పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా

దిశ, న్యూస్‌బ్యూరో: పదో తరగతి పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా వాయిదా పడిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుంది. ప్రస్తుతానికి వాయిదా వేయక తప్పలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రవ్యాప్తంగా జూన్ 8 నుంచి పరీక్షలు నిర్వహించుకోవచ్చని శనివారం హైకోర్టు తీర్పునిచ్చిన గంటల వ్యవధిలోనే మంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం. మార్చిలో జరగాల్సిన పరీక్షలు కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. […]

Update: 2020-06-06 10:47 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: పదో తరగతి పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా వాయిదా పడిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుంది. ప్రస్తుతానికి వాయిదా వేయక తప్పలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రవ్యాప్తంగా జూన్ 8 నుంచి పరీక్షలు నిర్వహించుకోవచ్చని శనివారం హైకోర్టు తీర్పునిచ్చిన గంటల వ్యవధిలోనే మంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం. మార్చిలో జరగాల్సిన పరీక్షలు కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడలడంతో జూన్ 8 నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం, ఇరు పక్షాల వాదనలను విన్న తర్వాత హైకోర్టు తీర్పు ఇవ్వడం, మూడు జిల్లాల పరిధిలో నిర్వహించవద్దంటూ కోర్టు ఆంక్షలు విధించడం.. వీటన్నింటి పరిణామాల్లో మొత్తానికే వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అందుకు ముందు హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా… ఒకటి కంటే ఎక్కువ సార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల పలు సమస్యలు వస్తాయని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వ్యాఖ్యానించారు. విద్యార్థుల ప్రాణాలకు భద్రత లేనందువల్ల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో పరీక్షలు నిర్వహించవద్దని, మిగిలిన జిల్లాల్లో నిర్వహించుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆచరణాత్మక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న విద్యాశాఖ అధికారులు వాయిదా వేయడం మంచిదని మంత్రికి సూచించారు. వెంటనే మంత్రి వాయిదా వస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో ముఖ్యమంత్రితో చర్చించి పరీక్షల నిర్వహణ తేదీని ఖరారు చేస్తామని తెలిపారు.

జూన్ 8 నుంచి ఆయా పరీక్షలను నిర్వహించాలని షెడ్యూల్ కూడా విడుదల చేసిన ప్రభుత్వం అదనపు పరీక్షా కేంద్రాలను నెలకొల్పింది. కరోనా వ్యాప్తి నివారణకు అవసరమైన చర్యలు కూడా సిద్ధం చేసింది. పలుమార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందన్న అభిప్రాయంతో మరోసారి పరీక్షలు వాయిదా పడినట్లయింది. విద్యార్థులంతా పరీక్షలు రాయడానికి చదువుకుని మానసికంగా సిద్ధమైన సమయంలో ప్రభుత్వం నుంచి ఊహించని తీరులో ఈ నిర్ణయం రావడం గమనార్హం. పదో తరగతి పరీక్షలను మరోసారి వాయిదా వేయడాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) స్వాగతించింది. వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గి పరీక్షల నిర్వహణకు అనుకూలంగా పరిస్థితులు మారే వరకు వేచి చూడాలని టీపీటీఎఫ్‌ఓ ప్రకటనలో కోరింది.

Tags:    

Similar News