మాస్క్ మస్ట్.. ఇంట్లో ఉన్నా పెట్టుకోవాల్సిందే

న్యూఢిల్లీ: కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ ఇంట్లో ఉన్నా మాస్కులు పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టడంలో మాస్కు శ్రీరామరక్షలా పనిచేస్తుందని పేర్కొంది. ఈ మేరకు దేశంలో కరోనా పరిస్థితులను వివరించడానికి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నితి అయోగ్ సభ్యుడు (వైద్యం) వి.కె.పాల్ మాట్లాడుతూ.. ‘ఇంట్లో ఉన్నా మాస్కు ధరించండి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి. అలాగే […]

Update: 2021-04-26 10:47 GMT

న్యూఢిల్లీ: కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ ఇంట్లో ఉన్నా మాస్కులు పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టడంలో మాస్కు శ్రీరామరక్షలా పనిచేస్తుందని పేర్కొంది. ఈ మేరకు దేశంలో కరోనా పరిస్థితులను వివరించడానికి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నితి అయోగ్ సభ్యుడు (వైద్యం) వి.కె.పాల్ మాట్లాడుతూ.. ‘ఇంట్లో ఉన్నా మాస్కు ధరించండి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి. అలాగే ఇంటికి ఎవరినీ ఆహ్వానించకండి’ అని తెలిపారు. ఇంట్లో ఎవరికైనా కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయితే సదరు వ్యక్తి మాస్కు పెట్టుకోవడం తప్పనిసరి అని అన్నారు. మూసిఉన్న ప్రదేశాలలో ఇతరులకు వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని తెలిపారు. ప్రజలు ఇంట్లోనూ మాస్కులు ధరించాల్సిన పరిస్థితులు తలెత్తాయని ఆయన అన్నారు.

కొవిడ్ లక్షణాలున్న వ్యక్తి టెస్టు చేయించుకున్న తర్వాత రిపోర్టు వచ్చేదాకా వేచి చూడవద్దని, వెంటనే ఇంట్లో ఐసోలేట్ కావాలని ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. మాస్కు పెట్టుకోకుంటే కొవిడ్ సోకే ఆస్కారం ఎక్కువగా ఉందని హెల్త్ మినిస్ట్రీ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ అన్నారు.

ఒక వ్యక్తి 406 మందికి అంటించే అవకాశం..

కరోనా వచ్చిన వ్యక్తి భౌతిక నిబంధనలు పాటించకుంటే 30 రోజుల్లో 406 మందికి అంటించే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పరిశోధనలో వెల్లడైంది. ఒకవేళ సదరు వ్యక్తి కరోనా భౌతిక నిబంధనలను 50 శాతం పాటిస్తే నెల రోజులలో 15 మందికి వ్యాధిని వ్యాపింపజేస్తాడని తెలిపింది. అదే 75 శాతం పాటిస్తే ముప్పై రోజుల్లో ఇద్దరు లేదా ముగ్గురికి సంక్రమింపజేసే అవకాశం ఉందని ఐసీఎంఆర్ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తాజా సూచనలు చేసింది.
కాగా, దేశంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, తమిళనాడు లలో లక్షకు మించి కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం తెలిపింది.

Tags:    

Similar News