కూడుపెట్టని ‘కుండ’

దిశ, తెలంగాణ బ్యూరో : చేతివృత్తినే నమ్ముకున్న వారిని నట్టేట ముంచింది కరోనా మహమ్మారి. కంటికి కనిపించని ఈ వైరస్ ధాటికి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మట్టి పాత్రలు, కుండలు తయారుచేసుకొని పొట్ట పోసుకునే వారి నోట్లో మట్టి కొట్టింది ఈ మహమ్మారి. వారి జీవితాలను దుర్భరం చేసేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర లక్షలకు పైగా శాలివాహనుల కుటుంబాలుంటే అందులో 50 శాతం మంది మట్టి పాత్రలు, కుండలు తయారీ చేసే చేతివృత్తినే నమ్ముకుని జీవినం […]

Update: 2021-06-06 16:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : చేతివృత్తినే నమ్ముకున్న వారిని నట్టేట ముంచింది కరోనా మహమ్మారి. కంటికి కనిపించని ఈ వైరస్ ధాటికి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మట్టి పాత్రలు, కుండలు తయారుచేసుకొని పొట్ట పోసుకునే వారి నోట్లో మట్టి కొట్టింది ఈ మహమ్మారి. వారి జీవితాలను దుర్భరం చేసేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర లక్షలకు పైగా శాలివాహనుల కుటుంబాలుంటే అందులో 50 శాతం మంది మట్టి పాత్రలు, కుండలు తయారీ చేసే చేతివృత్తినే నమ్ముకుని జీవినం సాగిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా కుండల తయారీకి, అమ్మకాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయంటూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతివృత్తిని నమ్ముకున్నవారికి చేయూతనందిస్తామని చెప్పినా తమకు ఎలాంటి ప్రయోజం చేకూరలేదని వారు ఆవేదనం చెందుతున్నారు. చేతివృత్తిని నమ్ముకున్న వారిలో సుమారు 200 మందికిపైగా కొవిడ్ బారిన పడి మృతిచెందినట్టు తెలుస్తోంది. మరెంతో మంది కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

వేడుకైనా, చావుకైనా కుండ లేనిదే తంతు పూర్తికాదు. అలాంటి సంప్రదాయానికి కరోనా మహమ్మారి బ్రేకులు వేసింది. గతేడాది బిజినెస్ ప్రారంభమయ్యే సమయంలోనే కరోనా వ్యాప్తి చెందడంతో శాలివాహనుల కుటుంబాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. కుటుంబపోషణ భారమై ఎన్నో కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. అటు కొవిడ్ తో ఆస్పత్రిలో చేరి అప్పులపాలవున్నవారు కొందరుంటే, కుటుంబాన్ని పోషించేందుకు అప్పులు చేస్తున్న వారు కొందరున్నారు. ఈ బాధను పూడ్చుకునేందుకు ఏదైనా పనికి వెళ్దామన్నా ఇప్పుడ ఎవరూ చేర్చుకోవడం లేదు. తయారు చేసిన కుండలు అమ్ముకోలేక, అప్పులు తీర్చలేక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. కొవిడ్ కారణంగా అటు తయారీదారులకు, ఇటు వ్యాపారులకూ పెద్ద దెబ్బ పడింది.

కొనేవారే కరువయ్యారు

బోనాలు, ఉగాది, దీపావళి, పెండ్లి వేడకలకు మట్టి పాత్రలు కావాల్సిందే. వేసవిలో పలువురు ఏర్పాటు చేసే చలివేంద్రాలకు కూడా రంజన్లు, కుండలు కావాల్సిందే. అయితే గతేడాది నుంచి ఈ వేడుకలు, కార్యక్రమాలకు బ్రేక్ పడింది. పెండ్లిళ్ల సీజన్ అయినా కరోనా నేపథ్యంలో పలువురు వాయిదా వేసుకుంటుండంతో కుండల అమ్మకాలు జరగడం లేదు. ఇక పండుగల విషయానికొచ్చినా అదే పరిస్థితి కనిపిస్తోంది. బోనాలు వంటి పండుగలు నిర్వహించేందుకు ఎవరూ సాహసించడంలేదు. ఎవరి నుంచి కొవిడ్ వచ్చి అంటుకుంటుందోనని జనం జంకుతున్నారు. దీపావళి వేడుకల్లో దీపాలు పెట్టేందుకు కూడా అందరూ రెడీమేడ్ లైట్లు తెచ్చుకోవడంతో ఎవరూ కొనుగోలు చేయడంలేదు. వేసవి వస్తే చలివేంద్రాలు ఏర్పాటు చేసే స్వచ్ఛంద సంస్థలు కూడా లాక్ డౌన్ కారణంగా ఏర్పాటు చేయలేదు. అంతేకాకుండా చావులకు కుండపట్టే విధానానికి కూడా కరోనా కారణంగా స్వస్థి పలకాల్సి వచ్చింది. కొవిడ్ కారణంగా మృతిచెందితే నేరుగా కాటికే తీసుకెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేస్తుండటంతో కుండలు కొనేవారే కరువయ్యారు.

