ప్రతిపాదనలకే పరిమితమైన మినీ స్టేడియం.. కలగానే నిర్మాణ పనులు

ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉండి విద్యా, ఉద్యోగులపరంగా అభివృద్ధి చెందిన మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం కలగానే మిగిలిపోతోంది.

Update: 2024-05-17 02:29 GMT

దిశ, తాడ్వాయి: ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉండి విద్యా, ఉద్యోగులపరంగా అభివృద్ధి చెందిన మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్ కలిసి రూ.2.50 కోట్ల నిధులతో నిర్మాణ పనులు చేపడుతామని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ హామీ ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా మారింది. ఎంతోమంది నాయకులు మండల కేంద్రనికి వచ్చి మినీ స్టేడియం పనులు పూర్తి చేస్తామని యువతకు ఉత్తి మాటలే చెబుతున్నారు. ప్రతి మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామన్న గత ప్రభుత్వ హామీ ఏళ్లు గడుస్తున్నా.. అమలుకు మాత్రం నోచుకోవడం లేదు.

మండలం‌‌లోని పలువురు క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ చాటుతూ పాఠశాల కళాశాల స్థాయిలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, రన్నింగ్, పోటీల్లో జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఉన్నారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో కూడా క్రీడల్లో ప్రతిభావంతులు ఉన్నారు. నిత్యం ప్రాక్టీస్ చేసుకునేందుకు అనువైన మైదానం లేక వారిలో ప్రతిభ వెలికిరాకుండా పోతోంది. ప్రతిభను మరింత మెరుగు పరుచుకునే పరిస్థితి లేకుండా పోయింది. క్రీడాస్థలం లేని కారణంగా ఆటల నిర్వహణకు సైతం ఎవరూ ముందుకు రావడం లేదు. క్రీడలపై విద్యార్థులు, యువతకు ఆసక్తి ఉన్నా స్థలం లేకపోవడంతో వారి ఆశలు సన్నగిల్లుతున్నాయి.

మండల కేంద్రంలో పోటీలు నిర్వహించిన సందర్భాల్లో ప్రారంభోత్సవ ముగింపు కార్యక్రమానికి వచ్చిన నేతలు, అధికారులు స్టేడియం నిర్మాణానికి హామీ ఇచ్చి వెళ్లారే తప్పా.. ఏ మాత్రం పట్టించుకోలేదు. మండల కేంద్రంలోని పాఠశాలల ఆవరణలలో కూడా తగిన స్థలం లేక విద్యార్థులు అడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. తాడ్వాయి మండల కేంద్రంలో మినీస్టేడియంకు అవసరమైన స్థలాలు ఉన్నా ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. మినీ స్టేడియం నిర్మాణం వల్ల మండలలోని అన్ని గ్రామాల క్రీడాకారులు, విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు మినీ స్టేడియం నిర్మాణానికి చొరవ తీసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. 


Similar News