ప్రమాదంలో పంచాయతీలు.. 100 మంది కార్మికులు బలి

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్మికులదే కీ రోల్. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో నిరంతరం పారిశుద్ధ్య పనుల్లోనే నిమగ్నమవుతున్నారు. కరోనా నివారణ కార్యక్రమంలో ప్రాణాలకు తెగించి పని చేస్తున్న మున్సిపల్‌, గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లకు ఏ విధమైన రక్షణ పరికరాలు, సౌకర్యాలు ఏర్పాటు చేయకుండానే విధుల్లోకి నెట్టేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపుగా 50 వేల మంది మున్సిపల్‌ కార్మికులు, మరో 30 వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు, […]

Update: 2021-05-17 14:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్మికులదే కీ రోల్. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో నిరంతరం పారిశుద్ధ్య పనుల్లోనే నిమగ్నమవుతున్నారు. కరోనా నివారణ కార్యక్రమంలో ప్రాణాలకు తెగించి పని చేస్తున్న మున్సిపల్‌, గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లకు ఏ విధమైన రక్షణ పరికరాలు, సౌకర్యాలు ఏర్పాటు చేయకుండానే విధుల్లోకి నెట్టేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపుగా 50 వేల మంది మున్సిపల్‌ కార్మికులు, మరో 30 వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు, 20 వేల మంది ఆశా వర్కర్లు, లక్షలాది మంది వలంటీర్లు క్షేత్ర స్థాయిలో సేవలు చేస్తున్నారు.

లాక్‌డౌన్‌ ప్రకటించి రోజులు గడుస్తున్నా.. వీరికి కరోనా వ్యాధి సోకకుండా అవసరమైన మాస్కులు, గ్లౌజులు అందించడం లేదు. కనీసం మాస్కులు కూడా ఇవ్వడం లేదు. మరోవైపు పంచాయతీ కార్యదర్శులది కూడా అదే పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 100 మంది పంచాయతీ కార్మికులు కరోనాకు బలి కాగా.. పలువురు పంచాయతీ కార్యదర్శులు కూడా మృతి చెందారు. తాజాగా ఖమ్మంలో ఓ పంచాయతీ కార్యదర్శి కరోనాకు బలయ్యాడు.

గొప్పలకే చాలా..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పారిశుధ్య కార్మికుల సేవలను ప్రజలందరూ కొనియాడుతున్నారు. గత ఏడాది లాక్‌డౌన్​సందర్భంగా విరామం లేకుండా పని చేసిన కార్మికులకు ఎంతో కొంత ప్రోత్సాహాకాలు ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతేడాది పారిశుధ్య కార్మికుల కాళ్ళు కడిగి, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నారు. ఈ ఏడాది వీరి సేవలకు గుర్తింపుగా ‘చప్పట్లు కొట్టండి’ అని పిలుపు ఇచ్చారు. అదే స్పూర్తిగా దిగువ స్థాయిలో ప్రజాప్రతినిధులు వీరి కాళ్ళు కడగటం, పూలు చల్లడం చేస్తున్నారు. అయితే తమ కాళ్లు కడగాలని, పూలు చల్లాలని కార్మికులెవ్వరూ కోరుకోవడం లేదు. ఇవేవీ కడుపు నింపవంటున్నారు.

‘మా కష్టాన్ని గుర్తించి మాకు సరైన జీతాలు ఇప్పించండి. భద్రతా సౌకర్యాలు కల్పించండి మహాప్రభో’ అని పాలకులను వేడుకుంటున్నారు. కానీ పాలకులకు మాత్రం చెవికెక్కడం లేదు. కార్మికులు చేసే పనులతో వారి కుటుంబాలకు ప్రమాదమని తెలిసినా వారిని ఇళ్ల దగ్గర వదిలి.. విధులు నిర్వహిస్తున్న కార్మికులకు రక్షణ పరికరాలు, భద్రతా సౌకర్యాలు కల్పించడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు.

కార్మికుల ప్రాణాలతో చెలగాటం..

