ఆ ప్రైవేటు ఆసుపత్రి.. డాక్టర్లకే వణుకు పుడుతోంది

దిశ, న్యూస్ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో విభాగాధిపతిగా ఉన్న డాక్టర్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆ ఆసుపత్రిలోని డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఇప్పుడు వణికిపోతున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ కావడానికి ముందు ఆ డాక్టర్ నిర్వహించిన సమావేశాలు, దానికి హాజరైన డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది వివరాలు సేకరించడం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. కారణం పాజిటివ్‌గా తేలిన డాక్టర్ దర్యాప్తుకు […]

Update: 2020-03-27 10:28 GMT

దిశ, న్యూస్ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో విభాగాధిపతిగా ఉన్న డాక్టర్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆ ఆసుపత్రిలోని డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఇప్పుడు వణికిపోతున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ కావడానికి ముందు ఆ డాక్టర్ నిర్వహించిన సమావేశాలు, దానికి హాజరైన డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది వివరాలు సేకరించడం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. కారణం పాజిటివ్‌గా తేలిన డాక్టర్ దర్యాప్తుకు సహకరించకపోవడమేనన్నది అధికారుల వాదన. ఒక విభాగానికి అధిపతిగా ఉన్నందున రోజువారీ విధుల్లో భాగంగా అనేక వార్డులను సందర్శించారు. వార్డు బాయ్ మొదలు వందలాది మందితో మాట్లాడారు. ఆయన ద్వారా భార్యకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. కుటుంబంలోని వారికీ టెస్టులు నిర్వహించారు. రిపోర్టులు రావాల్సి ఉంది.

ఆ ప్రైవేటు ఆసుపత్రిలో ఒక విభాగానికి హెడ్‌గా ఉన్న డాక్టర్‌కు పాజిటివ్ ఉన్నట్లు వార్తలు రావడంతో అప్పటివరకూ అతనితో సన్నిహితంగా ఉన్న, సమావేశాల్లో పాల్గొన్న డాక్టర్లు, డ్యూటీ డాక్టర్లు, నర్సులు… ఇలా వందలాది మంది ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. సెంట్రలైజ్డ్ ఏసీ సౌకర్యం ఉన్నందున ఆయన తిరిగిన రూమ్‌లు, వార్డులన్నింటికీ వైరస్ అంటుకుందేమోనన్న అనుమానం వెంటాడుతోంది. ఇదే డాక్టరు ఇటీవల తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని సందర్శించి వచ్చారు. ఈయనకు పాజిటివ్ అని తేలిన మరుసటి రోజే స్విమ్స్‌లోని ఇద్దరు డాక్టర్లకు కూడా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో పాజిటివ్ ఎలా వచ్చిందని స్విమ్స్ నిర్వాహకులు తలపట్టుకున్నారు. అయితే హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు ఈయనతో పాటు ఇదే ఆసుపత్రికి చెందిన ఒకరు కూడా ప్రయాణించినట్లు తెలిసింది. అయితే ఆ వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు.

ఒక వ్యక్తికి పాజిటివ్ ఉన్నట్లు తేలితే అతను తిరిగిన ప్రదేశాలన్నింటినీ శానిటైజ్ చేయాలనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలు నిపుణుల వరకు చెప్పే మాట. ఇప్పుడు ఈ ఆసుపత్రి విషయంలోనూ అదే జరగాల్సి ఉంది. కానీ ఆ ప్రక్రియ గురించి ఇప్పటివరకూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్ణయం తీసుకోలేదు. ఆయన కరోనా పాజిటివ్ ఎఫెక్ట్ ఆసుపత్రిలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో పాటు వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులపై ఏ మేరకు పడిందనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. ఒక పార్లమెంటు సభ్యుడు కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి ఇంట్లో జరిగిన కార్యక్రమానికి హాజరై నేరుగా పార్లమెంటుకు వెళ్ళడం, ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌కు వెళ్ళడంతో ఆ రెండు భవనాల్లో పూర్తి శానిటైజేషన్ ప్రక్రియ జరిగింది. రాష్ట్రపతి ఏకంగా పద్నాలుగు రోజుల క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ప్రముఖ ఆసుపత్రి విషయంలో అలాంటి చర్యలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

Tags: Telangana, Corona, Doctor, Positive, Private Hospital, Tirupati, SVIMS

Tags:    

Similar News