ఆర్ఆర్ఆర్ ప్రస్తావన.. జోరందుకున్న ‘రియల్’ వ్యాపారం!
రీజినల్ రింగ్ రోడ్డు ప్రతిపాదనతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకున్నది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు మధ్య భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రీజినల్ రింగు రోడ్డుపై అవగాహన లేని చాలా మంది రైతులు తమ ఆర్థిక అవసరాలకు భూములను అమ్మేసుకుంటుండగా, బడా కంపెనీలు రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్యలో 10 వరకు ప్రధాన జంక్షన్లు రాబోతున్నాయి. లింకు రోడ్లు […]
రీజినల్ రింగ్ రోడ్డు ప్రతిపాదనతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకున్నది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు మధ్య భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రీజినల్ రింగు రోడ్డుపై అవగాహన లేని చాలా మంది రైతులు తమ ఆర్థిక అవసరాలకు భూములను అమ్మేసుకుంటుండగా, బడా కంపెనీలు రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్యలో 10 వరకు ప్రధాన జంక్షన్లు రాబోతున్నాయి. లింకు రోడ్లు అభివృద్ధి కానున్నాయి. అక్కడి గ్రామాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చేసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఒకప్పుడు హైదరాబాద్ మహానగరానికి మణిహారం ఔటర్ రింగ్ రోడ్డు. ఇప్పడు నగర రూపురేఖలే మారిపోయాయి. జీహెచ్ఎంసీ నుంచి ఔటర్ వరకు హైదరాబాద్ విస్తరించింది. లెక్కకు మించిన ప్రాజెక్టులూ వచ్చాయి. వేలాది కాలనీలు వెలిశాయి. ఐటీ, పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో భూ సేకరణకు రూ.750 కోట్లు కేటాయించింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకోనుంది. ఔటర్ రింగు రోడ్డు ఏర్పడిన తర్వాత రియల్ రంగంలో వచ్చిన వృద్ధికన్నా ఇప్పుడు రీజినల్ రింగు రోడ్డుతో సాధ్యమవుతుందని అధికార పార్టీ నేతలు, రియల్ ఎస్టేట్ రంగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా ఉనికిలోకి వస్తున్న చాలా వెంచర్‌లలో ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగు రోడ్డును ప్రస్తావించడం పెరిగిపోయింది. గ్రామాల్లో వెలిసిన లే అవుట్ల ధరలు కూడా బాగా పెరిగాయి. నిన్నమొన్నటి వరకు గజం ధర రూ. 5 వేలు పలికే ప్లాట్లు రేటు రెట్టింపైంది. రియల్ ఎస్టేట్ సంస్థలకు ఈ ప్రాజెక్టు వరంగా మారింది. వ్యాపార వృద్ధికి రాచమార్గమైంది. హైదరాబాద్ నగరం నుంచి మహబూబ్‌నగర్, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్, యాదాద్రి, వికారాబాద్, మెదక్, సిద్ధిపేట .. ఇలా అన్ని వైపులా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రియల్ ఎస్టేట్ సంస్థలకు మాత్రమే కాక సెలెబ్రిటీలు, సంపన్నులు కూడా రీజినల్ రింగు రోడ్డు వస్తుందన్న ఆలోచనతో భారీ స్థాయిలో భూములు కొని పెట్టుకున్నారు. భవిష్యత్తులో ధరలు పెరుగుతాయన్నదే వారి భావన. ఒక్కో ఎకరాను పది లక్షల రూపాయలకు కొన్న వీరు ఇప్పుడు కోట్ల ధర పలుకుతున్నా అమ్మడానికి సిద్ధంగా లేరు. రీజినల్ రింగు రోడ్డు వచ్చిన తర్వాత ఇంకా ధర పెరుగుతుందనే అభిప్రాయమే ఇందుకు కారణం.
ఔటర్ ఆవలంతా వారిదే
రీజినల్ రింగు రోడ్డుపై అవగాహన లేని చాలా మంది రైతులు వారి ఆర్థిక అవసరాలకు అమ్మేసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత గ్రామాల్లో ఇటీవల భూ క్రయవిక్రయాలు జోరుగానే జరిగాయి. శంషాబాద్ నుంచి 30 కి.మీ. వరకు వందలాది ఎకరాలను బడా కంపెనీలు కొనుగోలు చేసినట్లు సమాచారం. కేశంపేట మండలంలోని చాలా గ్రామాల్లోని భూములు బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు కొన్నట్లు తెలిసింది. ఒక్కో కంపెనీ పేరిట వందలాది ఎకరాలున్నాయి. కొండారెడ్డిపల్లి, కాకునూరు, చిన్నరేవెల్లి గ్రామాల్లోని భూములపై పలు కంపెనీలు దృష్టి పెట్టాయి. ఇటీవల రూ.20 లక్షల్లోపే ఉన్న భూముల ధరలు ఇప్పుడు రూ.40 లక్షలు దాటింది. హిమాజీపూర్, బూర్గుల, రాయికల్, చింతగూడెం, మధురాపూర్, కంసాన్‌పల్లి గ్రామాల్లోనూ బడా కంపెనీలు తిష్ఠ వేశాయి. నాగార్జున్ సాగర్, శ్రీశైలం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ హైవేల్లో హైదరాబాద్‌కు సుమారు 100 కి.మీ. వరకు సాగుభూముల్లో ఇప్పుడు హద్దు రాళ్లు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కడీలు, ఫెన్సింగ్‌లు దర్శనమిస్తున్నాయి. పంట పొలాల కన్నా ప్రహరీలే అధికం. రీజినల్ రింగు రోడ్డుతో భూమాయా ప్రపంచం ఆవిష్కృతమవుతోంది.
