అధునాతన టెక్నాలజీతో ట్రాకింగ్.. పులి జాడ తెలిసేదెట్టా?

దిశ, ఫీచర్స్: మనిషి ఎక్కడెక్కడ సంచరిస్తున్నాడో? ఏ టైమ్‌లో ఎక్కడ ఉన్నాడో? తెలుసుకోవడం చాలా ఈజీ! మరి జంతువులను ట్రాక్ చేయడం ఎలా? అందులోనూ ఆడ పులుల జాడ కనిపెట్టడమెలా? మనిషి కంటపడకుండా ఓ టైగర్ మూడువేల కిలోమీటర్లు ఎలా ప్రయాణం చేసింది? అడవుల్లో ప్రత్యేక బృందాలు, సీసీ టీవీల కన్నుగప్పి షేర్ కా షికార్ ఎలా సాగుతోంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ‘టైగర్ ట్రాకింగ్’ గురించి తెలుసుకోవాల్సిందే. అప్పట్లో ‘అవని’ అనే ఆడపులి రియల్ […]

Update: 2021-07-20 20:21 GMT

దిశ, ఫీచర్స్: మనిషి ఎక్కడెక్కడ సంచరిస్తున్నాడో? ఏ టైమ్‌లో ఎక్కడ ఉన్నాడో? తెలుసుకోవడం చాలా ఈజీ! మరి జంతువులను ట్రాక్ చేయడం ఎలా? అందులోనూ ఆడ పులుల జాడ కనిపెట్టడమెలా? మనిషి కంటపడకుండా ఓ టైగర్ మూడువేల కిలోమీటర్లు ఎలా ప్రయాణం చేసింది? అడవుల్లో ప్రత్యేక బృందాలు, సీసీ టీవీల కన్నుగప్పి షేర్ కా షికార్ ఎలా సాగుతోంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ‘టైగర్ ట్రాకింగ్’ గురించి తెలుసుకోవాల్సిందే.

అప్పట్లో ‘అవని’ అనే ఆడపులి రియల్ స్టోరీ గుర్తుందా? పోనీ ఇటీవలే విద్యాబాలన్ లీడ్‌రోల్‌లో వచ్చిన ‘షేర్ని’ కథ తెలుసా? ఈ రెండు ఒకటే. ‘అవని’ అనే ఆడపులి మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో పంధర్కావాడ అడవిలో 2017-18లో 13 మందిని చంపి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చివరికి దీన్ని మన హైదరాబాదీ లైసెన్సెడ్ షూటర్ అస్తర్ అలీఖాన్ కాల్చి చంపాడు. అయితే మహారాష్ట్ర అటవీ ట్రాకింగ్ విభాగ నైపుణ్యానికే పరీక్ష పెట్టిన ఈ ట్రైగ్రెస్ రియల్ స్టోరీ ఆధారంగానే ‘షేర్ని’ మూవీ తెరకెక్కించారు.

ట్రాకింగ్ ఎందుకు?

పులులను పట్టుకునే ఆపరేషన్స్‌లో భాగంగానే కాక.. వాటి ప్రవర్తన, ఎకాలజీని అర్థం చేసుకోవడానికి కూడా ట్రాక్ చేస్తుంటారు. అయితే గతకొన్ని సంవత్సరాలుగా వన్యప్రాణులను ట్రాక్ చేస్తున్నా.. ఆ వ్యవస్థ ప్రస్తుతం మరింత మెరుగుపడింది. ఇది పులుల ప్రపంచం గురించి అవగాహన పెంచుకునేందుకు దోహదపడింది. అంతేకాదు పులుల సంరక్షణకు అపారమైన అవకాశాలు కల్పించి, వాటి సంతతి పెరగడంలో కీ రోల్ పోషించింది. టైగర్‌ను ట్రాక్ చేసేందుకు ప్రధానమైన రెండు మార్గాల్లో ఒకటి కెమెరా ట్రాక్స్. అదేవిధంగా ‘షేర్ని’ సినిమాలో చూపించిన ‘రేడియో కాలర్స్’ కూడా ఉపయోగించవచ్చు. ఇక జీఎస్‌‌ఎమ్(GSM) కెమెరా ట్రాప్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీపై ఆధారపడి ఉన్నప్పటికీ వాటిని కూడా వినియోగించుకోవచ్చు. పులుల ప్రవర్తన, వాటి ఆహారం, కదలికల గురించి ఎక్కువకాలం పాటు సాగించే అధ్యయనాల కోసం రేడియో కాలర్లను వాటి మెడపై అమరుస్తారు. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానమైన రేడియో టెలిమెట్రీ ఉపయోగించి దాని కదలికపై రియల్-టైమ్ సమాచారాన్ని అధికారులు పొందుతారు.

