సరిహద్దులో విమానాల మోత

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులో టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతోంది. అక్కడ ఓ చిన్నపాటి యుద్ధవాతావరణం కనిపిస్తున్నది. ఇరుదేశాల విమానాల గస్తీ శబ్దాలు సరిహద్దు ప్రాంతాల్లో మోత మోగిస్తున్నాయి. భారత వైమానిక దళాలు గస్తీ కాస్తుండగా చైనా విమానాలూ బౌండరీకి 10 కిలోమీటర్ల సమీపానికి వచ్చి పెట్రోలింగ్ చేస్తున్న దృశ్యాలు సాధారణమవుతున్నాయి. భారత ఎల్ఏసీకి సమీపంలో సమస్యాత్మక ప్రాంతాలు నార్త్ సబ్ సెక్టార్(దౌలత్ బెగ్ ఓల్డీ సెక్టార్), గాల్వాన్ లోయలో పెట్రోలింగ్ పాయింట్లు 14, 15లు, పెట్రోలింగ్ […]

Update: 2020-06-27 10:00 GMT

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దులో టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతోంది. అక్కడ ఓ చిన్నపాటి యుద్ధవాతావరణం కనిపిస్తున్నది. ఇరుదేశాల విమానాల గస్తీ శబ్దాలు సరిహద్దు ప్రాంతాల్లో మోత మోగిస్తున్నాయి. భారత వైమానిక దళాలు గస్తీ కాస్తుండగా చైనా విమానాలూ బౌండరీకి 10 కిలోమీటర్ల సమీపానికి వచ్చి పెట్రోలింగ్ చేస్తున్న దృశ్యాలు సాధారణమవుతున్నాయి. భారత ఎల్ఏసీకి సమీపంలో సమస్యాత్మక ప్రాంతాలు నార్త్ సబ్ సెక్టార్(దౌలత్ బెగ్ ఓల్డీ సెక్టార్), గాల్వాన్ లోయలో పెట్రోలింగ్ పాయింట్లు 14, 15లు, పెట్రోలింగ్ పాయింట్ 17(హాట్‌స్ప్రింగ్స్ ఏరియా), ప్యాంగాంగ్ సో సహా ఫింగర్ ఏరియాల్లోనూ చైనీస్ చాపర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఎల్ఏసీ సమీపానికి చైనా పెద్దఎత్తున బలగాలు, ఆయుధాలు, యుద్ధ సామగ్రిని తరలించుకుంది. సుఖోయ్-39 సహా అత్యాధునిక యుద్ధ విమానాలు, వ్యూహాత్మక బాంబర్‌లనూ బోర్డర్‌కు తరలించింది. శాంతి వచనలు చర్చల్లోనే గానీ సరిహద్దులో కనిపించకపోవడంతో భారత్ కూడా చైనాకు దీటుగా వైమానిక దళాలను మోహరిస్తున్నది. తాజాగా, భూమిపై నుంచి ఆకాశంలోని యుద్ధ విమానాలను సెకన్‌ల వ్యవధిలోనే నేలకూల్చే ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్‌‌లనూ సరిహద్దుకు తరలించింది. ఎయిర్‌ఫోర్స్‌తోపాటు ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్స్‌ను చేరవేసినట్టు ఓ ప్రభుత్వాధికారి తెలిపారు. అంతేకాదు, చైనా బలానికి సమతూగేలా ఇతర మిత్ర దేశాల నుంచి భారత్ స్వల్ప సమయంలోనే అత్యధిక సామర్థ్యమున్న ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థలను సమకూర్చుకోవచ్చునని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. సరిహద్దులో నిఘా లోపాలు లేకుండా భారత్ చర్యలు తీసుకుంటున్నది. చైనాతో ఉన్న సరిహద్దు పొడువునా ఆయుధ సామగ్రితోపాటు బలగాలనూ మోహరిస్తున్నది.

