కొవాగ్జిన్ కష్టాలు: సెకండ్ డోస్ ఎప్పుడో..?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగిపోయి శుక్రవారానికి సరిగ్గా వారం రోజులైంది. మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పటికీ అధికారిక సమాచారం లేదు. సరిపడా డోసులు వచ్చిన తర్వాత మొదలుపెడతామంటున్న వైద్యాధికారులు ఆ మేరకు స్టాకు ఎప్పుడొస్తుందో తెలియని గందరగోళంలో ఉన్నారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నవారికి ఎలాగూ ఇంకా ఒకటిన్నర నెల రోజుల సమయం ఉంది. కానీ కొవాగ్జిన్ తీసుకున్న లక్షలాది మంది రెండో డోస్ తీసుకోవాల్సిన గడువు వచ్చేసింది. కానీ వ్యాక్సినేషన్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగిపోయి శుక్రవారానికి సరిగ్గా వారం రోజులైంది. మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పటికీ అధికారిక సమాచారం లేదు. సరిపడా డోసులు వచ్చిన తర్వాత మొదలుపెడతామంటున్న వైద్యాధికారులు ఆ మేరకు స్టాకు ఎప్పుడొస్తుందో తెలియని గందరగోళంలో ఉన్నారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నవారికి ఎలాగూ ఇంకా ఒకటిన్నర నెల రోజుల సమయం ఉంది. కానీ కొవాగ్జిన్ తీసుకున్న లక్షలాది మంది రెండో డోస్ తీసుకోవాల్సిన గడువు వచ్చేసింది. కానీ వ్యాక్సినేషన్ లేకపోవడంతో మొదటి డోస్ వృథా అయినట్లేనా అనే అనుమానం ఉంది.
భారత్ బయోటెక్ స్టాండర్డ్స్ ప్రకారం మొదటి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ తీసుకోవచ్చు. గరిష్ఠంగా 42 రోజుల వరకు ఎప్పుడైనా సెకండ్ తీసుకోవచ్చు. కానీ ఆ 42 రోజులు పూర్తయిన తర్వాత సెకండ్ డోస్ తీసుకోవచ్చా? తీసుకున్నా ఫలితం ఉంటుందా? 42 రోజుల తర్వాత ఎన్ని రోజుల వరకు వేచి ఉండొచ్చు? ఒకవేళ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత నిర్దిష్ట గడువుకల్లా సెకండ్ డోస్ తీసుకోకపోతే మళ్ళీ రెండు డోసులు తీసుకోవాల్సిందేనా? ఇలాంటి అనే సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు వైద్యారోగ్య శాఖపై ఉంది. కానీ దీనిపైన అధికారికంగా ఇప్పటివరకు క్లారిటీ లేదు.
స్టాకు ఉన్నా సెకండ్ డోస్ ఎందుకివ్వడంలేదు?
‘సరిపడా స్టాకు వచ్చిన తర్వాతే వ్యాక్సినేషన్ కొనసాగిస్తాం. అప్పటివరకు వ్యాక్సిన్ పంపిణీ ఉండదు‘ అని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీ నాటికి కొవాగ్జిన్ ఫస్ట్ డోస్ తీసుకుని సెకండ్ డోస్ తీసుకోవాల్సినవారి సంఖ్య దాదాపు మూడు లక్షలు ఉన్నట్లు అంచనా. అయితే ఆ తర్వాత ఈ నెల 13వ తేదీ వరకు వ్యాక్సినేషన్ కొనసాగినందువల్ల కొద్దిమంది కొవాగ్జిన్ సెకండ్ డోస్ తీసుకున్నారు. ఇంకా సుమారు ఒకటిన్నర లక్షల మంది కొవాగ్జిన్ సెకండ్ డోసు తీసుకోవాల్సినవారు ఉన్నట్లు అంచనా.
‘కొవిన్‘ పోర్టల్ ద్వారా సెకండ్ డోస్ కోసం స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఉచితంగా పొందాలనుకునేవారు విధిగా ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కానీ స్టాకు లేదన్న కారణంతో ప్రక్రియను నిలిపేసినందువల్ల స్లాట్ బుకింగ్‌లో సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాల్లో రూ. 1,250 చొప్పున సెకండ్ డోస్ తీసుకునే వెసులుబాటు ఉన్నా గంటల తరబడి పోర్టల్‌ల స్లాట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేసినా చాలామందికి కన్ఫర్మేషన్ రావడంలేదు. కొన్ని ఆస్పత్రుల్లో కొవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్నా కొవిన్ పోర్టల్ సాంకేతిక ఇబ్బందులు బ్రేకులు వేస్తున్నాయి.
ముఖ్యమంత్రి ఈ నెల 17వ తేదీన వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్రం దగ్గర మొత్తం 1,86,780 వ్యాక్సిన్ డోసులు స్టాకులో ఉన్నాయి. ఇందులో 58,230 కొవాగ్జిన్ డోసులు ఉన్నాయి. గత నెల రెండవ వారం తర్వాత కొవాగ్జిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నవారు విధిగా ఈ నెల చివరికల్లా సెకండ్ డోస్ తీసుకోవాల్సి ఉంది. గడచిన వారం రోజులుగా టీకాల పంపిణీ లేకపోవడంతో మరో పది రోజుల్లో ప్రారంభమవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొనింది. ప్రభుత్వం దగ్గర స్టాకు ఉన్న 58,230 డోసులను, గురువారం రాత్రి వచ్చిన లక్ష డోసుల్లోని కొన్ని కొవాగ్జిన్ డోసుల్ని కలిపి ఉన్నంతవరకు సెకండ్ డోస్‌గా అర్హులైనవారికి ఇవ్వవచ్చుగదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ వైద్యారోగ్య శాఖ అధికారులు పెదవి విప్పడంలేదు.
వ్యాక్సినేషన్ పూర్తి ఫలితం ఉంటుందా?
ఏ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ అయినా రెండు డోసులు తీసుకుంటేనే దాని పూర్తి ఫలితం ఉంటుందని, నిర్లక్ష్యంగా ఒక్క డోసుతో ఆపివేస్తే వైరస్ నుంచి పూర్తి రక్షణ ఇవ్వదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ చెప్తూనే ఉన్నాయి. కానీ ఆ పూర్తి ఫలితం వచ్చేలా రెండు డోసుల్ని ఇవ్వడంలో మాత్రం ఆయా స్థాయిలో లోపాలు, నిర్లక్ష్యం కొనసాగుతూ ఉంది. సెకండ్ డోస్ తీసుకోవాల్సిన గరిష్ఠ గడువు తీరిపోతే అప్పటికే తీసుకున్న ఫస్ట్ డోస్ వృథా అయినట్లేనా? సెకండ్ డోస్ తీసుకున్నట్లయితే దాన్ని సెకండ్ డోస్‌గా పరిగణించాలా లేక ఫస్ట్ డోస్‌గా పరిగణించాలా అనే అనుమానం తలెత్తుతోంది. ఇప్పటికే ఫస్ట్ డోస్ తీసుకుని రెండో డోస్ గరిష్ఠ గడువు తీరిపోయినవారు చాలా మందే ఉన్నారు.
కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారుచేసిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఇటీవల సెకండ్ డోస్ తీసుకోవాల్సిన గడువును ఆరు వారాల నుంచి 12 వారాలకు పెంచినందున ఇప్పటికిప్పుడు సెకండ్ డోస్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ కొవాగ్జిన్ విషయంలో మాత్రం గడువులో తేడా లేనందువల్ల ఆ వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకోవాల్సినవారిలో ఆందోళన నెలకొనింది.