ఉపయోగముందా?

నాన్ కాలర్డ్ పులిని అన్వేషించడానికి వన్యప్రాణుల నిర్వాహకులు పంజాగుర్తులు(పగ్‌మార్క్స్), విసర్జితాలు(టైగర్ స్కాట్‌), చెట్లపై స్క్రాచ్ మార్కులు కెమెరా ట్రాప్స్ వంటి సాంప్రదాయ పద్ధతులపై ఆధారపడతారు. పులి గతంలో ఎక్కడెక్కడ ఎక్కువగా తిరిగిందో.. ఆ ప్రకారం అక్కడ కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేస్తారు. కానీ ఈ ప్రదేశాల్లోనే కాకుండా, కెమెరాలు లేని ఇతర ప్రాంతాల్లోనూ అవి సంచరిస్తాయి. అందువల్ల కొన్ని ప్రదేశాల్లో మాత్రమే అది కెమెరాకు చిక్కుతుంది. అంతేకాదు కెమెరాను ఎప్పటికప్పుడు చెక్ చేసే పరిస్థితి ఉండదు. దాదాపు 2-12 గంటల విరామం తర్వాత మాత్రమే వాటిని చెక్ చేస్తారు. ఆ చిత్రాలను పరిశీలించే సమయానికి పులి అప్పటికే వేరే ప్రదేశానికి వెళ్లిపోతోంది. కెమెరా ట్రాక్స్ అనేవి అధికారులకు పులుల సంచారం మీద ఓ ఐడియా మాత్రమే ఇస్తాయి. ఒకవేళ కెమెరాలు జంతువును గుర్తించడానికి సాయపడినా, ఆ ప్రదేశంలో ఒకటి కంటే ఎక్కువ పులులు తిరిగే అవకాశం లేకపోలేదు. దాంతో అధికారులు వెతికే పులి జాడ కచ్చితంగా ట్రాక్ చేయలేం.

రేడియో టెలిమెట్రీ ట్రాకింగ్ :

టెలిమెట్రీ ట్రాకింగ్‌లో పులిపై ఎప్పుడూ రాడార్‌ ఉంటుంది. పులి కదలికల కచ్చితమైన మార్గం కంటే, దాని ప్రవర్తనపై టెలిమెట్రీ అవగాహన అందిస్తుంది. ఇది నడిచే క్రమంలో ఎక్కడ, ఎంతసేపు విశ్రాంతి తీసుకుంటుంది. దేనిని తరచుగా వేటాడుతుంది. అనే విషయాలపై విలువైన సమాచారాన్ని అందిస్తుంది. అడవుల్లో సంచరించే సమయంలో పులులు ఎలాంటి ప్రత్యేక దిశను అనుసరించవు. కానీ అడవిరహిత దారుల్లో కదులుతున్నప్పుడు మాత్రం నిర్దిష్ట మార్గాన్ని ఎంచుకుని సాగిపోతాయి. ఒకవేళ ఏదైనా అడ్డంకి వస్తే దాని దిశను మార్చుకుంటుంది. రక్షిత ప్రాంతాల(ప్రొటెక్టెడ్ ఏరియా)తో పాటు, నాన్ ప్రొటెక్టెడ్ ఏరియాల్లోనూ వీటిని ట్రాక్ చేస్తారు. సాధారణంగా ఆడపులులు చిన్న భూభాగాల్లో ఉంటాయి. అలాగే మేల్ టైగర్స్ పెద్ద భూభాగాల్లో నివసిస్తాయి. ఇక కొన్ని పులులకు మాత్రం ప్రత్యేకంగా స్థావరాలుండవు. అటువంటి పులుల కదలికను ట్రాక్ చేయడం కష్టం. ఇక కాలక్రమేణా అవి మానవులను తప్పించే కళను నేర్చుకోవడంతో పాటు, అటవీరహిత ప్రదేశాలు లేదా ఇతర భూభాగాల నుంచి సంచరిస్తున్నప్పుడు వాటి కదలికల విషయంలో రహస్య పంథాను అనుసరిస్తాయి.

