వారికి బ్రేక్.. ప్రస్తుతానికి రేవంత్‌దే బాధ్యత
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీని వీడే నేతలను ఆపేందుకు ఆ పార్టీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఒక్కొక్కరుగా పార్టీని నేతలు వీడుతుండటంతో నివారణ చర్యలు చేపట్టింది. అయితే రేపో, మాపో టీపీసీసీకి కొత్త చీఫ్‌ను ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీలోకి వెళ్లే నేతలకు అడ్డుకట్ట వేసే బాధ్యతలను నేతలపైనే పెట్టారు. రాష్ట్ర స్థాయిలో తాత్కాలికంగా రేవంత్‌రెడ్డికే ఈ బాధ్యత పెట్టారని పార్టీ నేతలు వెల్లడించాయి. అయితే టీపీసీసీ చీఫ్ ప్రకటించేలోగా పార్టీని వదిలే నేతలతో […]
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీని వీడే నేతలను ఆపేందుకు ఆ పార్టీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఒక్కొక్కరుగా పార్టీని నేతలు వీడుతుండటంతో నివారణ చర్యలు చేపట్టింది. అయితే రేపో, మాపో టీపీసీసీకి కొత్త చీఫ్‌ను ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీలోకి వెళ్లే నేతలకు అడ్డుకట్ట వేసే బాధ్యతలను నేతలపైనే పెట్టారు. రాష్ట్ర స్థాయిలో తాత్కాలికంగా రేవంత్‌రెడ్డికే ఈ బాధ్యత పెట్టారని పార్టీ నేతలు వెల్లడించాయి. అయితే టీపీసీసీ చీఫ్ ప్రకటించేలోగా పార్టీని వదిలే నేతలతో చర్చలు సాగించాలని, అసంతృప్తి లేకుండా చూడాలని పార్టీ నేతలంతా దీనిపై దృష్టి పెట్టాలని అధిష్టానం ఆదేశించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆదివారం రాత్రి నేతలతో మాట్లాడారు.
జానారెడ్డితో ఠాగూర్ వీడియోకాల్..
పార్టీ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డితో మాణిక్యం ఠాగూర్ ఆదివారం రాత్రి పార్టీ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయనతో వీడియో కాల్లో మాట్లాడిన ఠాగూర్… జానారెడ్డి పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతుందని, ఎవరూ తొందరపడవద్దని సూచించారు. పార్టీ మారే ప్రచారాన్ని జానారెడ్డి కొట్టిపారేశారు. కాంగ్రెస్‌ను వీడమంటూ ఠాగూర్‌కు హామీ ఇచ్చారు. అంతేకాకుండా సాగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి అంశంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, త్వరలోనే రాష్ట్రానికి వచ్చిన తర్వాత సమావేశమవుతామని జానారెడ్డి వివరించినట్లు పార్టీ నేతలు వెల్లడించారు.
ఎవరూ వెళ్లవద్దు
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి నేతలు దారి పడుతున్న నేపథ్యంలో వారందరినీ నిలువరించే బాధ్యతలను నేతలపై పెడుతున్నారు. ప్రస్తుతం అంజన్ కుమార్ యాదవ్‌తో మాట్లాడిన రేవంత్… ప్రచారానికి బ్రేక్ వేయాలని సూచించారు. దీంతో ఆయనను మీడియాతో మాట్లాడించారు. ఠాగూర్ ఆదేశాలతో ఇతర నేతలతో కూడా మాట్లాడుతున్నారు. అయితే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో సోమవారం ఉదయమే రేవంత్‌రెడ్డి నివాసంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రస్తుతానికి పార్టీని వీడేది లేదని, అయితే టీపీసీసీ చీఫ్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చర్చించుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగిస్తే కొంతమేరకు ప్రయోజనం ఉంటుందని, పార్టీ శ్రేణులు కూడా ఇదే అంశంలో చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.
అంతా కలిసి ఉండండి
రాష్ట్రానికి ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం వరకు కొత్త టీపీసీసీ చీఫ్ ఎవరనేది దాదాపుగా తేలిపోతోంది. ఇప్పటికే రేసులో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ పోటీ పడుతుండగా… వి.హనుమంతరావు కూడా రేసులో ఉంటున్నానని, తానే అసలైన అర్హుడనంటూ ప్రకటించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకు టీపీసీసీ ఇస్తే ఎలా అంటూ రేవంత్‌ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. ముందు నుంచీ కొంతమంది సీనియర్లు రేవంత్ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇప్పుడు పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన నేత కోసం అధిష్టానం ఆచితూచీ వ్యవహరిస్తోంది. ఉత్తమ్ రాజీనామా అనంతరం కొత్త టీపీసీసీ చీఫ్ అంశంపై అధిష్టానం నుంచి ఠాగూర్‌తో పాటు పలువురు నేతలు రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం ఎవరికి వచ్చినా కలిసి ఉండాలని, పార్టీని వీడాలనే ఆలోచన చేయరాదంటూ సూచించారు. టీపీసీసీకి ఆశపడిన నేతలకు ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తామంటూ కొంతమందికి హామీ ఇస్తున్నారు.
ప్రత్యామ్నాయం మనమే
రాష్ట్రంలో బీజేపీది కేవలం నీటి బుడగ తరహా పొంగు మాత్రమేనని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మనమేనంటూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం శ్రేణులకు భరోసా నింపే ప్రయత్నాలు చేస్తోంది. నూతన టీపీసీసీ చీఫ్ ప్రకటించే నేపథ్యంలో పార్టీ నేతలకు భరోసా, ఉత్సాహం కల్పిస్తోంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, పార్టీని వీడిన నేతలు కూడా త్వరలోనే తిరిగి వస్తారంటూ చెప్పుతున్నారు. మరోవైపు కేంద్ర వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ముందుగా ఉద్యమం చేయాలంటూ పార్టీకి పలు ఆదేశాలు జారీ చేశారు.