ఫామ్ హౌజ్ కల్చర్
సినీ ప్రముఖులు, నటులు పదేళ్లుగా ఇక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఫాంహౌజ్‌లు కట్టుకున్నారు. చుట్టూ ఫెన్సింగ్‌లు నిత్యకృత్యం. ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్యలోనే ఇలాంటివన్నీ కొలువయ్యాయి. షాద్‌నగర్, కేశంపేట, వికారాబాద్ వైపు సినీ ప్రముఖల ఎస్టేట్లు పదుల సంఖ్యలో వెలిశాయి.
జంక్షన్ల చుట్టూ రియల్ భూం (బాక్స్)
ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్యలో 10 వరకు ప్రధాన జంక్షన్లు రాబోతున్నాయి. లింకు రోడ్లు అభివృద్ధి కానున్నాయి. అక్కడి గ్రామాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చేసింది. ఈ ప్రాజెక్టు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారనుందన్న ప్రచారం జోరందుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 11 ఏండ్లు పట్టగా పెరిగిన భూముల ధరలతో రీజినల్ రింగు రోడ్డుకు అవసరమైన భూ సేకరణ ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఫార్మా సిటీ విషయంలోనూ ఇదే చిక్కును ఎదుర్కొంది. ప్రభుత్వం నిర్ణయించే ధరలకు భూములను ఇచ్చేందుకు ఒప్పించడం అంత సులభమైంది కాదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాన కంపెనీలన్నీ ఈ ప్రాజెక్టును బూచీగా చూపి ధరలను మాత్రం పెంచేశాయి. భూసేకరణ సమస్యలతో ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టత లేదు.
రీజినల్ రింగ్ రోడ్డు స్వరూపం
జిల్లాలు : రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్లగొండ (ఉమ్మడి జిల్లాలు)
మండలాలు : 24
గ్రామాలు : 125
పొడవు : 283.53 కి.మీ.
నాలుగు భాగాలు : తూప్రాన్ నుంచి మల్కాపూర్, మల్కాపూర్ నుంచి షాద్ నగర్, షాద్ నగర్ నుంచి కౌలంపేట, కౌలంపేట నుంచి తూప్రాన్
మేజర్ జంక్షన్లు:
క్ర.సం సెక్షన్ గ్రామం ఓఆర్ఆర్ జంక్షన్ ఓఆర్ఆర్ నుంచి దూరం
1. హైదరాబాద్-నాగ్ పూర్ తూప్రాన్ కండ్లకోయ 26.2 కి.మీ.
2. హైదరాబాద్-మెదక్ నర్సాపూర్ దొమ్మరపోచంపల్లి 24.3 కి.మీ.
3. హైదరాబాద్-పూణె కౌలంపేట ముత్తంగి 10.3 కి.మీ.
4. హైదరాబాద్-వికారాబాద్ చేవెళ్ల అప్పా 25.9 కి.మీ.
5. హైదరాబాద్-బెంగుళూరు షాద్ నగర్ కిషన్ గూడ 23.1 కి.మీ
6. హైదరాబాద్-శ్రీశైలం కొత్తూరు చాంద్రాయణగుట్ట 12.8 కి.మీ.
7. హైదరాబాద్-సాగర్ ఆగపల్లి మంగళ్ పల్లి 15.2 కి.మీ.
8. హైదరాబాద్- విజయవాడ మల్కాపూర్ అంబర్ పేట 15.7 కి.మీ.
9. హైదరాబాద్-వరంగల్ భువనగిరి పోచారం 18 కి.మీ.
10. హైదరాబాద్-సిద్ధిపేట ములుగు శామీర్ పేట 20 కి.మీ.
మొత్తం వ్యయం(ప్రైవేటు అసోసియేట్స్ ప్రకారం)
క్ర.సం అంశం రెండు లేన్లు నాలుగు లైన్లు
1. సివిల్ కన్స్ట్రక్షన్ రూ.2073 కోట్లు రూ.4239 కోట్లు
2. భూ సేకరణ రూ.297 కోట్లు రూ.297 కోట్లు
– ఇది ఐదేండ్ల క్రితం రూపొందించినది. ఇప్పుడు భూ సేకరణకు మూడింతలయ్యే అవకాశం ఉన్నది. సుమారు 2,550 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని అంచనా.
హైదరాబాద్ చుట్టూ ఔటర్ స్వరూపం
ప్రాజెక్టు వ్యయం : 6696 కోట్లు
ఔటర్ రింగు రోడ్డు పొడవు : 158 కిలోమీటర్లు
స్పీడ్ లిమిట్ (వాహన వేగపరిమితి) : 100 కిలోమీటర్ ఫర్ అవర్ (కేఎంపిహెచ్)
రైట్ ఆఫ్ వే (ఆర్‌ఓడబ్లూ్య) : 150 మీటర్లు
మెయిన్ క్యారేజీ వే : ఎనిమిది లైన్లు
సెంట్రల్ మీడియన్ : 5 మీటర్లు
సర్వీసు రోడ్లు ఇరువైపులా : రెండు లైన్లు
ఇంటర్‌ఛేంజ్‌లు : 19
శంకుస్థాపన : 2006 డిసెంబరు
అందుబాటులోకి వచ్చింది : 2011
100 శాతం పూర్తయ్యింది : 2017 జూలై
– ఔటర్ రింగ్ రోడ్డు, జీహెచ్ఎంసీ ప్రాంతం మధ్య గ్రామాలు పట్టణాలుగా మారాయి. దాదాపుగా అన్నీ మున్సిపాలిటీగా, కార్పొరేషన్లుగా రూపాంతరం చెందాయి. స్థానిక సంస్థలకు ఆదాయ మార్గాలు కూడా పెరిగాయి.