సేఫ్ కారిడార్స్ ఉపయోగం :

మహారాష్ట్ర అటవీ శాఖవైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఐఐ)తో కలిసి 2016 – 20 వరకు తూర్పు విదర్భ ల్యాండ్‌స్కేప్‌లో పులి వలసల నమూనాలను అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో టైగర్ కంటే టైగ్రెస్‌ ఎక్కువ ఆహారం స్వీకరిస్తుందని, శత్రువుల నుంచి తమ స్థావరాన్ని కాపాడుకోవడానికి గస్తీ కాస్తూ ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తూ.. ఎక్కువ ఆహారం తీసుకుంటాయని, అందుకే ప్రొటెక్టెడ్ ఏరియాల్లో ఆడపులులకు 10-12 శాతం ఎక్కువ ఆహారం అవసరమని తేలింది. ఇక అడవిరహిత మార్గాలు లేదా హ్యుమన్ డామినేటెడ్ ల్యాండ్‌స్కేప్‌లో టైగ్రెస్ ఆహార అవసరం 24 శాతం పెరుగుతుంది. అయితే అప్పటివరకు ఆడ పులులు 150 కిలోమీటర్లకు మించి ప్రయాణించవని, సురక్షితమైన కారిడార్ ఉంటేనే అవి కదులుతాయని తెలిసింది. ట్రాకింగ్ సమాచారాల్లో చాలా విలువైన అంశం ఏమిటంటే? బిగ్ క్యాట్స్ వలస వెళ్ళడానికి ఎంచుకునే సురక్షితమైన కారిడార్లు పులుల సంరక్షణకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే వలసలను సులభతరం చేయడంతో కొన్ని ప్రాంతాల్లో పులి సాంద్రత అధిక భారాన్ని తగ్గించవచ్చు. సంతానోత్పత్తిని నిరోధించడానికి, జన్యు రకాన్ని నిర్ధారించడంలోనూ ఇది ఉపయోగపడుతుంది. ఇతర ప్రాంతాలకు పులుల వలసలను ప్రోత్సహించడానికి, వాటికి అనుకూలమైన కారిడార్లను గుర్తించడానికి టైగర్ ట్రాకింగ్ సహాయపడుతుంది.

మహారాష్ట్ర అటవీ శాఖ, డబ్ల్యుఐఐ సంయుక్తంగా ఆ రాష్ట్రంలోని పులుల పర్యవేక్షణకోసం మరొక దీర్ఘకాలిక పరిశోధన కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నాయి. ఇది ఒకే పులి కుటుంబానికి చెందిన మూడు-నాలుగు తరాల పులులకు రేడియో కాలరింగ్‌ అమర్చనున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యేక లక్షణం ఏమిటంటే అది పులి పిల్లల(కబ్స్) సమాచారాన్ని సేకరిస్తుంది.

Tags:    

Similar News