మేధావి గొర్రె.. మౌనం వీడకపోతే భారీ మూల్యం తప్పదు

దిశ, పబ్లిక్ పల్స్: ఇప్పుడు మన దేశంలో చాలా మంది మేధావులు మౌనముద్ర వహిస్తున్నారు. ఏ విషయంలోనూ వారు నోరు మెదపడం లేదు. అందరిలో ఒక రకమైన నిర్లిప్తత చోటు చేసుకుంది. తమకు సంబంధం లేదని కొందరు, వయస్సు పైబడిందని మరికొందరు మౌనంగా ఉంటున్నారు. చాలా సమస్యల మీద ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. అది హౌస్ అరెస్టు కావచ్చు. అక్రమ అరెస్టులు కావచ్చు. ఇంకా ఇతర స్కాములు కావచ్చు. పెగాసస్ లాంటి సమస్య కావచ్చు. చాలా సమస్యలు […]

Update: 2021-08-07 00:39 GMT

దిశ, పబ్లిక్ పల్స్: ఇప్పుడు మన దేశంలో చాలా మంది మేధావులు మౌనముద్ర వహిస్తున్నారు. ఏ విషయంలోనూ వారు నోరు మెదపడం లేదు. అందరిలో ఒక రకమైన నిర్లిప్తత చోటు చేసుకుంది. తమకు సంబంధం లేదని కొందరు, వయస్సు పైబడిందని మరికొందరు మౌనంగా ఉంటున్నారు. చాలా సమస్యల మీద ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. అది హౌస్ అరెస్టు కావచ్చు. అక్రమ అరెస్టులు కావచ్చు. ఇంకా ఇతర స్కాములు కావచ్చు. పెగాసస్ లాంటి సమస్య కావచ్చు. చాలా సమస్యలు తమవి కాదని చాలామంది అనుకుంటున్నారు. పెగాసస్ ఓ ఉదహరణ. పెగసస్ ఒక ఖతర్నాక్ స్పయివేర్. రహస్యంగా మన స్మార్ట్‌ఫోన్‌లోకి, లాప్‌టాపులోకి ప్రవేశించి మన డాటా మొత్తాన్ని సేకరిస్తుంది. అవసరమైన వ్యక్తులకు సరఫరా చేస్తుంది. మన వీడియోలనూ తీస్తుంది. మన వాట్సాప్ సమాచారాన్ని ఇతరులకు పంపిస్తుంది. మన సెల్ ఫోన్‌లోకి ఇది ఎలా చేరుతుందన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. లింకు వస్తుంది. దాన్ని నొక్కితే స్పయివేర్ చేరుతుందని అనుకునేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మన ఫోన్ నంబర్ వాళ్లకు తెలిస్తే చాలు. మనకి ఓ వాట్సాప్ మెసేజ్ వస్తుంది. అపరిచిత నంబర్ ద్వారా ఓ కాల్ వస్తుంది. అది మీరు చూడటంతో, కాల్ అటెండ్ చేయడంతోనే స్పయివేర్ మన ఫోన్లోకి చేరిపోతుంది. మన సంభాషణలను వింటుంది. రికార్డు కూడా చేస్తుంది. ఇది పెద్దవాళ్లని మాత్రమే వెంటాడుతుందని, మామూలు వ్యక్తులని ఏమీ చేయదని అనుకుంటున్నారు. నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈ నిర్లిప్తతను గమనించినప్పుడు చాలా రోజుల క్రితం చదివిన ఒక కథ గుర్తుకు వచ్చింది.