నివాస ప్రాంతాలు, వీధుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ స్ప్రే చేసే కార్మికులకు చేతి తొడుగులు కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికే నాసిరకం పౌడర్‌తో రాష్ట్రంలో వందలాది మంది కార్మికుల చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కొద్ది మందికి కంటి సమస్యలు కూడా ఎదురయ్యాయి. కొన్ని గ్రామాలు, పట్టణాల్లో హైపో సోడియం క్లోరైట్‌ స్ప్రే చేసే కార్మికులకు పీపీఈ కిట్ల సౌకర్యాలు కల్పించకపోవడంతో శరీరాలు కాలిపోయి ఆస్పత్రి పాలైనా పట్టించుకునే దిక్కులేదు. పని ఒత్తిడి బాగా పెరిగి మానసిక ఒత్తిడికి గురి కావడం, ప్రమాదాల వల్ల గ్రేటర్‌తో పాటుగా పలు పట్టణాలు, గ్రామాల్లో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

మాస్క్ కూడా ఇవ్వరా..?

ఒక్క ఎంపీడీఓకు ఏమన్నా అయితే ఒక్క నోటిఫికేషన్ ఇస్తే లక్షల మంది ఒక్క రోజులోనే వస్తారు. కానీ పారిశుద్ధ్య కార్మికుడికి ఏమైనా అయితే అదే కాల్వలు తీయడం, డ్రైనేజీలు క్లీన్​చేయడం, పారిశుద్ధ్య పనుల కోసం ఒక్కరిని నియమించుకోవాలంటే చాలా కష్టం.. ఇది ఓ ఉన్నతాధికారి చెప్పిన మాట. నిజానికి పారిశుద్ద్య కార్మికులను కాపాడుకోవాల్సి ఉంటోంది. ఇలాంటి పనులు చేసేందుకు చాలా మంది వెనకాడుతుంటారు. కానీ వీరి రక్షణ చర్యల్లో నిర్లక్ష్యం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.

ప్రతీ పంచాయతీ కార్యదర్శి, మల్టీపర్పస్ వర్కర్లకు కనీసం ఏడు నాణ్యమైన బట్ట మాస్కులు, నాణ్యమైన శానిటైజర్‌ను సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి అయ్యే ఖర్చు కూడా దాదాపు వెయ్యి రూపాయలలోపే. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. మరోవైపు గత ఏడాది పంచాయతీ, పారిశుద్ధ్య కార్మికులకు ఇన్సెంటివ్స్​ఇచ్చారు. కానీ, ఈసారి పరిస్థితి సీరియస్‌గా ఉన్నప్పుడు కనీసం వారికి గుర్తింపు లేకుండా పోతోంది. బీమా సౌకర్యం కల్పించాలంటూ వేడుకుంటున్నారు.

మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదు..

ఉదయం నుంచి సాయంత్రం వరకు పారిశుద్ధ్య పనులు చేస్తున్నాం.. మధ్యలో మంచినీళ్లు ఇవ్వమంటే కూడా కొంతమంది ఇవ్వడం లేదు. వాకిలి ముందు నిల్చుంటేనే వెళ్లు అంటున్నారు. తాగేందుకు నీళ్లు అడిగితే ఇవ్వడం లేదు.. అంటూ పలువురు కార్మికులు వాపోతున్నారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో పనులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బీమా కల్పించాలి : మధుసూదన్​రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు

రాష్ట్రంలో పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పని చేసే కార్మికులకు బీమా కల్పించాలి. చాలా మంది అనారోగ్యం, కరోనా బారినపడి చనిపోతున్నారు. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం. ఈ కరోనా పరిస్థితుల్లో ఇంటింటికీ స్ప్రే చేయడం, కరోనా పాజిటివ్​ఉన్న ఇండ్ల వద్ద పారిశుద్ధ్యం చేయడం వంటి పనులన్నీ చేస్తున్నారు. వారికి ఇన్సెంటివ్ ఇచ్చి బీమా చేయించాలి.

 

Tags:    

Similar News