ప్యాంగాంగ్‌లో చైనా హెలిప్యాడ్ నిర్మాణం

సమీప భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య శాంతి చర్చలకు షెడ్యూల్ లేదు. ఒకవైపు ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నా చైనా ఆర్మీ మాత్రం ఎల్ఏసీలో దూకుడుగా వ్యవహరించడం మానడం లేదు. తాజాగా, సరిహద్దును మార్చుతూ ప్యాంగాంగ్ సో ఏరియాలోని ఫింగర్ 4లో చైనా ఆర్మీ హెలిప్యాడ్ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఎనిమిది వారాలుగా పలు నిర్మాణాలను చేపట్టింది. ప్రస్తుత ఉద్రిక్తతలు మొదలవ్వడానికి పూర్వం ప్యాంగాంగ్ సో, ఈ సరస్సు ఉత్తర తీర ప్రదేశం ఇరుదేశాల మధ్య సమస్యాత్మక ప్రాంతంగా ఉండేదన్న సంగతి తెలిసిందే. ప్యాంగాంగ్ సో సరస్సు ఉత్తర తీరంలో చైనా ఆర్మీ కదలికలు పెరిగాయి. ఫింగర్ 3 వద్ద చైనీస్ ఆర్మీ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసింది. భారత సైన్యాన్ని ఫింగర్ 2కే పరిమితం చేయాలని ఆ దేశ సైన్యం భావిస్తున్నదని ఓ అధికారి తెలిపారు. ఈ పరిణామాలతో సరిహద్దులో యథాతథ స్థితిని నెలకొల్పడానికి తాము సానుకూలంగా లేమని చైనా తేల్చి చెబుతున్నదని మరో అధికారి అభిప్రాయపడ్డారు. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గడానికి చైనా విముఖత చూపుతున్నదని ఆరోపించారు. కాగా, ఫింగర్ 3, 4 ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఫింగర్ 3లో భారత మెయిన్ బేస్‌కు రెండు కిలోమీటర్ల సమీపంలో చైనా బలగాలున్నాయి. ఫింగర్4కు సమీపంలో భారత్‌కు చెందిన అడ్మినిస్ట్రేటివ్ బేస్ ఉన్నది. చైనా బలగాలను కౌంటర్ చేయడానికి భారత దళాలు ఇక్కడ మోహరించి ఉన్నాయి. ఈ రెండు దళాల మధ్య సుమారు అరకిలో మీటర్ దూరం మాత్రమే ఉన్నది. సమీప భవిష్యత్తులో మిలిటరీ, దౌత్య అధికారుల చర్చలు లేకపోవడం, జరిగిన సమావేశాల్లో కుదిరిన ఏకాభిప్రాయాన్ని చైనా తృణీకరించడం, బలగాలను క్రమంగా ముందుకు కదిలిస్తూ వస్తుండటంతో సరిహద్దులో పరిస్థితులు ఇంకా దిగజారే ప్రమాదమున్నది.

సముద్ర జలాలపై చైనా తప్పుడు వాదనలు: ఆగ్నేయాసియా దేశాలు

కేవలం భారత్‌తోనే కాదు తైవాన్ సహా ఆగ్నేయాసియా దేశాలతోనూ చైనా గిల్లీకజ్జాలకు దిగింది. భారత్‌తో భూ సరిహద్దుపై వివాదానికి దిగగా, 10 ఆగ్నేయాసియా దేశాలతో సముద్రజలాలపై ఆధిపత్య ప్రదర్శనకు పూనుకుంది. దీనికి వియత్నాం ఆధ్వర్యంలో పదిదేశాలు ముక్తకంఠంతో చైనాను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశాయి. శుక్రవారం నిర్వహించుకున్న వీడియో కాన్ఫరెన్స్‌లో వియత్నాం, మలేషియా, ఫిలిప్పీన్స్, బ్రూనై సహా పలుదేశాలు చైనా వితండవాదంపై చర్చించాయి. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ అంతర్జాతీయ ఒప్పందాలు సముద్ర జలాలపై దేశాల సార్వభౌమ హక్కును ప్రకటించాయని, కానీ, చైనా ఆ ఒప్పందాలకు విరుద్ధంగా వెళ్తున్నదని తప్పుబట్టాయి. తమ దేశాల పరిధిలోని జలాలపై డ్రాగన్ దేశం ఆధిపత్యానికి దిగిందని ఆరోపించాయి. వియత్నాం ఆది నుంచీ చైనా దుందుడుకుతనాన్ని నిలదీస్తూనే వస్తున్న సంగతి తెలిసిందే. కాగా, చైనా మాత్రం చారిత్రకంగా చూస్తే ఆ సముద్ర జలాలు తమ దేశానికే చెందుతాయని వాదిస్తున్నది.

Tags:    

Similar News