తయారీదారులకు ఇబ్బందులు

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా చేతివృత్తిదారుల పరిస్థితి మారలేదు. కుండలు తయారు చేద్దామంటే కావాల్సిన మట్టి కూడా దొరకని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. అలాంటిది ఎన్నో ఇబ్బందులు పడి మట్టి తెచ్చుకుని కుండలు తయారు చేసినా కొనేవారు లేకుండా పోయారు. ఇక కొవిడ్ మహమ్మారి విజృంభించడం.. లాక్ డౌన్ విధించడం కారణంగా ఎక్కడి కుండలు అక్కడే ఉన్నాయి. వ్యాపారులు తీసుకెళ్లకు వర్షానికి తడిచి ధ్వంసమవుతున్నాయి. తయారు చేసిన కుండలను అమ్ముకునేందుకు అంగడి, పట్టణ ప్రాంతాల్లో మట్టి పాత్రలు పెట్టుకుంటే పోలీసులు చలాన్ విధిస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలు ఒకలా చేతలు మరోలా ఉన్నాయంటూ మండిపడుతున్నారు శాలివాహనులు. తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాట్లు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

సడలింపులు ఇచ్చినా బిజినెస్ లేదు..

రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపు సమయాన్ని పెంచినా బిజినెస్ పెద్దగా లేదంటున్నారు కుండలు అమ్ముకునే వ్యాపారులు. గతంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉన్న సమయంలో కుండలు తెచ్చి రోడ్డుపై పెట్టే లోపే సమయం ముగిసిపోయేదని వాపోతున్నారు. ప్రస్తుతం మధ్యాహ్నం 1 గంటల వరకు సమయం పెంచినా వ్యాపారం అంతంతగానే సాగుతోందంటున్నారు. లాక్ డౌన్ సమాయానికి ఏమాత్రం ఆలస్యమైనా కొన్ని సందర్భాల్లో పోలీసులు ఫైన్ విధిస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా అటు చేతివృత్తిదారులను, ఇటు వ్యాపారులనూ ప్లాస్టిక్ భూతం వెంటాడుతోంది. ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లలో నీరు దొరకడం వల్ల బహిరంగ ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసుందుకు కూడా ఎవరూ ముందుకురావడం లేదు. దీనివల్ల రంజన్లు, కుండలు అమ్ముడుపోక ఇబ్బందులు పడుతున్నట్లు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.

ప్రభుత్వానికి డిమాండ్లు

తెలంగాణలో చేతి వృత్తిని నమ్ముకున్న తమకు ఎలాంటి న్యాయం జరగలేదని శాలివాహనులు చెబుతున్నారు. తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కరోనా వల్ల నష్టపోయిన ప్రతి శాలివాహన కుటుంబానికి రూ.పది వేలు చొప్పున అందించాలంటున్నారు. అలాగే ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్నారు. నాయీ బ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించినట్లుగానే తమకు కూడా ఉచిత కరెంట్ అందించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి

లాక్ డౌన్ వల్ల శాలివాహన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. సుమారు 200 మందికిపైగా కరోనా సోకి మరణించారు. కొందరు కొవిడ్ సోకి చికిత్సకు డబ్బుల్లేక బాధలు పడుతున్నారు. అలా ఇబ్బందులు పడుతున్న ప్రతి కుమ్మరుల కుటుంబానికి ప్రభుత్వం రూ.10 వేలు అందించి చేయూతనందించాలి. చేతివృత్తినే నమ్ముకున్న వారికి సర్కార్ అండగా నిలవాలి. ఇండ్లు లేని శాలివాహనులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించాలి. నాయీ బ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించినట్లు మాక్కూడా ఉచితంగా కరెంట్ అందించాలి.
– జయంత్ రావు, తెలంగాణ కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

 

కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

శాలివాహనుల కోసం కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి. రూ.500 కోట్లతో ప్రత్యేక నిధులు కేటాయించాలి. ప్రభుత్వం ఉపాధి కల్పిస్తామని చెప్పి పలువురి వద్ద డీడీ రూపంలో డబ్బులు కట్టించుకుంది. అందులో భాగంగా గుజరాత్ ట్రైనింగ్ కూడా వెళ్లి వచ్చారు. దానికి సంబంధించి పత్రాలు కూడా అందించారు. కానీ ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం మాత్రం నేటికీ అందలేదు. కుమ్మరి శాలివాహన ఫెడరేషన్ లో ఎంతమందికి నిధులిచ్చారో అనే వివరాలపై కూడా స్పష్టత కరువైంది. కాబట్టి వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ను నియమిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి.
-యాదగిరి, తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు

 

ఏడాదిన్నరగా ఇబ్బందులు పడుతున్నాం

కుండలు, రంజన్లను తయారీదారులకు ఒకేసారి అడ్వాన్స్ ఇచ్చి లోడ్ తెస్తాం. గతేడాది పూర్తిస్థాయి లాక్ డౌన్ వల్ల అసలు అమ్మకాలే జరగలేదు. ఈ ఏడాది అడపాదడపా అమ్ముకున్నాం. లాభాలు లేకున్నా పెట్టుబడి మిగిలినా చాలు అని తక్కువ ధరకే విక్రయించాం. సాధారణ సమయంలో 20 లీటర్ల సామర్థ్యమున్న ఒక్క కుండనురూ.250 నుంచి రూ.300 వరకు అమ్మాం. ఇప్పుడు రూ.100 నుంచి 150 కే అడుగుతున్నారు. ఒక్క పెద్ద సైజు రంజన్ ధర రూ.500 వరకు ఉంది. కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు.
-ఏదునూరి యాదమ్మ, కుండల వ్యాపారి, స్టేషన్ ఘన్ పూర్, జనగామ జిల్లా

Tags:    

Similar News