆయన అభినందించారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఐడీ కార్డు అందుబాటులోకి తెచ్చి దేశంలో ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రిల్లో వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తుందన్నారు.
దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుందని, ఇప్పటికే దేశంలో 89 కోట్ల మందికి మొదటి డోసు పూర్తయిందని, దీనిలో 64% గ్రామీణ ప్రాంతాల వారికి ఇచ్చారని, ఇది అద్భుత విజయం అన్నారు. తెలంగాణలో రెండు కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీన్ డాక్టర్ రాహుల్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీరజ్ అగర్వాల్, రాచకొండ ఏసీపీ వెంకట్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాం సుందర్, రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి, ఎయిమ్స్ ప్రొఫెసర్లు, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.