ఇక కథలోకి వెళ్దాం…

ఒక గొర్రెల కాపరి దగ్గర పది గొర్రెలు ఉండేవి. ప్రతి రాత్రి అవి హాయిగా పొలం దగ్గర నిద్రిస్తూ ఉండేవి. ఓ రాత్రి ఒక గొర్రె కనిపించకుండా పోయింది. యజమాని ఉదయం వచ్చి తొమ్మిది గొర్రెలే వుండటాన్ని గమనించాడు. ఒక గొర్రె ఎలా మాయం అయిందో అతనికి అర్థం కాలేదు. ఏం జరిగిందని మిగతా గొర్రెలని ప్రశ్నించాడు. ఏ గొర్రె కూడా సమాధానం చెప్పలేదు. రెండో రోజు మరో గొర్రె మాయమైపోయింది. యజమాని తిరిగి మిగిలిన గొర్రెలను ప్రశ్నించాడు. ఎలాంటి సమాధానం రాలేదు. గొర్రెలు కూడా ఆందోళన చెందాయి. ఏమి జరుగుతుందో వాటికి అర్థం కాలేదు. అందులో ఒక తెలివిగల గొర్రె ఇలా ఎందుకు జరుగుతుందో కనుక్కోవాలని అనుకుంది. ఆ రాత్రి నిద్ర నటిస్తూ ఒక కన్ను తెరిచి చూస్తూ పడుకుంది. అర్ధరాత్రి తనపైన ఉన్న గొర్రె బొచ్చును తొలగించి ఓ తోడేలు బయటకు వచ్చి దాని పక్కన ఉన్న గొర్రెను చంపి తినేసింది. బొచ్చుని తిరిగి వేసుకొని గొర్రె మాదిరిగా పడుకుంది. ఇది చూసిన గొర్రె భయంతో కళ్లు మూసుకుంది. ఉదయం యజమాని వచ్చి గొర్రెలని లెక్క పెట్టాడు. మరో గొర్రె కనిపించలేదు. అతనికి ఏం చేయాలో తోచలేదు. గొర్రెలని ఎందుకు మాయమవుతున్నాయి అని ప్రశ్నించాడు. ఏ గొర్రె కూడా సమాధానం చెప్పలేదు. తోడేలు సంగతిని పసిగట్టిన గొర్రె కూడా నిశ్శబ్దంగా ఉండిపోయింది. గొర్రెలు ఒకటి తర్వాత ఒకటి మాయమవుతూనే ఉన్నాయి.

తోడేలు సంగతి తెలిసిన మేధావి గొర్రె దానికి దూరంగా పడుకోవడం మొదలుపెట్టింది. చివరికి రెండు గొర్రెలే మిగిలాయి. ఏం జరుగుతోందని యజమాని గట్టిగా ఆ రెండు గొర్రెలని ప్రశ్నించాడు మేధావి గొర్రె చివరికి నోరువిప్పి జరిగిన సంగతంతా చెప్పింది. కోపంతో అతడు గొర్రె వేషంలో ఉన్న తోడేలును పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అది దొరకకుండా పారిపోయింది. యజమాని ఒంటరి గొర్రెను ‘ఇంతకాలం నువ్వు ఎందుకు నాకు ఈ విషయాన్ని చెప్పలేదు’ అని గట్టిగా మందలించాడు. ‘ఇలా చెప్పడము నా పని కాదని అనుకున్నాను. అందుకని మౌనంగా ఉన్నాను. కొంతకాలానికి పరిస్థితి మెరుగుపడుతుందని భావించాను. కానీ, అలా జరగలేదు. చివరికి మిగిలింది నేను మాత్రమే అందుకోసమే ఈ రోజు చెప్పాను’ అంది. యజమానికి బాధా, వేదనా కలిగాయి. ఏం చేయాలో తోచలేదు. తెలిసీ మాట్లాడకపోవడం వల్ల జరిగే ప్రమాదాలను గురించి ఆ గొర్రెకి వివరించాడు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. మిగిలింది ఒకే ఒక గొర్రె. దాన్ని ఏమీ చేయలేడు. కొట్టలేడు చంపలేడు. అందుకని తల పట్టుకొని కూర్చున్నాడు.

ఇప్పుడు మన దేశంలో, రాష్ట్రంలో అలాంటి పరిస్థితే ఉంది. గొర్రెల తోళ్లు కప్పుకొని ఎన్నో తోడేళ్లు మన మధ్యే సంచరిస్తున్నాయి. ఆ విషయం తెలిసి కూడా ఎవరూ నోరు విప్పడం లేదు. ‘నాకు సంబంధం లేదు. నాకెందుకు అని అనుకుంటున్నారు’ అది పెగాసస్ సంగతి కావచ్చు, హౌస్ అరెస్టులు కావొచ్చు, లాకప్ డెత్‌లు కావొచ్చు, బూటకపు ఎన్‌కౌంటర్లు కావచ్చు, విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి కావచ్చు. ఎవరైనా తాను బాధితుడు కానంత వరకూ అలాగే ఉండిపోవడం ఎంతవరకు సమంజసం? తోడేళ్లను బయటకు పంపించాల్సిన బాధ్యత వాళ్ల మీదా, అందరిమీద లేదా? ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తి ప్రశ్నించాల్సిన అవసరం మేధావులకు లేదా? ఇదీ చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న!!

రాజేందర్ జింబో

Tags:    

Similar News