42 రోజుల తర్వాత గుర్తొచ్చిన గతం..
దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ రోజుల్లో జరిగిన ఈ ఘటన సినిమా కథలకు ఏ మాత్రం తీసిపోలేదు. కుటుంబం నుంచి విడిపోయిన ఓ మహిళ గతం మరిచి లాక్‌డౌన్ రోజులన్నీ పునరావాస కేంద్రంలో గడిపింది. మార్చి నెల చివరివారంలో ఇంటి నుంచి బయటకొచ్చిన ఆ మహిళ మతిస్థిమితం కోల్పోయింది. ఫుట్‌పాత్‌పైనే ఉండిపోయింది. ఆమెకు ఎవరు లేరని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు తీసుకొచ్చి పునరావాస కేంద్రంలో ఉంచారు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో […]
దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ రోజుల్లో జరిగిన ఈ ఘటన సినిమా కథలకు ఏ మాత్రం తీసిపోలేదు. కుటుంబం నుంచి విడిపోయిన ఓ మహిళ గతం మరిచి లాక్‌డౌన్ రోజులన్నీ పునరావాస కేంద్రంలో గడిపింది. మార్చి నెల చివరివారంలో ఇంటి నుంచి బయటకొచ్చిన ఆ మహిళ మతిస్థిమితం కోల్పోయింది. ఫుట్‌పాత్‌పైనే ఉండిపోయింది. ఆమెకు ఎవరు లేరని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు తీసుకొచ్చి పునరావాస కేంద్రంలో ఉంచారు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్ని రోజులైనా ఆచూకీ దొరకకపోవడంతో ఆకలితో చనిపోయిందని భావించారు. కానీ, 42 రోజుల తర్వాత ఆ మహిళ ఇల్లు వెతుక్కుంటూ రావడంతో అందరూ ఆశ్చర్యం, ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకెళితే..ఆమె పేరు మహబూబ్ బీ. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి సర్కిల్ రామాలయ వీధిలో కొడుకులతో పాటు ఉంటుంది. మార్చి చివరి వారంలో ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఏం జరిగిందో ఏమో కానీ అనుకోకుండా ఆమె మతిస్థిమితం కోల్పోయి రోడ్ల మీదనే ఉండిపోయింది. ఎవరైనా ఆహారం ఇస్తే తినడం, ఫుట్‌పాత్‌లు, ఎక్కడ స్థలం దొకితే అక్కడ పడుకోవడం ఆమె దినచర్యగా మారిపోయింది. లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్న యాచకులు, అనాథలు, నిరాశ్రయులను గుర్తించి ఆశ్రయం కల్పించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా మార్చి 30న కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ వి.మమత, మూసాపేట సర్కిల్ డిప్యూటి కమిషనర్ ప్రశాంతి ఆధ్వర్యంలో జిహెచ్‌ఎంసి బృందం రోడ్లపై ఉన్నవారిని తీసుకెళ్తున్నారు. రోడ్డుపక్కన చెట్టు కింద మహబూబ్ బీ పడుకుని ఉండటం గమనించారు. చుట్టుపక్కల వారిని వివరాలు అడగగా.. రెండ్రోజులుగా ఆమె అక్కడే ఉంటోందనీ, భోజనం, వాటర్ బాటిల్ ఇచ్చినప్పటికీ పట్టించుకోవడంలేదని తెలిపారు.
ఆమెను తీసుకెళ్లిన అధికారులు శివానంద పునరావాస కేంద్రంలో చేర్పించారు. పునరావాస కేంద్రంలో ఆహారంతో పాటు ఆరోగ్య పరీక్షలు చేయించి వైద్య సేవలు అందించారు. ఆశ్రమంలో చేరిన 10 రోజుల్లోనే ఆమె ప్రవర్తనలో మార్పు రావడం ప్రారంభమైంది. నిర్వాహకులతో కలిసి పునరావాస కేంద్రంలో ఉన్న ఇతరులకు కూడా సేవలు చేయడంలో పాలుపంచుకుంది. కొన్ని రోజులకే ఆమె పేరు మహబూబ్ బీ అని అందరికీ చెప్పుకుంది. కానీ, అడ్రస్ చెప్పలేకపోయింది. తర్వాత కొన్ని రోజులకు ఆమె అధికారులతో తమ ఇల్లు రామాలయం దగ్గర ఉందని తెలిపింది. దీంతో అధికారులు ఆమెను మూసాపేట, కూకట్‌పల్లి సర్కిళ్లలోని వీధులలో తిప్పుతూ ఇల్లును గుర్తించాలని సూచించారు. కూకట్‌పల్లి సర్కిల్ రామాలయం వీధిలో వెళ్తున్న సమయంలో ఇంటి ముందున్న కొడుకులను మహబూబ్ బీ గుర్తుపట్టింది. దీంతో అధికారులు వారి కుటుంబీకులకు ఆ మహిళను అప్పగించారు. చనిపోయిందనుకున్న తల్లి తమ ఇంటికి చేరుకుందని వారు ఆనందం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.