ప్రాణం ఒకటే.. పరీక్షలు రెండు

దిశ, హైదరాబాద్ : ఎవరికైనా జబ్బు చేస్తే ఆస్పత్రిలో ఎన్ని రోజులుంటారు. ఎంత పెద్ద రోగమైనా వైద్యులు ఎన్నేండ్లు పర్యవేక్షణ చేస్తారు. ఈ ప్రశ్నకు ఎవరైనా ఠక్కున సమాధానం చెబుతారు.. మహా అయితే ఆర్నెళ్లు లేదంటే ఏడాది పాటు వైద్యం అందుబాటులో ఉండొచ్చొంటారు. కానీ, అవిభక్త కవలలు వీణా వాణీలకు ఎలాంటి అనారోగ్యం లేకున్నా 17 ఏళ్లుగా నిరంతరం వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటున్నారు. వీరికోసం ప్రత్యేక ఆయాలు, వైద్య సదుపాయాలు నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. అవిభక్త కవలలుగా […]

Update: 2020-03-01 07:11 GMT

దిశ, హైదరాబాద్ : ఎవరికైనా జబ్బు చేస్తే ఆస్పత్రిలో ఎన్ని రోజులుంటారు. ఎంత పెద్ద రోగమైనా వైద్యులు ఎన్నేండ్లు పర్యవేక్షణ చేస్తారు. ఈ ప్రశ్నకు ఎవరైనా ఠక్కున సమాధానం చెబుతారు.. మహా అయితే ఆర్నెళ్లు లేదంటే ఏడాది పాటు వైద్యం అందుబాటులో ఉండొచ్చొంటారు. కానీ, అవిభక్త కవలలు వీణా వాణీలకు ఎలాంటి అనారోగ్యం లేకున్నా 17 ఏళ్లుగా నిరంతరం వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటున్నారు. వీరికోసం ప్రత్యేక ఆయాలు, వైద్య సదుపాయాలు నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. అవిభక్త కవలలుగా జన్మించిన వీణా-వాణీలను విడదీయడానికి అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, స్విట్టర్లాండ్ దేశాలకు చెందిన ప్రఖ్యాత వైద్యులు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ, రెండు శరీరాలు.. ఒకే ప్రాణంతో పుట్టిన వీరికి ఆపరేషన్ చేస్తే ఇద్దరిలో ఒకరే బతికే ఛాన్స్ ఉన్నట్టు వైద్యులు చెప్పడంతో ఆపరేషన్ వాయిదా పడుతోంది.

ప్రస్తుతం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ హోంలో ఉంటున్న వీణా- వాణీల వయస్సు 17 ఏళ్లు. మహబూబాబాద్ జిల్లా బీరుశెట్టి గూడెంకు చెందిన మురళి, నాగలక్ష్మీ దంపతులకు వీణా – వాణీలు 2003లో జన్మించారు. పుట్టుకతోనే జంటగా పుట్టడం వల్ల వీరిని విడదీసేందుకు ప్రయత్నాలు చాలానే జరిగాయి. తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో వారిని పెంచడం ఇబ్బంది కాకుండా ఉండేందుకు వీరి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ముందుగా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రముుఖ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ నాయుడమ్మ ఆధ్వర్యంలో ఆపరేషన్‌కు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో 2006 వరకూ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలోనే డాక్టర్ నాయుడమ్మ సారథ్యంలో ఉన్నారు. ఆపరేషన్ కుదరకపోవడంతో అక్కణ్నుంచి 2007లో హైదరాబాద్ నిలోఫర్ ఆసుప్రతికి తీసుకొచ్చారు. నీలోఫర్‌లో వీణా-వాణీల కోసం ప్రత్యేక ఆయా, నర్సులు, వైద్యులతో పాటు విద్యా బుద్దులు నేర్పేందుకు ట్యూటర్లను కూడా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది. నిలోఫర్ ఆస్పత్రిలో కేవలం చిన్న పిల్లలు మాత్రమే ఉండటం, వయస్సు పెరుగుతున్న కారణంగా.. తోటి విద్యార్థులతో ఉంటే బాగుంటుందని భావించిన నిలోఫర్ వైద్యులు ప్రభుత్వ అనుమతితో యూసుఫ్‌గూడలోని స్టేట్ హోంకు మార్చాల్సి వచ్చింది.

ఒకే ప్రాణంతో ఇద్దరు వ్యక్తులు ఉన్నారన్న కారణం తప్ప..వీణా – వాణీలకు ఎలాంటి సమస్యలు లేవు. వాళ్ల దినచర్యలో ఏ సమస్యలు వచ్చినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్లిద్దరూ సర్దుకుపోతున్నారు. వీరి ఆలనా-పాలనా నిమిత్తం నిలోఫర్ సిబ్బందిని కూడా శిశు సంక్షేమ శాఖకు బదిలీ అయ్యారంటే ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుంటుందో అర్థం అవుతోంది. నిలోఫర్‌లో ఉన్నప్పుడే వీరి విద్యాభ్యాసం మొదలైంది. ఇప్పటి వరకూ వారి వద్దనే విద్యా బోధన జరిగింది. పరీక్షలకు పెద్ద ఇబ్బందేమీ జరగలేదు. కానీ, ఈ ఏడాది పదో తరగతి కావడంతో తప్పనిసరిగా బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంది. అందుకు హైదరాబాద్ జిల్లా డీఈవో వెంకటనర్సమ్మ చొరవతో వారిద్దరూ నగరంలోని అమీర్ పేట ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ పొందారు. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకూ ఎస్సెస్సీ బోర్డు ఆధ్వర్యంలో పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. వీరిద్దర్నీ ప్రత్యేకంగా భావించిన ఎస్సెస్సీ బోర్డు ఒకేచోట వేర్వేరుగా పరీక్షలు రాసేందుకు అనుమతించింది. ఒకే ప్రాణంతో వేర్వేరుగా పరీక్షలు రాసే వీణా-వాణీలు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆశిద్దాం.

Tags:    

Similar News